Friday 21 November 2014

కవి సంగమం # 28 #

/ నవ కవనం/

ఎప్పుడు చూడు
అవే కిటికీలోంచి పడక మీద పడే పున్నమి వెన్నెలలు
అవే మెడ మీంచి నడుము కింది వరకూ జారే జవరాళ్ళ జడలు
అవే ఆకాశం చూపించి అమ్మ పాడే జోల పాటలు
కొత్తవేం రాయరా ....?

అంటే

ఎందుకు రాయం రాస్తాం

మండు వేసవిలో కారం మిల్లు కార్మికుడి ఒంటి మీద పుట్టే మంట గురించి
గాజా సరిహద్దుల్లో ఉన్మాది ఆత్మాహుతి దాడిలో తెగి ఎగిరి పడ్డ కాళ్ళు చేతుల గురించి
సిరియా ఎడారుల్లో ISIS మతోన్మాది కత్తి కింద నలిగిన కుత్తుకుల గురించి
అభం శుభం ఎరుగని పసిపిల్ల కాయం మీద కామాంధుడు చేసిన గాయం గురించి
దేవతలనిపించుకుంటూ బలులు కోరే రాక్షసామూర్తుల ముందు తెగిపడ్డ ఎొట్టేళ్ళ తలల గురించి
దేముళ్ళ (రాళ్ళ) సాక్షిగా దేవాలయాల డిబ్బీల్లో సాగే దోపిడీ గురించి
జబ్బు తగ్గుతుందని స్వస్థత సభలకెళ్ళిన రోగి ఒంటి మీద జారిన ఆలీవ్ ఆయిల్ జిడ్డు గురించి

రాస్తాం
వస్తువులు చాలానే ఉన్నాయ్
కొత్త విత్తనాలు నాటి సరికొత్త కవిత్వం పండిస్తాం
విశ్వవీణా తంత్రులు మరోమారు శృతి చేసి నవీన రాగాలాలాపిస్తాం
సుగంధ ద్రవ్యాలు మేళవించి ఎన్నడూ తిననిదేదో రుచి చూపిస్తాం
అయితే .....

విని తట్టుకోగల చావ
తిని జీర్ణించుకోగల శక్తి నీకున్నాయా??

No comments:

Post a Comment