Tuesday 4 November 2014

కవి సంగమం # 19 #


                                       II ఇంగ్లీసు మీడియం – తెలుగు మీడియంII

చిన్నప్పుడు మా నాన్న రాజవరం బోర్డి స్కూల్లో ఏసినప్పుడు
ఎప్పుడన్నా పక్కనే చెరుకు తోటలో చెరుగ్గర్రలు ఇరుపుకోడం
రక్తపింజరలొస్తాయంటే భయపడి పారిపోడం
బడయ్యాక సైకిల్ తోక్కుకోడం
ఎవడన్నా చక్రంలో పుల్లెడితే బొక్క బోర్లా పడిపోడం తప్ప నాకింకేమీ గుర్తు లేదు

ఆరో తరగతిలో మా ఇంటి ఓనర్ కొడుకు భాస్కర్ గాడు చెప్పేదాకా
కాన్వెంట్ అని ఒకటుంటుందని , దాంట్లో KG లు నర్సరీ లు ఉంటాయని
అది మన ఊళ్ళో ఉండదు కాబట్టి బస్సెక్కి పక్కూరెళ్ళాలని
అక్కడ అన్ని పాఠాలు ఇంగ్లీషులోనే చెప్తారని నాకు తెలీదు

పొద్దున్నే నాకన్నా రెండు గంటలు ముందు లేచి
కళ తప్పిన మొహంతో స్కూలు బస్సెక్కి
సాయంత్రం నాకన్నా రెండు గంటలు లేటుగా వచ్చి
పదకొండయ్యేదాకా చదివే భాస్కర్ గాడ్ని చూస్తే నాకెందుకో జాలేసేది

ఆళ్ళ స్కూల్లో ఇంటర్ వెల్లో రేగొడియాలు దొరకవని
మాస్టారు గబుక్కున క్లాసుకోచ్చేస్తే సగం కొరికిన జాంకాయ
సంచిలో పుస్తకాలెనకాల దాసుకోడాలు కుదరవని
crafts పిరుడు, డ్రిల్లు పిరుడు ఉండవని
ఎంత వర్షమొచ్చినా మధ్యానం బడికి సెలవివ్వరని
చెప్పినప్పుడు నిజంగానే బాధేసింది

క్లాసులో లీలావతికి నేను తొడపాసం పెట్టడం గురించి
వెంకట్ మాస్టారి ట్యూషన్ లో కరెంటు పోయినప్పుడు
సుధకి దొంగచాటుగా ముద్దెట్టడం గురించి చెప్పినప్పుడు
కళ్ళు పెద్ద పెద్దవి చేసుకుని వినేవాడు

తరవాతెప్పుడో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో
ప్రేమకాంతి తో కలిసి “ప్రేమిస్తే” సినిమా చూస్తుండగా
తను ఎం సెట్ లాంగ్టర్మ్ కోచింగ్ లో ఉన్నానని
సెకెండ్ ఇయర్ లో ప్రేమలో ఫెయిలయ్యి సగం బీరు తాగుతుండగా
తను MBBS కి చైనా వెళ్లానని
MBA ఫోర్త్ సెమిస్టర్ లో కోమలితో కైలాసగిరిలో
అచ్చికబుచ్చికలాడుతుండగా
తను Medical council of India పరీక్షకి
డిల్లీలో కోచింగ్ లో ఉన్నానని చెప్పాడు
ఎందుకో ప్రతీసారీ జాలేసింది

ఇదిగో ఇన్నాళ్ళకి మొన్న
నా చిన్న అద్దింట్లో నేను కవిత్వం రాసుకుంటుంటే
వాడి పెద్ద కార్లో వచ్చాడు
“ అదృష్టవంతులు రా మీరు
మాకిలా తీరిగ్గా కూర్చొని రాసుకునే తీపి జ్ఞాపకాలూ లేవు
బాధలన్నా రాసుకుందామంటే ఏ భాష మీదా పట్టూ లేదు
సగం బతుకంతా సదవడానికి  
సగం బతుకంతా సంపాదనకి సరిపోతుంది  “ అంటుంటే
ఈసారి ఊరికే జాలి పడలేక
కౌగలించుకుని కళ్ళెమ్మట నీళ్ళెట్టుకున్నాను..


_ మోహన్ తలారి

No comments:

Post a Comment