Tuesday 8 May 2012

నిడదవోలు నుంచి ఏలూరు మీదుగా విజయవాడ

నిన్న సాయంత్రం మా బాబు మామిడి కాయల మూట తీసుకుని ఇంటికొచ్చాడు..కాసేపు మా అమ్మ, అయన వాటిని మావగాయ పడదామా, ఆవకాయ పడదామా అన్న విషయం మీద తర్జనభర్జన పడ్డారు..చివరికి ఆవకాయ అని నిర్ణయానికొచ్చారు..ఇంతలో మా బాబు విజయవాడలో ఉన్న మా లిల్లి ఆంటి కి ఫోన్ చేసి రేపు మోషేగాడితో(ఎవరో అనుకోకండి ఆ దౌర్భాగ్యుణ్ణి నేనే..ఇంట్లో నా పేరు మోషే.) మామిడి కాయలు పంపుతున్నాను...అని చెప్పారు...కనీసం నన్ను ఒక్క మాట అయిన అడక్కుండా రేపటి నా దినచర్య గురించి డిసైడ్ చేయడమేంటి అని అడుగుదామనుకున్నాను...కానీ ధైర్యం చాలలేదు...అసలు సమస్య అది కాదు..పొద్దున్నే లేచి 7 గంటల ట్రైన్ కి వెళ్ళాలి...అంటే 5 కి లేవాలి...మన వల్ల  అవుతుందా...!! మొత్తానికి వెళదామని డిసైడ్ అయ్యాను..ప్రయాణం ఉంది కాబట్టి త్వరగా పడుకోవాలనుకొని నైట్ ఒంటిగంట కల్లా పడుకున్నాను...ఉదయం 5:30 కి అమ్మ లేపింది. నిద్ర సరిపోకపోవడం వల్ల కళ్ళలో ఇసుక పోసుకున్నట్టుంది.. కానీ లేవాలి తప్పదు. మొత్తానికి లేచాను. చీకటిగా ఉంది. 
 అసలింత చీకట్లో జనాలు లేచి ఏం చేస్తారు? అసలు మా అమ్మ ఏం చేస్తుంది రొజూ. ఆ డౌట్స్ అన్ని తీర్చుకునే టైం లేదు. అందుకే బ్రష్ నోట్లో పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ పళ్ళు తోముతున్నా..మా అమ్మ వచ్చి ఏంట్రా గాల్లోకి చూస్తున్నావ్ అంది. సూర్యోదయం చూద్దామని..చాలా సంవత్సరాలయ్యింది కదా అన్నాను..సూర్యుడు పడమర వైపు కాదు తూర్పున ఉదయిస్తాడు అంది...చెప్పు తెగిపోయింది పొద్దున్నే..ఆ అవమానంతో సూర్యోదయం చూడకుండానే స్నానానికి వెళ్ళిపోయాను..

మాసిపోయిన గడ్డంతో, చేతిలో మామిడి కాయల సంచితో బయలుదేరి మా బాబు ఎదురుగా నిలబడ్డా వెళ్లి..మా బాబు వంద రూపాయల కాగితం చేతిలో పెట్టాడు..ఆశ్చర్యంతో ఆయన వంక చూసాను..”వంద రూపాయలతో విజయవాడకి ప్రయాణం ఎలా చేస్తారండి”? అన్న నా ప్రశ్న గొంతులోంచి బయటకి రాకుండానే మా బాబు అర్ధం చేసుకుని  లెక్కలు చెప్పడం మొదలు పెట్టాడు..ట్రైన్ టికెట్ రాను,పోను నలభై రూపాయలు, ఆటో చార్జీలు ఇరవై, నీకు అయ్యే ఖర్చు అరవై..ఇంకా నలభై extra ఇచ్చాను..ఆయన explanation తో వెళ్ళబెట్టిన నోరు మూసుకుని బయలుదేరాను..నా  బాధ అర్ధం చేసుకున్న మా అమ్మ ఇంకో వంద చేతిలో పెట్టింది..

ట్రైన్లో ఈగ దూరడానికి కూడా ఖాళి లేదు..కానీ నేను దూరాను..మెట్ల దగ్గర ఉన్న వాష్ బేసిన్ ఎదురుగా నిలబడి అద్దంలో నా  ముఖారవిందం చూసుకున్నాను. అక్కడ నుంచున్న ఇద్దరు సగటు భారతీయ మహిళలు అరుచుకు చస్తున్నారు..వాళ్ళ గోల భరించలేక చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను..”దేహం తిరి వెలుగన్నది” అని రహమాన్ పాట మొదలయ్యింది.  తరువాత వయ్యారి గోదారమ్మ, ఈ చైత్ర వీణ, తరలి రాద తనే వసంతం ఇలా నా పాటల ప్రయాణం,రైలు ప్రయాణం రెండు సాగాయి..మనకి పాటలుంటే ప్రపంచంతో సంబందం ఉండదు..ప్రతీ స్టేషన్ లో ఇద్దరు దిగుతున్నారు, నలుగురు ఎక్కుతున్నారు..విజయవాడ వరకు నేను అక్కడే నిలబడి ఉన్నాను..

మొత్తానికి విజయవాడ చేరుకునేసరికి 10:30 అయ్యింది..వేసవి కాలంలో బెజవాడ వెళ్ళడమంత  బుద్ది తక్కువ పని ఇంకేముండదు..అదీ “మే”లో..స్టేషన్ నిండా కనకదుర్గమ్మకి తల నీలాలు సమర్పించిన గుండ్లు..అన్నింటిని దాటుకుని బయటికొచ్చాను..రోడ్డు పక్కన ఉన్న ఒక ఇడ్లి బండి దగ్గరకెళ్ళాను..వాడు కింద మంట లేకుండా ఎండలోనే పెనం పెట్టి అట్లు వేస్తున్నాడు..గబగబా రెండు ఇడ్లీలు మింగి ఆటో ఎక్కి ఆంటి ఇంటికెళ్ళాను..మధ్యాహ్నం అక్కడే విశ్రమించి సాయంత్రం 4:30 కి మళ్ళి బయలుదేరాను. మళ్ళి అదే పాసింజర్…5:30 కి స్టార్ట్ అవుతుంది.కానీ బండి  బయలుదేరేది అక్కడినుంచే కాబట్టి 4:30 కే platform మీద పెట్టాడు..ఈసారి మాత్రం సీటు సంపాదించాను..భొగీ బొగ్గుల పోయ్యిలా మండిపోతుంది..సీటు చూడమని పక్కావిడకి చెప్పి కిందకి దిగాను..రెండు kinley వాటర్ బాటిల్స్ కొనుక్కుని ఒకటి అక్కడే గటగటా తాగేశాను..మొత్తానికి 5:30 కి బండి బయలుదేరింది..నా సీట్లో కూర్చున్నాను..కిటికీ పక్కన ఒక అందాల రాశి..అబ్బో చాలా అందంగా ఉంది..వర్ణించమంటే నా వల్ల కాదు..నేనేమన్నా నండూరినా? యండమూరినా? కానీ ఒకటి మాత్రం చెప్పగలను..ఆ పిల్ల వెన్నెల్లో ఆడపిల్లకి, ఎంకికి మధ్యలో ఉంది..పక్కనే వాళ్ళ నాన్న, ఎదురుగా వాళ్ళ అమ్మ...నా ఎదురుగా ఒక బక్క పలచటి స్త్రీ..ఆమె ఒళ్ళో ఒక పసి పిల్లాడు..పక్కనే ఆమె కూతురు,వాళ్ళ అయన. చూస్తుంటే నిరుపేద కుటుంబం అని తెలుస్తుంది..నా పక్కన ఒక పెద్దావిడ..ఒక 40 ఉంటాయ్..కేవలం వయసులోనే కాదు, ఆకారంలో కూడా పెద్దావిడ..అసలు శ్రీలంకలో ఉండాల్సిన మనిషి ఇక్కడెందుకుందో నాకర్ధం కాలేదు..ఆమెను చూడగానే జాషువా రాసిన పద్యమొకటి గుర్తొచ్చింది...
ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె
విహరణము సేయసాగె గబ్బిల మొకటి

కిటికీ పక్కన కూర్చున్న వెన్నెల్లో ఎంకి నా వైపు ఓరగా ఓ చూపు చూసింది..ఇంకేముంది నా హృదయ స్పందన శృతి తప్పింది...
ఊహలు హద్దులు దాటుతుంటే అంతరాత్మ గాడు గొడవ మొదలెట్టాడు..

ఒరేయ్ మోహన్ ఏం చేస్తున్నావ్ రా??నీ మొహం అద్దంలో చూసుకున్నావా?
“చూసుకున్నాను..నాకే బాగానే ఉన్నాను..కాస్త గడ్డం పెరిగింది అంతే..”
కాస్త కాదురా చచ్చు వెధవా పంపాలు,ప్రయరీలు అంటారే ఆ గడ్డి భూముల్లా పెరిగింది..
“పరవాలేదు..అందానికి గడ్డం అడ్డు కాదు..”
గడ్డం సంగతి సరే..ముందు నెత్తి మీద ఊడిపోయిన ఆ నాలుగెకరాల సంగతి ఏమిటి..?ఆ పిల్ల చూసావా ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీకి వచ్చినట్టుంది..
“అవునురా మరీ చిన్న పిల్లలా ఉంది మనం చూడడం పాపమేమో..అయినా ఏం కాదులేరా ఈ మధ్య సౌత్ కొరియా "అధ్యక్షుడు తనకన్నా ౩౦ సంవత్సరాలు చిన్న అమ్మాయిని చేసుకున్నాడుగా.”
ఆయన అధ్యక్షుడు రా...మరి నువ్వు..

అంతరాత్మ గాడి మాట విని కాసేపు వెన్నెల్లో ఎంకిని చూడడం మానేసాను..ఇంతలో గుణదల స్టేషన్ వచ్చింది..ఒకావిడ ఇద్దరు పిల్లలతో ఎక్కింది..కానీ కూర్చోవడానికి ప్లేస్ లేదు..అలాగే నిలబడింది..నా పక్కావిడ..అటుగా వెళుతున్న సమోసాల వాణ్ణి ఆపి ఆరు సమోసాలు కొనుక్కుంది..ఉన్న ఆకారం సరిపోదని మళ్ళి ఈ చిరుతిళ్ళు ఎందుకో...???అయినా నాకెందుకు ఆవిడ మీద అంత కోపం..అందంగా లేదనా!!..ఉంటే మాత్రం ఆ వయసు స్త్రీని ఏం చేసుకుందామని??...చలం పుస్తకాలు చదవకూడదనుకుంటూనే చదివాను...మరి మనసుకి ఇలాంటి ఆలోచనలు కాక ఏమొస్తాయ్...అయినా నిజానికి నా కోపం ఆమె అందంగా లేకపోవడం గురించి కాదు..అంత భయంకరమైన ఉక్కపోతలో,ఇరుకులో కాళ్ళు పైకి ముడుచుకుని ఒళ్ళో కనకాంబరాలు,మల్లెపూలు వేసుకుని మాల కట్టుకుంటుంది..ఆవిడ సరిగ్గా కూర్చుంటే అక్కడ ఇంకొకళ్ళు కూర్చోవచ్చు...అయ్యో.....సగటు భారతీయ మహిళా నీకింక మార్పు రాదా?? అయినా మనకెందుకులే... అవతల కోహినూరు వజ్రాన్ని పెట్టుకుని ఈ సింగరేణి బొగ్గు గురించి అలోచించి సమయం వృధా చేసుకొనేల...

మళ్ళి వెన్నెల్లో ఎంకి...పాపం ఉక్క పోతకి చున్ని తీసి మెడ చుట్టూ వేసుకుంది..పైన ఎవడిదో చైనా మొబైల్లో “రంగులలో కలవో ఎద పొంగులలో కళవో” పాట వస్తుంది..తొలగిన ఆమె భుజం మీది పంజాబి డ్రెస్ కిందగా పెట్టికోట్ అంచు కనపడుతుంది..ఇది ఏమి చిత్రమో గదా...ఆడపిల్ల దుస్తుల అంచులకి కూడా మగాడికి రక్తపోటు తెప్పించే శక్తి ఉంది..అయినా ఇంకా పెట్టి కోటేమిటి..???

అంతరాత్మ గాడు ఇంక ఊరుకోలేదు...
ఒరేయ్ చచ్చు వెధవా అది చిన్న పిల్లరా...కళ్ళు పోతాయ్
“పొతే పోనివ్వురా ఇంత అందాన్ని చూసాక ఉంటే ఎంత పొతే ఎంత”
చూసి ఏమి సాధిస్తావు రా?
“పేరు తెలుసుకుంటా”
తరువాత?
“ఫోన్ నంబర్”
ఛ తరువాత?
“ఏముంది పరిచయం పెంచుకుంటాం”
ఒరేయ్ ఇవన్నీ జరిగే పనులు కాదురా..అటు చూడరా పాపం అరగంట నుంచి ఇద్దరు పిల్లలతో ఒక స్త్రీ నిలబడి ఆపసోపాలు పడుతుంటే తాపీగా కూర్చుని చిన్నపిల్లకి సైటు కొట్టడానికి సిగ్గు లేదా??
“మరి ఇంకా చాలా మంది ఉన్నారుగా మగాళ్ళు కూర్చుని”
వాళ్ళు సగటు భారతీయ పురుషులు రా
“ఏదో అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యడానికి అనుకుంటారేమోరా”
అనుకోర్రా నా మాట విను...

అంతరాత్మ గాడి మాట విని లేచి ఆవిడకి సీటిచ్చాను..బండి ఏలూరు దాటింది..ఇంతలో ఒకావిడ వాటర్ బాటిల్ పట్టుకుని వచ్చి ఎవరన్నా కాసిన్ని వాటర్ ఉంటే పొయ్యండి పిల్లాడు ఏడుస్తున్నాడు అంది..ఎవ్వరు ఇవ్వట్లేదు..అంతరాత్మ గాడి గోల మొదలు..

ఒరేయ్ మోహన్ గా??
“ఏమిట్రా??”
పాపం వాటర్ ఇవ్వరా నీ బాటిల్ నిండా ఉన్నాయిగా...సగం పొయ్యి..
“ఒరేయ్ అవి మినరల్ వాటర్ రా...15 రూపాయలు పెట్టి కొన్నాను...”
వెధవ బీరు బాటిళ్లకి వందలు తగలేసినప్పుడు లేదా ఇవ్వు నష్టమేమి లేదు..
బాటిల్లో సగం నీళ్ళు పోసాను..ఆవిడ చాలా ఆనంద పడింది...నా అంతరాత్మ దాహం తీరింది...

సీటు ఖాళి అయ్యింది..కూర్చున్నా..నా ఎదురుగా కూర్చున్న బక్క పలచటి స్త్రీ పిల్లాడికి పాలిస్తుంది... నాకు భయం వేసింది...ఆమె ఎముకల గూడు మీద చర్మం, చీర కప్పినట్టుంది.... అసలు పాలెలా వస్తున్నాయో నాకర్ధం కాలేదు...ఈ మధ్యనే ఎక్కడో చదివాను..ఒక పాల చుక్క తయారవ్వాలంటే వంద నెత్తుటి చుక్కలు ఖర్చవుతాయంట...ఈ లెక్కన ఆ తల్లి వాడికి ఒక సంవత్సరం పాలిస్తే చచ్చిపోతుంది...ఆలోచిస్తే కళ్ళలో నీళ్ళు  తిరిగాయ్...అమ్మ గుర్తొచ్చింది...ఆకలి రాజ్యం సినిమాలో పాట గుర్తొచ్చింది...

సంతాన మూలికలము సంసార బానిసలము సంతాన లక్ష్మి మనదిరా సంపాదనొకటే కరువురా

ఇక ఆ దృశ్యం చూడలేక తల తిప్పాను..వెన్నెల్లో ఎంకి నిద్రపోతుంది...టైం 8 అయ్యింది..రివ్వున వీస్తున్న చల్లగాలికి ఆమె కురులు ఎగురుతుంటే చూడముచ్చటగా ఉంది...లయబద్దంగా ఉన్న రైలు చక్రాల చప్పుడు ఆమెకి జోల పాడుతుంది...ఎంత వింత..సర్వ సాధారణమైన నాలాంటి వాళ్ళు ప్రయాణించే పాసింజర్ లో అప్సరస ప్రయాణిస్తుంది...ఆకాశం ఆమె అందాన్ని చూడటానికి అదే పనిగా మెరుస్తోంది..నాలాగే హృదయస్పందన శృతి తప్పిందేమో ఉరుముతోంది...అలా ఎంత సేపు చూసానో తెలీదు...ఇంతలో రైలు బండి ఆగింది..ప్లాట్ ఫారం మీద “welcome to nidadavolu” అన్న సౌండ్ వినబడి ఈ లోకంలోకి వచ్చాను..దిగేసాను...రైలు బండి కదిలింది..కిటికీ మీద తల వాల్చి పడుకున్న ఎంకి కళ్ళు తెరిచి నా వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వింది..రైలు బండి వేగం పుంజుకుంది...ఆకాశంలో మబ్బులు తొలగి నా హృదయం మీద పాల వెన్నెల కురిసింది...

కదలక, కదలాలనిపించక
కనులు తడియగ
చూడగ
కేవలం చూస్తూనే ఉండాలనిపించక...
మదనుని విరిజడి
శరమై వెలువడి...
మతిచెడి
ఎదసడి..
మనసున అలజడి.....
అంటూ యండమూరి "ప్రేమ"లో మాటలు నెమరు వేసుకుంటుండగా.....రైలు చీకట్లో కనుమరుగయ్యింది...


Monday 7 May 2012

నా కళ్ళ నిండా నువ్వే నిండిపోతే...

ప్రియా....నా కళ్ళ నిండా నువ్వే నిండిపోతే, 
కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే... 
అంటే నేను కన్నులుండి గుడ్డివాడిని...  
నీ అందాన్ని మాత్రమే చూపించే అందమైన అంధత్వం 
అమోఘం, అనిర్వచనీయం..
 నా కళ్ళ నుండి నువ్వు తప్పుకుంటే నాకు కనిపించేది,
  ప్రపంచం కాదు ప్రియా... 
మరో ప్రపంచపు ప్రవేశ ద్వారం 
నా ఆకస్మిక మరణం...

పెద్దలు కుదిర్చిన పెళ్లి

నాకు నచ్చిన అమ్మాయి దొరకకపోవడం వల్లనో, నేను ఏ అమ్మాయికీ నచ్చకపోవడం వల్లనో భయమో, ఏమో.. కారణమేమైనా నేనెవ్వరినీ ప్రేమించలేదు... చాలా రోజుల పాటు పెళ్ళి  కూడా చేసుకోలేదు.
  
అమ్మ పోరు పడలేక చివరికి ఒక అమ్మాయిని చూడడానికొప్పుకున్నాను.. మా కారు అమ్మాయి ఇంటి ముందు ఆగగానే హడావుడి మొదలయ్యింది.. ముందు అమ్మ, నాన్న... వెనక అక్క, నేను తల ఎత్తి నడవడానికి ఇబ్బందే, దించి నడవడానికి ఇబ్బందే.. అక్కడున్నవాళ్ళంతా నన్ను చూడడానికే ఎదురు చూస్తున్నారన్న విషయం గుర్తోచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఇంకొంచెం పెరిగింది.. ఇలా ఈ ఇంటికి పెళ్లి చూపులకొచ్చిన ఎన్నో పెళ్లి కొడుకునో నేను అన్న అనుమనమూ వచ్చింది.. కాసేపాగాక అడుగులో అడుగేసుకుంటూ లోపలనుంచి వచ్చింది అమ్మాయి.. ఆమె వస్తున్నవైపు అలికిడి తెలిసి కళ్ళు అటు తిరిగాయి.. తెల్లని పాదాలు...వాటిని అందంగా అలంకరించిన గోరింటాకు.. చప్పున తలెత్తి చూసేద్దామనిపించింది...మళ్ళీ ఎందుకో ఆగిపోయాను... రెండు నిముషాలు అంతా నిశ్శబ్దం...ఇంతలో అక్క మెల్లగా తట్టింది పిల్లని చూడమన్నట్టు.. అప్పుడు తల పైకెత్తి చూసాను మెల్లగా....  

ఆమె కురులు అమావాస్యనాటి అర్ధరాత్రి, అంబుధి మీద అలుముకున్న కారుచీకటి, ఆమె కను రెప్పలు హోరు గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కలు ఆమె ముక్కు సంపెంగ... అబ్బా ఇంకా ఏమని చెప్పను...ఆమె కుందనపు బొమ్మ మారు మాట్లాడకుండా నచ్చిందని తలూపాను..

 తరువాతన్నీ ఆఘమేఘాల మీద జరిగిపోయాయి.. సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసెయ్యాలని అందరూ నిశ్చయించుకున్నారు.. అనుకున్న రీతిలోనే ఆ నెల రోజుల తర్వాత నిశ్చితార్ధం జరిగిపోయింది.. అందరబ్బాయిల్లాగే నేను కూడా అమ్మాయికి సొల్లు ఫోను కొనిచ్చాను... ఎంగేజ్మెంట్ అయిన రెండు రోజుల తర్వాత తడబడుతూ నూటొక్క సార్లు డయల్ చేసి కట్ చేశాను.... తర్వాత ధైర్యం తెచుకుని కాల్ చేసాను... ఎంత తియ్యగా ఉందో ఆ గొంతు... ఇక్కడ మళ్ళీ సమస్య నేను పేరు పెట్టి పిలవాలా, అండి అని పిలవాలా అని... చివరికి ఏవండీ అని మొదలెట్టాను... మొదటి రోజు రెండు మూడు నిమిషాలకన్నా ఎక్కువ మాట్లాడలేదు.. రెండవ రోజు కొంచెం సమయం పెరిగింది... మూడవ రోజు కాస్త చనువు పెరిగింది... నాలుగువ రోజు ఆమె "నన్ను ఏవండి అనొద్దండి పేరు పెట్టి పిలవండి" అంది.. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఒకరోజు మెలకువొచ్చింది... ఒకటే ఆలోచనలు... 23 సంవత్సరాలుగా నా ముక్కు, మొహం తెలియని అమ్మాయి మూడు నిమిషాలు నా ముందు కూర్చుని ఏం అర్ధం చేసుకుందో నన్ను, అసలు నేనేం అర్ధం చేసుకున్నాను... నా దగ్గర మాట్లాడుతున్న ఈ పంచదార పలుకులన్నీ నిజమేనా? నిజమే అయితే సహజమా? కృత్రిమమా? ఇన్నేళ్లుగా లేని ప్రేమ అకస్మాత్తుగా ఇప్పుడు ఏం జరిగిందని పుడుతుంది... అంటే ఈ ప్రేమని బలవంతంగా తెచ్చి పెట్టుకుంటున్నామా... ఇలాంటి అలొచనలన్నీ దోలిచేస్తున్నాయి... ఇంతలో గుర్తొచ్చాయి మళ్ళీ ఆమె కనురెప్పల రెపరెపలు... అలొచలన్నీ మారిపోయాయి... పెళ్ళైపోయింది...  

మొదటి రాత్రి పాలు తీసుకుని వచ్చింది నా భార్య.. నా అర్ధాంగి, నా సతీమణి, నా సఖి, నా ప్రియురాలు..నా ఎదురుగా నిలుచుంది.. ఒక అనిర్వచనీయమైన అనుభూతి..జీవితంలో ఒకసారి మాత్రమే కలిగే అనుభూతి.. వయసొచ్చిన దగ్గరనుంచి మొదటిరాత్రి గురించి కన్న కలలు... ఎన్ని రకాల కలలు.. ఈ చిన్ని రాత్రి సరిపోతుందా... పక్కన కుర్చోమన్నాను... నీకోసం నేనొక పాట పాడతాను అన్నాను... మరది సిగ్గో, ఆశ్చర్యమో అర్ధం కాలేదు గాని పాడండి అంది... నేను "వయ్యారి గోదారమ్మ" పాట పాడదామనుకొని ఆగి నువ్వు చెప్పు నీకేం పాట కావాలో అన్నాను... ఒక 5 నిముషాలు తీవ్రంగా అలోచించి.... స్టాలిన్ సినిమాలో పరారే పరారే పాట పాడండి అంది... అరగంట కష్టపడి రాజేసిన మంట మీద ఎవరో బిందెడు నీళ్ళు కుమ్మరించినట్టయ్యింది.... ఇంక పాటల గురించి మాట్లాడడం అనవసరం అని నాకర్ధమయిపోయింది... నీకు శ్రీశ్రీ తెలుసా అని అడిగాను... మొన్న TV9 లో చెప్తే విన్నాను అంది... చలం గారు తెలుసా అన్నాను.. పాత సినిమా ఆక్టర్ కదా అంది... యండమూరి తెలుసా అన్నాను..... అంతర్ముఖంలో వస్తాడు ఆయనే కదా ఒకసారి చూసాను అంది.. సినిమాలు చూస్తావా అని అడిగాను... చూస్తాను అంది.. నీకిష్టమైన 4 సినిమాలు చెప్పు అన్నాను... ఈమధ్యవి అయితే...స్టాలిన్, బాస్, ఆట...ఇంకేదో చెప్పబోతుంటే చాలు అన్నాను... ఇష్టమైన హీరో ఎవరు అంటే ఉదయకిరణ్ అంది... నాకింక ఏమీ మిగలలేదు.. ఆమె మనస్తత్వం పూర్తిగా అర్ధమైపోయింది.... వెయ్యి పిడుగులు ఒకసారే తల మీద పడ్డట్టయ్యింది... నా మొహం కళ తప్పి కాస్త కోపంగా మారే సరికి నా వంక భయంగా చూసింది... మళ్ళీ అవే కనురెప్పల రెపరెపలు...కోపమంతా పోయింది.... మా అనుమతితో దీపం ఆరిపోయింది..  

సంవత్సరం గడిచిపోయింది... ఒకనాడు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తీ నా బాధ అంతా కక్కుక్కున్నాను... ఎన్ని కలలు కన్నానురా జీవిత భాగస్వామి గురించి..... రోజుకొక కవితతో నిద్ర లేపుదామనుకున్నాను... తనని ఎంకి అని పిలిచి నన్ను నాయుడు బావా అని పిలిపించుకుందామనుకున్నాను... ఇళయరాజా బాణీకి నా గొంతుతో తన గొంతు కలపాలనుకున్నాను... బాలు పాట, శ్రీశ్రీ మాట అన్నీ తనతో పంచుకుందామనుకున్నాను... అర్ధరాత్రి గోదారి ఇసక తిన్నెల మీద వెల్లికిలా పడుకుని తననొకసారి, చందమామనొకసారి చూసి కవ్విద్దామనుకున్నాను... ఎదురెదురుగా కూర్చుని అల్లసాని పద్యాలతో ఆడుకుందామనుకున్నాను... పాప్ పాటలకి స్టెప్పులేయిద్దామనుకున్నాను... ఏదీ నెరవేరలేదు...ఏమీ మిగలలేదు... ఆమె మాత్రం మనం డిగ్రీలో ఉండగా మొదలయిన మొగలిరేకులు సీరియల్ ఇంకా చూస్తుంది... నరకమయిపోయిందిరా జీవితం..

  ఒకసారి ఆఫీస్ అయిపోయాక ఇంటికెళ్ళాను... వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది నా భార్య.. ఏమిటోనమ్మ ఈయన నాకర్ధం కాడు... ఎంతసేపూ ఏవో పిచ్చి పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు... పాత పాటలు వింటాడు... అదేదో ప్రియమణిది తమిళం సినిమా.. ఆ...... పరుత్తివీరన్ అంట, ఇప్పటికి దాన్ని ఒక 30 సార్లు చూసాడు.. కష్టపడి వంట చేస్తే కనీసం బాగుంది అని కూడా అనడు... చేపల కూర వండితే చారుతో తిని లేచిపోతాడు.. ఏదో లోకంలో ఉంటాడు... ఏం కావాలన్నా కొంటాడు...కానీ నాతో అస్సలు మాట్లాడడు... ఎంతసేపూ ఏవో రాసుకుంటూ ఉంటాడు... అసలు సరైన బట్టలు వేసుకోడు... ఏదైనా చెప్తే సగమే వింటాడు... చచ్చిపోతున్నానమ్మా...నరకమయిపోయింది జీవితం....

బాపూజీకొక లేఖ

బాపూజీకి ఒక భారత పౌరుడు రాయునది....


భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రీమించుటలేదు, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద చూసి నేను గర్వపడుట లేదు....................................................................................................


బాపూ....

భారతిని తెల్లదొరలు చెరబట్టి 250 సంవత్సరాలు కసితీరా అనుభవించాక అహింస పేరు చెప్పి వాళ్ళని బాబు బాబు అని బ్రతిమాలి వారి చేతినుంచి విడిపించి మువ్వన్నెల పైట కప్పి మాకప్పగించావ్...

నువ్వు వాళ్ళకే వదిలేస్తీ కనీసం ఆమె పాతివ్రత్యమైనా మిగిలేదేమో...మమ్మల్ని నమ్మి మా చేతిలో పెట్టి పోయావ్...మా వాళ్ళు నువ్వు నీ స్వంత చేతులతో నేసి ఇచ్చిన "అహింస" అనే తెల్ల దుప్పటి కింద చేస్తున్న దారుణాలు అన్నీ, ఇన్నీ కావు...నువ్వు అప్పగించింది మొదలు ఈ రోజు వరకూ భారతికి అనుక్షణం మానభంగం జరుగుతూనే వుంది...

ఎప్పటినుంచో రాద్దామనుకున్నాను నీకు ఈ లేఖ...సరైన సమయం రాలేదు..ఈరోజు ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం కదా...అందుకే రాస్తున్నాను...మన తెలుగు నిఘంటువుల ప్రకారం హింసకు పాల్పడే, నరబలిని కోరుకునే, మతం మత్తులో పసిపాపను సైతం మసి చీసీ వాళ్లకి మనం పెట్టుకున్న పేర్లు "ఉగ్రవాది","తీవ్రవాది","హింసావాది","ఉన్మాది"....ఇంకా ఏవో....వీటన్నిటికీ వ్యతిరేక పదం "అహింసావాది" అంటున్నారు...మరి వీళ్లందర్నీ ప్రేరేపించే వ్యక్తి రాజ్యసభలో నీ చిత్రపటం ముందు కూర్చుని నేను అహింసావాదిని అని చెప్పుకుంటున్నాడు...అందుకే నాకది పర్యాయ పదం లా కనపడుతుంది..

అడవుల్లోనూ, అజ్ఞాతంలోనూ ఉండి అప్పుడప్పుడూ వచ్చి అరాచకాలు చేస్తున్న వాళ్ళనే తీవ్రవదులు,ఉగ్రవాదులు అంటున్నారు...వాళ్ళు చేసేదే హింస అంటున్నారు...

తెల్లవారితే నీ పాటలే నేర్పే మాష్టారు అభం,శుభం తెలియని ఆడపిల్లని చెరచడానికి చూస్తాడు...
మా నాన్న కూడా పుట్టలేదంట ఈ వరకట్న నిరోధక చట్టం వచ్చేసరికి,
మొన్నే కట్నం కోసం నిండుచూలాల్ని నిలువెత్తునా నిప్పంటించి చంపేశారు అత్తా,మావలు...
ఒక పన్నెండేళ్ళ పిల్ల ఆసుపత్రికొచ్చింది..తనకి పుట్టబోయే బిడ్డ వాళ్ళ నాన్నదో, అన్నదో చెప్పమని...
మూడు లక్షల రూపాయల ఆస్తి కోసం భార్యతో కలిసి, కన్న తల్లిదండ్రులని కడతేర్చాడొకడు..ఇంకా ఎందరో....
చెప్పుకుంటూ పోతే ఈ లేఖ పూర్తయ్యే లోపు నా ఆయుష్షు నిండిపోతుంది..
వీళ్ళందరికీ ఇంకా ఏ పేర్లూ పెట్టలేదు...మనుషులు అనే పిలుస్తున్నారు..
వీళ్ళకి ఏ హానీ జరగకుండా మన రక్షక భటులు బంధించి రక్షకభట నిలయాలుగా చెప్పబడే విడిది గృహాలలో చేర్చారు...వాళ్ళకి శిక్ష విధించడానికి వీల్లేదు...ఒకవేళ శిక్ష వేద్దామనుకున్నా,
మానవహక్కుల సంఘం వాళ్ళు నీ చిత్రపటాలు చేతిలో పట్టుకుని రోడ్డెక్కి వాళ్లకి అండగా నిలబడతారు..

భావి పౌరులుగా చెప్పబడ్డ నేటి యువతరం...
ప్రియురాలి ప్రేమలోనూ...
రోడ్డు పక్క కారులో పడుపుకత్తె కౌగిలిలోనూ..
మధుశాలల్లోనూ, మత్తులోనూ...
పరాయిదేశాలకి సంపాదించి పెట్టే పనిలోనూ..
పీకల్లొతు వరకు మునిగి ఉన్నారు...

నా భారతి నగ్నంగా నడివీధిలో నిలబడి ఉంది..నువ్వు కప్పిన మువ్వన్నెల జెండా రాజకీయ నాయకులు, స్వార్ధపరులు ఎప్పుడో ముక్కలు ముక్కలుగా చింపేసారు..కొన్ని వందల సంవత్సరాలుగా తనకి జరుగుతున్న ఈ దారుణాన్ని భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయపడి జాతిపితవయిన నీకు ఈ లేఖ రాస్తున్నాను...

ఒక్కసారి రా... అహింస పేరుతో జరుగుతున్న హింసకి చరమగీతం పాడు..మా చేతికి ఈటెలు, కత్తులూ ఇచ్చి వెళ్ళు..ధనార్జన కోసం జరుగుతున్నదారుణ మారణ క్రీడలో వంద నోటు మీద ముద్రించబడ్డ నీ మొహం ఎప్పుడో రక్తంతో తడిసిపోయింది..వచ్చి వాటిని తగలబెట్టి వెళ్ళు..క్రూరమృగాల కొమ్ము కాస్తున్న ఈ పనికిమాలిన చట్టాలని తిరగరాసి వెళ్ళు. నువ్వు ఎగరేసి వెళ్ళిన శాంతికపోతం రెక్కలు పీకి, చంపుకు తినేసారు...ఈ నాటి ఈ హింసాకాండకి ఆనాటి నీ అహింసాసూత్రమే కారణమని చెప్పి వెళ్ళు...

నువ్వు అందరు దేవుళ్ళు ఒక్కటే అన్నావు...కొన్ని మతాలేమో హింస మహా పాపం అని చెబుతున్నాయి...కొన్ని మతాలేమో పరుల హింసే పరమ సోపానం అని చెబుతున్నాయి..నీకు ఏ దేవుడు తీర్పిచ్చాడో నాకు తెలియదు...అందుకే ఈ లేఖ నరకానికొక కాపీ స్వర్గానికొక కాపీ పంపిస్తున్నాను...అందుకున్న వెంటనే వస్తావు కదూ...

ఆమె అత్తోరిల్లు హైదరాబాదు

మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరు అగ్రహారం అని చిన్న పల్లెటూరు..

కమల, నేను చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులం..
ఇద్దరం పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం..తరువాత ఇద్దరం మానేసాం...
ఎంత బాగా ఆడుకునేవాళ్ళమో చిన్నప్పుడు
బట్టలు రాత్రి నానబెట్టుకుని పొద్దున్నే లేచి గోదారికెళ్ళి ఉతుక్కుని వచ్చేవాళ్ళం..
ఎంత బావుంటుందో గోదారికెళ్ళే దారి
దారికి అటు, ఇటు చెరుకు తోటలు, కమ్మగా కూసే కోయిలలు,
ఎర్రగా పండి రాలిన చేమ చింత కాయలు
భయం భయంగా చూసే ఉడత పిల్లలు
అప్పుడప్పుడు పాము, ముంగీస చెరుకుతోటలోంచి బయటికొచ్చి దార్లోనే దెబ్బలాడుకునేవి.
గోదారికెళ్ళేటప్పుడు చెప్పులేసుకునేవాళ్ళం కాదు ఇసుకలో నడిచేటప్పుడు, గట్టెక్కేటప్పుడు పట్టివ్వవని..
ఎంత అందంగా ఉంటుందో మా ఉరు..
చిలుకలు, చిలక పచ్చ రంగు పంట చేలు
మిగల ముగ్గిన జామ పళ్ళు
ఇంటిపక్కనే విరగబూసిన సన్నజాజి తోట
దొంగతనానికెళ్ళిన రాజు గారి మామిడి తోట
పరుగులు తీసే పంట కాలవ
ఇంకా ఎన్నో....
అయిదేళ్ళ క్రితం కమలకి, నాకు ఒకసారే పెళ్ళయ్యింది..
మా అత్తోరి ఊరు పక్కనే పెండ్యాల...
కమల అత్తోరి ఊరు హైదరాబాదు..
పెళ్ళయ్యాక మేమిద్దరం మళ్ళీ కలుసుకోలేదు..
మొన్న సంక్రాంతికి పిల్లల్ని తీసుకుని వచ్చింది...
నేను కూడా వెళ్లాను... ఎంత ఆనందమేసిందో అన్ని రోజుల తరువాత దాన్ని చూస్తున్నందుకు..
మనిషి మొత్తం మారిపోయింది..
సరిగ్గా కట్టుకోకపోతే ఆడవాళ్ళు చీరలో మరీ చిరాగ్గా ఉంటారని అప్పుడే అర్ధమయ్యింది నాకు..
కనపడగానే నవ్వింది...అందులో ఆనాటి స్వచ్చత లేదు...
పలకరింపు కూడా కొత్తగానే ఉంది..."ఎట్లున్నవ్" అంది...
పట్నం నుంచి వచ్చింది కాబట్టి కబుర్లన్నీ అదే చెప్పింది...
సాయంత్రం పూట నక్లెస్ రోడ్లో కూర్చుని హుస్సేన్ సాగర్ నీళ్ళు, బుద్ద విగ్రహం చూస్తే భలే ఉంటుందంట...
"హుస్సీన్ సాగర్ ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మురికి కాలవ అట కదా" అని అమాయకంగా అడిగాను..
"ఏం కాదు" అంది...
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయంట....
అందులో మమూలోళ్ళు ఎమీ కొనలేరంట...
పెద్ద పెద్ద లైట్లు రోజంతా వెలుగుతూనే ఉంటాయంట...
ఆప్పుడర్ధమయ్యింది నాకు పల్లెటూళ్ళో రోజుకి 10 గంటలు కరెంటెందుకు తీసేస్తున్నారో...
మొత్తం ఊరంతా తిరగాలంటే కనీసం 2 రోజులైనా పడుతుందంట...ఇంకా చాలా చెప్పింది...
ఇంతలో వాళ్ళమ్మొచ్చి కొబ్బరిబొండం నీళ్ళిస్తుంటే వద్దు కాఫీ తీసుకురమ్మంది...
వాళ్ళ పిల్లోడు ఆడుకోడానికెళ్తుంటే పిలిచి " ఏడికి వోతున్నవ్...డాడొచ్చినంక చెప్త మస్తు సతాయిస్తున్నవని" అంది..
ఆ పిల్లోడు మాట్లాడిందైతే నాకసలు అర్ధమే కాలేదు..
సరదాగా అలా గోదారికెళ్దామన్నాను...
హ్యాండ్ బ్యాగ్ లోంచి అద్దం తీసుకుని మొహానికి అదేదో రాసుకుని, లిప్స్టిక్కేసుకుని, హై-హీల్స్ చెప్పులేసుకుని బయలుదేరింది...
ఎందుకు ఇవన్నీ అన్నాను...
హైదరాబాదు లో ఈ మాత్రమైనా మేకప్ వేసుకోకుండా ఆడవాళ్ళు శవాన్ని చూడడానికి కూడా వెళ్ళరని చెప్పింది..
దారంతా మమ్మల్ని చూడటమే...
గట్టెక్కుతుంటే ఆ చెప్పు హీలు కాస్తా విరిగిపోయింది...
చెప్పులు చేత్తో పట్టుకుని నడవడానికి నామోషీ అంట అక్కడే పాడేసింది...
వచ్చేటప్పుడు అడిగాను ఎందుకే నీ భాష అలా మారిపోయింది అని...
"హైదరాబాదు ల గట్లనే మాట్లాడతరు" అంది...
మరిది హైదరాబాదు కాదుగా అన్నాను...
నా వంక అదోలా చూసింది...
అందరూ నీ వంక వింతగా చూస్తున్నారు...దానికి చూడు స్టైలెంత పెరిగిందో అనుకుంటున్నారు అన్నాను..
అప్పుడదేదో తీసుకోమంది...
ఆ...........లైటు... లైటు తీసుకోమంది...

నాకై వేచి ఉన్న రాధకై

ఆమె
మేలైన పారిజాత పూరేకుల నుండి వెలువడు పరిమళ ద్రవ్యము
ఆమె
కారు మేఘముల నడుమ తళుక్కుమని మెరసి కవ్వించు విద్యుల్లత
ఆమె
అవధులు లేని అభ్రమును చీల్చుకుని వయ్యారముగ నేలకు జారు మందాకినీ ప్రవాహము
ఆమె
వసంతకాల పౌర్ణమి నాడు కాంతులీను బృందావనమున విరియు కుసుంభము
ఆమె
మరుడు ఇంద్రచాపమెక్కుపెట్టి సంధించెడు పన్నీరు పూల సరము(శరము)
ఆమె
సృష్టికర్త కంసాలియై అపురూపముగ మలచుకున్న అపరంజిత
ఆమె
నిశీధి వేళ స్మర్యంత సింధూర అలంకృతయై స్వప్నమున అగుపించు ప్రియదర్శిని
ఆమె
విరహాగ్ని జ్వాలలచే వేధింపబడి
సుదీర్ఘమైన ఏకాంతముచే బాధింపబడి
నా రాకకై ఎదురుచూచుచున్నది
ఆమెయే నా రాధ

వరం-శాపం


మగువకి మరపొక వరం మగాడికి మనసొక శాపం

"చెక్కిలి"గిలి

నా పెదవులొలికించు మరందముల మరకలంటుకొన ఎంత పుణ్యం చేసుకున్నవో నీ బుగ్గలు
నీ నునులేత గులాబి చెక్కిళ్ళను ఎంగిలి చేయ ఎంత అదృష్టం చేసుకొన్నవో నా అధరములు

యుగాంతం...


యుగాల నిరీక్షణని కళ్ళలో నింపుకొని నాకోసం ఎదురు చూస్తూ
నువ్వు..వేల సుడిగుండాల అడ్డంకులు దాటుకుని నీ చెయ్యి అందుకోవాలన్న ఆత్రంతో నేను..
మన కలయిక జరిగిన నాడే యుగాంతం.
.

వేకువ జ్ఞాపకం




ఋతుపవనాల అల్లరి మరీ ఎక్కువైంది...
ప్రకృతి పులకించి జలకమాడుతూనే ఉంది...
ప్రభాకరుని జాడ లేనే లేదు...
రోజూ వచ్చి నా ఇంటి ముందు రెక్కలు దులుపుకునే పిచ్చుకలన్నీ
ఎక్కడికి పోయాయో ఈ రోజు!!

వేడి వేడి తేనీరు గొంతు దిగుతుంటే
రాత్రి కలలో నువ్విచ్చిన వెచ్చని కౌగిలి జ్ఞాపకమొచ్చింది...
మరింక నీ పిలుపు విననిదే నిలువదు నా మనసు...
చెలికాడిని కనికరించి నిద్ర చాలించు చెలీ.....!!

మరో ప్రపంచంలో మనిద్దరం


నీకోసం ప్రపంచాన్నంతా వెలి వేద్దామని కోరిక నాకు... 
మనిద్దరమే మనుషులం, మనిద్దరివే మనసులు.. 
నగ్నంగా ఆది జంటమల్లె మనదైన లోకంలో విరామమెరుగక విహరిస్తూ....... 
భగ్గుమన్న వయసు వేడిలో కాలిపోతుంది సిగ్గు
అణిచిపెట్టిన కోరిక కట్టలు తెంచుకుంటుంది.. 
నా మనసు నీ తనువుకి, నీ మనసు నా తనువుకి పంపే రహస్య సందేశాలు మన చెవుల పడవు.. 
చుట్టూ ఉన్న అనంతానంత జల సమూహాలు ఒడలున పెరిగే వేడిని చల్లార్చలేవు..అధరముల తేనె ధారలు తప్ప.. 
తొలి ముద్దు తాపం తుంచడానికి..మలి ముద్దు మోహం పెంచడానికి.. 
రహస్య శోధనకి కేశముల కాశ్మీరమున మొదలైన పెదవుల ప్రయాణం కాలి చిటికినవేలి కన్యాకుమారి వరకూ ఆగదు.. 
మన నిశ్వాసాల వేడికి వెర్రెక్కిన గాలి మన కౌగిలి తీవ్రతకు సాక్షి.. 
ఒకరి ఊపిరి ఆపడానికి మరొకరు చేసే వింత హత్యాయత్నం.. 
దృశ్యాన్ని చూడకూడదని కనురెప్పలు కనుపాపల కళ్ళు మూస్తాయి... 
ఎన్నేళ్ళుగానో ఊరించి వెక్కిరించిన నీ వక్షోజములపై నా కరములు కక్ష తీర్చుకుంటాయి.. 
అద్వితీయమైన అనుభవం పొందుటకు జరిగే క్షీర సాగర మధనంలో అమృతం మనిద్దరికీ దొరుకుతుంది.. 
అక్కడే ప్రశాంత దీవిలో అలసిన మనకి... 
ఇసుక తిన్నెలే పట్టు పరుపులు..
మసక వెన్నెలలే నేస్తాలు..
 
పిల్లగాలులే వింజామరలు
ఒకరి పెదవులొకరికి ఆహారం... 
అక్కడే మన ప్రేమ అమరం..

ప్రాణమా

ఎక్కడున్నావు ప్రాణమా?
నా మనోభావాలన్నిటికీ మూలమై, నా సర్వాంగాలకి సూచనలిచ్చి నడిపించు మెదడు పొరలలోనా?
సకల సౌందర్యాలను తనలో ఇముడ్చుకున్న ఈ రంగుల లోకాన్ని చూపించు కనుల కొలుకులలోనా?
నాసిక ద్వారముల వెంట నాలో చొరబడి తనువులోని అణువణువును చేరు శ్వాసలోనా?
ఎక్కడున్నావు ప్రాణమా?
గుండెలో ఏ కవాటము కొనను పట్టుకు వేలాడుతున్నావు?
అలుపెరుగక పయనించు ఏ నెత్తురు ధారలలో మునిగి జలకాలడుతున్నావు?
పుపుస సిరలోనా? హృదయ ధమనిలోనా?
నరాలలోనా? నాడులలోనా?
కండరాలలోనా? కనురెప్పల కదలికలలోనా?
ఎముక మజ్జలోనా? వెన్నుపూసల మధ్యలోనా?
ఎక్కడున్నావు?
నా దానివైనా నిన్ను చూసుకునే అదృష్టం లేదు నాకు..
అమ్మ కడుపున పడ్డ నాటి నుంచి నాతోనే ఉన్న నువ్వు అకస్మాత్తుగా ఒకనాడు మాటమాత్రమైనా చెప్పకుండా ఈ అవయవాలన్నిటినీ స్తంభింపజేసి వెళ్ళిపోతావు...
మరెక్కడ కలుస్తావు నన్ను?

BROKEN HEART

 
చెలీ......కాలిలో చిన్న పెంకు దిగినందుకే అల్లాడిపోతున్నావే......
మరి నువ్వు తొక్కి వెళ్ళిపోయిన ఆ గాజు హృదయం నాదే...
ఒక్క క్షణమైనా ఊహించావా నా బాధ ఎలా ఉంటుందో ???