Sunday 9 November 2014

కవి సంగమం # 23 #

# Personified Beasts #

  
ఏడాది మొత్తం ఎంతో ఆప్యాయంగా పెంచి
బిడ్డల ఆలనా పాలానా కూడా పట్టించుకోక
చోళ్ళు, గంట్లు, జీడిపప్పులు పెట్టి మేపి
సంక్రాతి బరిలో దింపి
మనుషలకి మల్లె జెలసీ , ద్వేషం , ఉక్రోషం లాంటి ఏ రోగాలు లేని
స్వచ్చమైన స్వజాతి పక్షుల మధ్య వైరం ఉసి గొల్పి
ఊరికే ఎగిరి తన్నుకుంటుంటే అంత రసవత్తరంగా అనిపించక
కాళ్ళకి కత్తులు కట్టి
దేహం తెగి నెత్తురు ఈకలకి కొత్త రంగద్దుతుంటే
కళ్ళు బైర్లు కమ్మి తూలిపోతుంటే
ఇక చాలని చావుని ఆహ్వానించే సరికి
మొహం మీద నీళ్ళు చిమ్మి మళ్ళీ బ్రతికించి
పోరాడి ఓడి కూలబడిన పుంజుని
ఉక్రోషం ఆపుకోలేక కొన ప్రాణం తీసేసే పందెం రాయుడికి
ఆ ఆట చూసి చప్పట్లు కొట్టే ఆహూతులకి

ఏ విహారానికో వచ్చి పొరపాటున చిక్కిన టూరిస్టునో
తెగించి ఏదో చేద్దామని వచ్చిన జర్నలిస్టునో
యుద్దభూమి లో దొరికిపోయిన సైనికుడినో
బంధించి
ఈడ్చుకెళ్ళి చేతులు కట్టేసి , మోకాళ్ళ చిప్పలు విరిచేసి
వృషణాలని కసిగా నలిపి మానభంగం చేసి
తూలి కింద పడుతుంటే మూత్రం చల్లి లేపి
ఏ జీపుకో కట్టి ఎడారుల్లోకి ఈడ్చుకెళ్ళి
మొండి కత్తితో గొంతు కోస్తూ
నరాలు పర పరా తెగే శబ్దాన్ని ఆస్వాదిస్తూ
చిమ్మిన నెత్తురులోని వెచ్చదనాన్ని ఆహ్లాదిస్తూ
దృశ్యాన్ని చిత్రీకరించే మతోన్మాదికి
ప్రత్యక్షంగానో , పరోక్షం గానో అది పదే పదే చూసి
సంతృప్తి చెందే వీక్షకులకి

నాకెందుకో తేడా కనబడదు ..


అందరూ
ఎవరి ఆలోచనా పరిధిలో వాళ్ళు కరెక్ట్
పరిధి దాటితే నిజాలు నిగ్గు తేలతాయ్
అందుకే ఆలోచించాలంటే మనకి భయం
Comfort zone లో బ్రతకడానికే కాదు...
ఆలోచించడానికీ అలవాటు పడిపోయాం...
ప్రేరణ ఏదయినా కావచ్చు
బహుశా వాడికి డబ్బు , వీడికి మతం
ప్రాణం ఏదయినా ప్రాణమేగా
పుట్టుకతోనే మనమంతా క్రూరులం
మనిషి ముసుగులో బ్రతికేస్తున్న మృగాలం ..

09-11-2014


No comments:

Post a Comment