Friday 21 November 2014

కవి సంగమం # 30 #

# అయస్కాంత క్షేత్రం #


అప్పటివరకూ అక్కడ అలుముకున్న చీకటిని
ఆమె తన రాకతోను , చిన్న చిరునవ్వుతోను వెలిగిస్తుంది
విద్యుచ్చక్తి ప్రవేశించినట్టుగా
అంతవరకూ నిర్జీవంగా పడి ఉన్న ప్రాణాల్ని ఒక్కసారిగా ఉత్తేజపరుస్తుంది
తను కూర్చున్న స్థలాన్నే కేంద్రంగా చేసుకుని అయస్కాంత క్షేత్రాన్ని
అంతటా పరుస్తుంది
మగాడి కనుచూపు చేరగలిగినంత మేర అది విస్తరిస్తుంది
It’s the basic design of human brain కావడం వల్ల
నాకూ అటు వైపు చూపు తిప్పడం తప్పదు
అంత అందం చూసాక ఒక్క క్షణం ఊపిరాగి ఉక్కిరిబిక్కిరవుతాను
అలవాటు పడ్డ కళ్ళు confirmation కోసం ఆమె కాళ్ళ వైపు చూస్తాయి
మూడు ముళ్ళు వేసి బంధించే భాగ్యం ఇంకా ఎవరికీ చిక్కలేదని
సంబరపడే లోపు అభ్యుదయ భావమొకటి నా పాదాలనూ చూసుకొనమంటుంది.
తరతరాల పురుషాధిక్యత ఆ భావాన్ని ఆ క్షణానికి dominate చేస్తుంది.
చూపులు , ఆలోచనలు ఆమె ఛాయలోనో , చెవి వంకీలలోనో
నుదుటి మీద పడ్డ కురులలోనో తప్పిపోయాక తమ ధర్మంగా
డిగ్నిటీ పెద్దరికాన్ని , పెద్దరికం డిగ్నిటీ ని గుర్తు చేస్తాయి ..
ఏ పుస్తకమో తీసి చదవడం మొదలెడతాను
ఏ హెడ్ ఫోన్సో పెట్టుకుని పాటలు వినడానికి tri చేస్తాను
అయితే ... అది ఇంతమందిని ఆకర్షిస్తున్న ఆమెని
నేను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నంగా తోచి
వెంటనే మానుకుంటాను ..
నా మనసుని నేనే కంట్రోల్ చేసుకోలేని నిస్సహాయతకి సిగ్గుపడి
అక్కడనుంచి వెళ్ళిపోదామనే అనుకుంటాను
సరిగ్గా అప్పుడే ఆమె శరీరాన్ని విడిచి తొలగిందేదో నన్ను నిమంత్రిస్తుంది
ఆడ పిల్ల దుస్తులకి కూడా మగాడికి రక్తపోటు పుట్టించే శక్తినిచ్చిన
ప్రకృతిని తలుచుకుంటాను
మరోసారి నా మగపుట్టుక మీద జాలిపడతాను
ఆమె వెళ్ళిపోతుంది

ఉదయం నుంచి ఊరించి కురవకుండానే వెళ్ళిన మేఘంలా
మదిని మెలికలు పెట్టి చివరికి శృతి కాకుండానే చెదిరిన రాగంలా
ఆమె వెళ్ళిపోతుంది
నాకెన్నటికీ ఏమీ కాని ఓ అప్రాప్త సుందరి
చెప్పలేనంత బాధ రగిల్చి వెళ్ళిపోతుంది
how delicate is human’s heart

ఆమెని మరిచిపోదామనుకుంటూనే మరి మరి తలచుకొని నిద్రపోతాను
మనసు నా విచక్షణ పరిధి దాటిపోయాక
కూర్చున్న చోటునుండే వలయాల వెంబడి ప్రయాణించి ఆమెను చేరి
ఆమెను తాకి , ఆమె నవ్వు గుండెల్లోకి ఒంపుకుని,
ఆమె సుతిమెత్తని స్పర్శని తనువంతా నింపుకుని
ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు ముద్దాడి
నా నాడీ కేంద్రాన్ని ఆమె నాభీ కేంద్రంతో అనుసంధానం చేసే లోపు
...............
పక్కలో ఉన్న గురుత్వాకర్షణ శక్తి నడుము పై చెయ్యేసి
దంపతులకి మాత్రమే అర్ధమయ్యే భాషలో తన వైపు తిరగమంటుంది
అంతే
ఈ జన్మకీ ఇంతియే ప్రాప్తమన్న వాస్తవాన్ని గుర్తించి
అజ్ఞాత సుందరిని అక్కడే వదిలి
చెట్టు మీద నుండి పడ్డ ఆపిల్ పండులా కలల వృక్షం నుండి రాలిపోతాను..

( ఏ రైలు ప్రయాణంలోనో విసుగు చెందినప్పుడు , ఏ అనవసరమైన function లోనో తప్పక దొరికిపోయినప్పుడు , ఏ బోరింగ్ సభలోనో ఖచ్చితంగా కుర్చోవలసిన స్థితి దాపురించినప్పుడు దేవతల్లా మెరిసి, జీవితంలో ఈ కాస్త సమయం వృధా కాలేదన్న భావన కలిగించే ప్రతీ సుందరీ మణికి ఇది అంకితం)

No comments:

Post a Comment