Friday 21 November 2014

కవి సంగమం # 31 #

 # ఆమె లేచిపోలేదు #


లేచిపోయింది 
హవ్వ... ఎంత కళ్ళు మూసుకుపోకపోతే అట్టా చేస్తుంది 
ఎంత మదం తలకెక్కకపోతే ఇంత బరి తెగిస్తుంది 
ఎంత అవమానం స్త్రీ జాతికెల్ల దీని వల్ల 
కట్టుకున్న వాడిది , కన్న వారిది అందరి పరువు ఏం గాననుకుంది 
బిడ్డలన్నా గుర్తు రాలేదా 
దీనికన్నా వేశ్యలు నయం కదా 
ఇంతకన్నా ఏ నూతిలోనో  దూకి చావరాదా 

అబ్బ 
ఎంత బావుంటుందో కదా 
ఇలా నీతి గట్టున నిలబడి మాట్లాడడం , నిందలెయ్యడం
పరమ పవిత్రత , పాతివ్రత్యం ముసుగుల్లో బతకడం 
మనసులో ఉన్న మాలిన్యాన్నంతా ఏదొక వేషం కింద నెట్టి నటించెయ్యడం 
ఆరోపించడం మాని ఆలోచించరాదా 
ఇంతటి విద్యావేత్తలు , ఉన్నతులు ..... మీకు తెలియనిదేముంది 
 ప్రపంచమంతా నాటకరంగమే అయినా ...
ప్రతీ నాలుగు గోడల మధ్య జరిగే సన్నివేశాలు వేరు కదా
మొహానికి నవ్వు రంగేసుకుని  తిరిగే దంపతుల 
గదిలో ఎన్నడూ నిశ్శబ్ధమె రాజ్యమేలుతుందేమో 
చీటికి మాటికి చిరుబురులాడుకునే వాళ్ళ మధ్యనే 
ఎప్పుడూ గాలికి కూడా చోటుండదేమో 
ఏం తెలుసు మనకి 

ఎవరికి తెలీదిక్కడ 
A woman gives least importance to the sex and
first priority to the love అని 
ఆమెకి కావలసింది నునుపు దేరిన కండలు 
ప్యాకులు గా విడిపోయిన దేహం 
facials వల్ల వచ్చే రంగు కాదని 
కావలసిందల్లా ప్రేమతో నిండిన నాలుగు మాటలేనని. 
స్త్రీ మనసును క్షుణ్ణంగా ఎరిగిన స్త్రీలే స్త్రీని నిందించడం ఎంత దారుణం 

ఆమెకక్కడ ఏం  కరువయ్యిందో ?
ఏ నిస్సహాయ క్షణం ఆమె మనసుని అతగాడి మీద పారేసిందో?
ఇది తప్పన్న స్పృహ మొదటిసారి తనువిచ్చినప్పుడు ఎంత కలిచివేసిందో ?
అతడు ఆమెలోని ఎవరూ ఎరుగని ఏ దుఃఖపు పొరని 
తన స్పర్శతో చీల్చి వేసాడో ?
హృదయాంతరాళాలలో దాగిన ఏ వేదనని తన సామీప్యంతో 
తుత్తునీయలు చేసాడో ?
ఏ త్రిశంఖు స్వర్గాల వెంబడి ఆమెని పయనింపజేసాడో ?
సంఘం , గౌరవము , తాళి , పాతివ్రత్యం కన్న గొప్పదనుకున్న 
ఏ స్వేచ్చా భావన ఆమెని అతని వెంట పరుగులు తీయించిందో 
ఏం తెలుసు మనకి ... నిదించండం ఎందుకు ?
సొసైటీ కోసం నటించగలగడం తప్ప జీవితం కోసం తెగించలేని మనకెక్కడిది 
అసలు మాట్లాడే హక్కు 
అందుకే 
ఆమె లేచిపోలేదు ..... తెంచుకుని వెళ్ళిపోయింది అంతే


22-11-2014


1 comment:

  1. నిజమే మోహన్ గారూ !సమాజం కోసం నటించే మనకెక్కడిది ఆమెను నిందించేహక్కు?చలంని గుర్తుకుతెస్తున్నారు సారూ!

    ReplyDelete