Friday 31 October 2014

కవి సంగమం # 17 #

#నిఖార్సయిన భారతీయుడు#



మా సూరిగాడు
నా దేశం వెనకబడిపోయిందో అంటాడు
తెగించి ఒక్క అడుగు ముందుకు వెయ్యడు
నా దేశం ఉన్నత శిఖరాలు చేరాలంటాడు
ఒళ్ళొంచి పని చేయించే వాడికి ఓటెయ్యడానికి కంగారు పడిపోతాడు
నా భార్యకీ పాడు దేశంలో రక్షణ లేదంటాడు
పొరుగింటి పుల్లకూర కోసం పాట్లు పడడం మానడు
స్వచ్చ భారతం కోసం స్పీచులిస్తాడు
రోడ్డున నడుస్తూ ఉమ్మే(చ్చే)సుకోడం మానలేడు
పక్కాడికి పుడితే మహాలక్ష్మయ్యా అదృష్టవంతుడివి అంటాడు
వాడికి పుడితే పైకి చెప్పడు గాని ఎంతో కొంత చస్తాడు
స్ట్రీట్ చిల్డ్రన్ ని అక్కున చేర్చుకునే వారే లేరా అంటాడు
అర్ధరూపాయి దానం కూడా ఆమడ దూరం నుంచి చేస్తాడు
భిన్నత్వంలో ఏకత్వం పాటించాలంటాడు
విభిన్న రీతుల్లో పోరుగోడిని మోసగించడం మానడు
వంద రూపాయల బీరు సీసాకాడ వన్ పర్సెంట్ డిస్కౌంట్ అడగడు
అయిదు రూపాయల కూరగాయల కాడ ఆస్తులేవో పోయినట్టే ఏడుస్తాడు
అయినా మాకు వాడెప్పుడు గొప్పోడు
ఎందుకంటే వాడు నిఖార్సయిన భారతీయుడు 


-        మోహన్ తలారి

కవి సంగమం # 16 #

# If I were a woman #


మేల్ డామినేషన్, పురుషాధిక్యత లాంటి మాటలు వింటే
ఒక్కోసారి ఉత్త నాన్సెన్స్ లా తోస్తుందినాకు
ముగ్గురునలుగురు మూర్ఖులవల్ల మొత్తం జాతిపై ఎంతటి అభాండం
అసలీ వ్యసనాలకి బానిసయ్యే స్వేఛ్ఛేలేకపోతే ఎంతటి బలహీనుడో తెలిసేది మగాడు
అందుకే నే స్త్రీనయితేనా!
అనిపిస్తుందొక్కోసారి..

నే స్త్రీనయితేనా,
కనీసం ప్రపంచంలో ఇద్దరిచేతనయినా పరిపూర్ణంగా ప్రేమిచబడేవాణ్ణి అమ్మనై..
ఉత్తస్పర్శతోనే ధీర్ఘకాలిక వ్యాధులు పోగొట్టేవాడిని
ఉత్తనవ్వుతోనే పాలపుంతలు వెలిగించేవాడిని
ఉత్తమాటలతోనే ఛైత్రవీణలు మోగించేవాడిని

నిజం నే చెప్పేది
మగవాడవడం వల్ల ఎంత కష్టం..
Basic Instincts చంపుకోలేను
చదివినప్పుడల్లా చలంతో గొడవ
ఎందుకొచ్చిన మగజన్మరా అంటాడు ప్రతీవాక్యంలో

అందుకే
నే స్త్రీనయితేనా
చీమకుట్టినా కడివెడు నీళ్ళు కార్చేవాడిని కళ్ళెమ్మట
నే మోసం చేసినా నన్ను మోసం చేసినా సమాజం నాపైనే జాలిచూపించేది
498 ని నుదిటిమీద పచ్చబొట్టేయించుకుని తిరిగేవాడిని
నా ఉత్త కనుసైగలకి,మౌనానికి ,మిస్డ్ కాల్స్ కి భర్త బెంబేలెత్తిపోతుంటే
ముసిముసినవ్వులు నవ్వుకునేవాడిని
ఇన్నిమాటలు అనవసరం
కేవలం "స్త్రీ" అన్న ఒక్క అర్హతవల్ల నా కుక్కపిల్ల ఫోటోకి కూడా కనీసం వంద లైక్స్ తెచ్చుకునేవాడిని

___మోహన్ తలారి

Wednesday 29 October 2014

కవి సంగమం # 15 #

## Non vegetarian ##


చేపల్ని కొన్నప్పుడు, పొట్టేళ్ల తలలు నరికినప్పుడు
ముక్కు , కళ్ళు మూసుకొని
వండినప్పుడు , తినేప్పుడు లొట్టలేసుకొని
ఎక్కువైతే చలి డబ్బాల్లో దాచుకుని
కుళ్ళిపోతే అవతల పారేసే మనుషుల్ని చూస్తే
నాకెందుకో నవ్వొస్తుంది


కోరుకున్న దాన్ని కసితీరా చంపి
విజయ చిహ్నంగా నెత్తురు మొహానికి పులుముకొని
కడుపారా తిన్నాక
మిగిలింది అందరికీ పంచే జంతువుల్ని చూస్తే
ఎందుకో చెప్పలేని గౌరవం పుడుతుంది

మనసెవరికి లేదు
మనిషికా ? జంతువుకా ?

నేనూ మనిషినే
నాకు మనసు లేదంటే ఒప్పుకోలేను

అయితే
గుండెల్నిండా కాఠిన్యం ఉన్నా చంపేప్పుడు జాలి నటించడమో
మనసు నిండా కారుణ్యం ఉన్నా తినేప్పుడు క్రూరత్వం ప్రదర్శించడమో
తప్పదు


- మోహన్ తలారి

Tuesday 28 October 2014

కవి సంగమం # 14 #

%% నవలోకం  %%


మిత్రమా
ఇదిగో చూడు
ప్రపంచం అంచుల చివర నిలబడి
చేతులు చాచి పిలుస్తున్నాను
నా దగ్గరికి రా నవలోకం నిర్మించుకుందాం

వచ్చేముందు ఒక్కసారి
ఆత్మ విమర్శ చేసుకో
అవసరమో కాదో నిన్ను నువ్వే ప్రశ్నించి చూసుకో
నిజంగానే అవసరం అనిపిస్తే అక్కడే ఉండిపో
ఇటువైపు కన్నెత్తైనా చూడకు

కానీ
విచక్షణ ఏ మాత్రం చెంప చెల్లుమనిపించినా
అన్నింటినీ వదిలి వచ్చెయ్
ఎలా అంటే అమ్మ కడుపులోంచి వచ్చినంత స్వచ్చంగా..
సంఘమే తొడిగిందో నువ్వే తగిలించుకున్నావో
జాతి,మత,కుల,వర్ణ మౌడ్యాలని బద్దలుగొట్టుకుని రా
మితిమీరిన జ్ఞానం కళ్ళకు కప్పిన పొరలు చీల్చుకుని రా

నన్ను నన్నుగా నువ్వు స్వీకరించగలిగితే
నిన్ను నిన్నుగా హత్తుకోడానికి నే సిద్దంగా ఉన్నాను

నవలోకం నిర్మించుకుందాం
కొత్త గేయాలు రచించుకుందాం
స్వేచ్చాగానాలు మనసారా పాడుకుందాం
ఈ పెద్దరికం ఏమిస్తుంది ..పనికిమాలిన గాంభీర్యం తప్ప
పిల్లలమవుదాం...పవలు, రాత్రి పువ్వులమల్లె నవ్వుకుందాం
ఇహలోక , పరలోక , పాతాళ లోక చర్చలు మనకొద్దు
ప్రేమించడం నేర్చుకుందాం ...

త్వరపడు మిత్రమా ..
చాలా పని ఉంది మనకి
మంటల్లో కలిసి సగం కాలి కొన ఊపిరితో
కొట్టుకుంటోంది మానవత్వం
ఎలాగోలా బ్రతికించుకుందాం
అచ్చంగా స్వచ్చంగా మనుషుల మల్లె జీవిద్దాం..
అచ్చంగా స్వచ్చంగా మనుషుల మల్లె మరణిద్దాం  

Monday 27 October 2014

కవి సంగమం ## 13##

## నా నాస్తికతను ప్రశ్నించకు ## 



నా పూర్వీకుడొకడు
అగ్ర వర్ణాధిపత్యాన్ని ఎదిరించినందుకు
పంచముడన్న ముద్ర నుదుటి మీద ముద్రించి
ఊరి నుంచి, ఆలయాల నుంచి బహిష్కరించినప్పుడు
అన్యాయం కదా ఇది ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు.

నా ముత్తాత ఒకడు 
ఊరి చివర పూరి గుడిసెలో 
వానకి తడిసి, ఆకలికి ఎండినప్పుడు
నడుముకి తాటాకులు కట్టుకుని 
తను నడిచిన బాటని తనే ఊడ్చినప్పుడు 
పాపం కదా ఇది ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు.

తెల్లవాడొకడు 
“నా మాట వింటే నీ బాధలన్నీ పోతాయ్” అని 
నాలుగు మెతుకులు అన్నం పెట్టి 
నాలుగు మూరల గుడ్డ కప్పి 
సముద్రాల అవతల నుంచి తెచ్చిన మతాన్ని
ఊరి చివర వారికి అంటించినప్పుడు 
తప్పు కదా ఇది ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు 

నా తాతలు అంటించుకున్న కొత్త మతాన్ని 
నరనరాల్లోకి ఎక్కించుకుని 
సంస్కృతి సాంప్రదాయాల్ని సిగ్గుతో కలిపి వదిలేసి 
మద్యానికి , మాంసానికి బానిసలై 
పరాయి దేవుడి మత్తులో చిత్తయిపోయినప్పుడు 
ఏమయిపోతున్నావో తెలుస్తుందా ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు..

దొరికిన ఒక్క ఆదివారాన్ని 
తోటి స్నేహితులందరూ హాయిగా ఆనందిస్తే ..
జుట్టు పట్టుకు ఈడ్చుకెళ్ళి 
చర్చి నాలుగు గోడల మధ్య 
నా తల్లి నా బాల్యాన్ని నాశనం చేసినప్పుడు 
ఏమిటమ్మా ఇది ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు...


రాగం, భావం లేని ఆ చెత్త భక్తి గీతాలు విని రోత పుట్టి 
పాట మీద మక్కువతో 
దొంగచాటుగా ఓనాడు అన్నమయ్య కీర్తనలు వినబోతే 
వెనకాలే వచ్చి వీపు మీద చరిచి 
పాటల క్యాసెట్ నేలకేసి కొట్టిన మా నాన్నని 
నువ్ మనిషివేనా ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు...

ఈనాడు 
నాకు స్వాతంత్ర్యం వచ్చాక 
సత్యాసత్యాలు తెలిసాక 
నాదంటూ ఓ బాటని నిర్మించుకుని 
అందులో సాగిపోతుంటే 
ఇన్నాళ్ళు ప్రశ్నించని నువ్వు 
ఎందుకు నాస్తికుడివి ?? అని ఇంకెప్పుడూ ప్రశ్నించకు ..

Tuesday 21 October 2014

కవి సంగమం #12#

DIVORCED



వెళ్ళిపోయావు కదూ ...
ఆ కాస్త అహాన్ని చంపుకోలేక,
ఆ అర్థం లేని కలహాలనే న్యాయ నిర్ణేతల్ని చేసి ,
ఏ పాపము ఎరుగని ప్రేమని గొంతు నులిమేసావు కదూ...

ఈ కొత్తదనం కూడా త్వరగానే పాతబడి రోత పుడుతుంది..
కాలం దొర్లిపోతుంది..

ఓనాడు......
ఏ అద్దం ముందు నిలబడ్డప్పుడో 
నీ కుంకుమ లో నే ప్రతి ఫలిస్తాను...
చంటాడి చేతి స్పర్శలో చల్లగా స్పృశిస్తాను..
బీరువాలోని ఏ చీర మడతలోంచో అనుకోకుండా జారి పడతాను..
గుండెల్లోంచి పెల్లుబికి చెలియలి కట్ట దాటి చెంపలపై కన్నీటి చారికనవుతాను...

ఆ వెచ్చని తడి అయినా ..
చలనం కోల్పోయిన నీ మది నదిలో జ్ఞాపకాల అలలు రేపితే ..
వెల్లువెత్తి నా చెంతకు రా ...
ఆనాడు నీ మెడలో మూడు ముళ్ళు వేసిన చోటే ..
అగ్ని సాక్షిగా ఎదురు చూస్తుంటాను..
ఈసారయినా అడుగులు తడబడకుండా వేద్దాం...


_ మోహన్ తలారి

Monday 13 October 2014

కవి సంగమం #11 #

(మనలోనే)

'విశ్వ వ్యాప్తమయిన ప్రేమ ...
నీలోనూ నాలోనూ ఇమడదు ' అని నేను వేదాంతం మాట్లాడితే 
నువు కేవలం నవ్వి ఊరుకోవడం నాకు గుర్తుంది 
మరి ఆ రాత్రి నువు చేసిన జ్ఞానోపదేశం గుర్తు లేదా??

నీ పక్కన పడుకుంటే నిద్దరోవడమే నాకు తెలుసు అంటే ..
ఆ పసితనం చూసి మురిసిపోవడమే నాకూ తెలిసింది అన్నావ్

నే మేల్కొనే వరకూ నువు ఎదురు చూసి ...
నాకు ఆకలేసే వరకూ నువు కడుపు కాల్చుకొని...
మధ్య రాత్రిలో మారాం చేస్తే స్వర్గద్వారం తెరిచావ్...
అందరిలాంటి మగాణ్ణే కాబట్టి 
అం(తు)తా చూడాలన్న ఆత్రంతో �పరుగెత్తి ...
అర్థాంతరంగా అలసిపోయాను...
ఎప్పుడు నవ్వాలో తెలిసిన నీకు ఎప్పుడు నవ్వకూడదో తెలీదా...!!
లేకుంటే మా(గ) జాతికి జన్మంతా అవమానమేగా...

చెమటకి తడిసి నుదుటికంటిన జుత్తుని చేతితో చెరిపి...
చెంప మీద పడ్డ నా చెవిలో ..
'ఇప్పుడు చెప్పు ప్రేమ ఎక్కడుంది '?
అన్నావ్ 

'మన(సు)లోనే ' అన్నాను.....

- మోహన్ తలారి

కవి సంగమం # 10 #

అమ్మా తస్మాత్ జాగ్రత్త


మగాళ్ళం

పాదాలకు మెట్టెలున్నా..
పక్కనే భర్త ఉన్నా ...
పళ్ళూడని పిల్లవైనా....
పవిట కొంగు తొలగినా...
ఆఖరికి పసిబిడ్డకి పాలిస్తున్నా..
మా కన్నులు వెతికేదేమిటో
మా చూపులు తొలిచేదేమిటో
నీకు తెలియంది కాదు...

మగాళ్ళం
కోరలు పెంచుకొని నడి బజారులో బరి తెగించి తిరుగుతున్న మృగాళ్ళం

అణువుగా ఉన్నప్పుడే..
అంత జాగ్రత్తగా ఒడిలో పొదువుకోకుండా...
ఆ గుండెలకేసి గట్టిగా అదిమేస్తే
ఊపిరాడక చచ్చేవాళ్ళం కదా ....

నువ్వు కరిగి మా కండలకి పుష్ఠినిచ్చినందుకు,
మా ఏడుపుకి నువ్వు వణికినందుకు
మా నవ్వుకి నువ్వు పులకించినందుకు
చూసావా ఋణం ఎలా తీర్చుకుంటున్నామో!!

దేవతామూర్తుల విగ్రహాలు తాకి
దాహం తీర్చుకునే ప్రబుద్దులున్నారమ్మా మాలో

ప్రేమించి వంచించేందుకే మాకు చదువులు
పెళ్ళాడి హింసించేందుకే మాకు కొలువులు

మితభాషి అయినా , మృదు భావి అయినా
కవి అయినా , కళారవి అయినా
కూలి వాడయినా, కడకి దేవుడే అయినా
మేమందరం మగవాళ్ళం
మా అందరిదీ ఒకటే దృక్పథం
నీ కన్నీట తడవడమే మాకు పరమ కైవల్య పథం

అందుకే
అమ్మా తస్మాత్ జాగ్రత్త ......

_మోహన్ తలారి

కవి సంగమం # 9 #

(బళ్ళో కాదురా ప్రకృతి మాత ఒళ్ళో)

నాన్నా  నిన్ను బళ్ళో వెయ్యను....
ఎందుకంటావా ....చెప్తా విను

నీ మెడలు వంచి
వంకర గీత మీద వంద సార్లు దిద్దించి తల ఎత్తుకు తిరిగే పౌరుషాన్ని ఆదిలోనే పాతిపెట్టేస్తారు 

రాంకుల రేసులో ముందుకు పరుగెత్తించి
జీవితం రేసులో మాత్రం వెనక్కి నెట్టేస్తారు..

సరస్వతీ నిలయాలన్నీ ధనలక్ష్మీ కొలువులయిపోయాయి..
చదువుకోవడం లేదు ఇప్పుడంతా చదువు కొనడమే

వ్రాయించి, అరిపించి, గీయించి, �వేధించి నిన్ను యంత్రాన్ని చేస్తారు..
ఆడించి, పాడించి, బుజ్జగించి నేను మనిషిని చేస్తాను...

ఆ నాలుగు గోడల మధ్యలో  స్వేద దుర్గంధాలు పీల్చే దౌర్భాగ్యం నీకొద్దు 
పరిమళ సుగంధాలు మోసే మలయ మారుతాలు పీల్చి తరిందువు గాని

ఉదయాన్నే వికసించి సాయంత్రానికి వాడే పొద్దు తిరుగుడులా చూడలేను నిన్ను 
అనునిత్యం ప్రకాశించే , వెలుగుల్ని ప్రసాదించే భానుమూర్తిని చేస్తాను 

ఆయాకేమి తెలుసు రా ఆకలెప్పుడేస్తుందో నీకు
ఆ మేడమ్ కేం తెలుసురా నిద్దరెప్పుడొస్తుందో నీకు 

నే కోల్పోయిన బాల్యాన్ని నీతో కలిసి అనుభవిస్తాను అందుకే నాన్నా బళ్ళో కాదు ప్రకృతి మాత ఒళ్ళో వేస్తాను నిన్ను..

_ మోహన్ తలారి
(To my son Dharanee priyatham)

Thursday 9 October 2014

కవి సంగమం #8#

రాత్రికి వయసెంత ? అనడిగితే
పగటికన్నా ఒక పూట తక్కువ అనే లౌఖ్యం నీకుందా......
అందుకే నేను మనిషిని సార్....

అంగారక గ్రహంలో ఏముందన్న తపనే తప్ప
పొరుగువాడి అంతరంగంతో నాకసలు పనే లేదు..

భూకంపాలకి, సునామీలకి స్కేళ్ళున్నాయ్ నా దగ్గర ,
పేదవాడి ఆకలికి మీటర్ లేదు..

చచ్చాక  ఏమౌతానన్న భయమే గాని
సరిగ్గా బతకడం ఇంకా నేర్చుకోలేదు

లంచమా??
నాకు దొరకలేదన్న బాధే గానీ
దాంతో నాకేం సమస్య లేదు - మనిషిని సార్ నేను..

అత్యాచారమా ??
నాకు ఛాన్స్ దొరకలేదన్న ఏడుపే గాని
ఇదేం నిజం రోదన కాదు - మగాణ్ణి సార్ నేను

ఇన్ని నీతి కబుర్లు రాస్తానా..??!!
ఒక్కటీ నేను చెయ్యలేను..
ఎందుకంటే .....ప్రతిసారీ అడగొద్దు మరి నన్ను

దేవుడున్నాడా అంటావా??
అది మాత్రం అడక్కండి సార్ మా మనుషులూరుకోరు...
కావాలంటే మనిషిని చంపేసుకోండి మేం అడగం...

చెట్లకి, పుట్లకి , అప్పుడెప్పుడో చచ్చిన ఎలక్కి వయసు కనుక్కునే పనిలో నేనుంటే...
పురిట్లో సచ్చిన బిడ్డ కోసం ఈ గోలేంటయ్యా

demonstrations , నిరసనలు , సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు, చారిటీలు  ఇవన్నీ  నిజమనుకునేరు.....

అంతా డ్రామా సార్...

ఎందుకంటే after all నేను మనిషిని సార్....

-మోహన్ తలారి

Monday 6 October 2014

కవి సంగమం # 7 #

జ్ఞాపకాలు - 2


నీ తూరుపుని నా పశ్చిమని కలిపే
ధవళేశ్వరం వంతెన మీద
ఓ సంధ్యలో మనిద్దరం సంగమించి,
పడమటి వేపు చూస్తూ విన్న సంధ్యారాగం
ఇప్పటికీ ఓ అందమైన జ్ఞాపకం

పరవళ్ళు తొక్కుతున్న ఎర్ర గోదారిని చూసి
నీ కళ్ళలో ఉదయించిన సౌందర్యం...
దూరంగా దిజ్మండలిలో ప్రతిబింబిస్తే
ఆ అందాన్ని అలా కళ్ళప్పగించి చూడడం
ఇప్పటికీ ఓ మధురమైన జ్ఞాపకం

ఆ అపురూపమైన ప్రకృతి సోయగం చూసి ఆదమరిచావనుకొని
అదను చూసి నడుము పై వేసిన  చేతిని
అంతే సున్నితంగా తొలగించిన నీ ప్రమత్తత ముందు
చిత్తుగా ఓడిపోయిన నా ఆత్రం
ఇప్పటికీ నాకో మరపురాని జ్ఞాపకం ...

ఆదిత్యుడెళుతూ వదిలేసిన కుంకుమని
ఆ సాయంకాలపు ఆకాశం నీ మేనికి అద్దుతుంటే
నిన్ను విడిచి వెళ్ళే ముందు నాలో పుట్టిన వేదన
నీ కళ్ళలో కన్నీటి బొట్లయి ప్రతిఫలించినప్పుడు
మన గుండెల్లోని ప్రేమ కొత్త గోదారై ఉరకలెత్తడం
ఎప్పటికీ నాకో దివ్యమైన జ్ఞాపకం