Wednesday 30 December 2015

RUDHIRA SWAPNAM

Indus Martin & Mohan Talari
//రుధిర స్వప్నం //
----------------------------

చూసేదేదీ నిజం కాదు 
వినబడే నిశ్శబ్ధమంతా 
సైలెన్సర్లో డబ్బింగ్ చేయబడ్డ ఒక ఆర్తనాదం 
మాయమౌతున్న మాస్కురేడ్ చిరునవ్వుల స్థానే 
రక్తంతాగిన మోన్స్టర్ కోరలు మొలుస్తున్న సమయాన 
అసలెవర్ని నమ్మాలి?

నిద్రపోవడమంటే 
ఒక నెత్తుటిస్వప్నంలో మేల్కోవడమే 
నాలుగు పేరాల వివక్షలెత్తివేసినంత సులభంగా 
తాళపత్రాల కాలంనుండీ పేరుకున్న
మకిలిని మనసులనుండి కడిగివెయ్యలేక 
కసిని , ఆకలిని పంటి కింద అణచుకొని 
అవకాశం కోసం మాటు వేసిన 
మేకవన్నె పులుల నవ్వులు
నానాటికీ పదునుదేరుతున్న కత్తులు 
శగలు కక్కుతున్న రాతలు 
తెగిపడుతున్న తలలు

లౌకిక భారతంలో 
రాజ్యాంగం ఒక లక్కయిల్లు 
గోవర్ధనగిరిధారుని కనిష్ఠిక నీడలోనిలబడని ప్రతివాడు 
శూతపుత్ర రాధేయుడే 
అసలుఉద్దేశ్యం రావణ సంహారమే
గోసంరక్షణ విభీషణ పట్టాభిషేకం

వూడలమర్రికి వేళ్ళాడుతున్న 
విద్వేషపు గబ్బిలాలు రెక్కలు విప్పుతున్నాయి 
కెంజాయ వర్ణంలో పడమటి సూర్యుడు
అంధకారానికి ఆహ్వానం పలుకుతున్నాడు 
వెలుతురును సహించని దేశం 
నమ్మకాల తిమిరాలలోకి మరొక్కసారి జారిపోతుంది.

05/11/2015