Saturday 8 November 2014

కవి సంగమం # 22 #

 # మన సంస్కృతి , సాంప్రదాయాలు #

ఒక్కోసారి నా దేశం ఎక్కడికి పోతుందో
అని తెగ బెంగ పట్టుకుంటుంది నాకు
తరతరాలుగా మన పెద్దలు కృషి చేసి ఇచ్చిన
సంస్కృతిని , సాంప్రదాయాల్ని మంటల్లో కలిపేస్తున్నాం


రాజారాం మోహన్ రాయ్ చెప్పాడని సతీసహగమనం వదిలేసాం
వీరేశిలింగం పంతులు మాట విని
ముసుగేసి మూల కుర్చోబెట్టాల్సిన వెధవ ముండలకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం
అప్పారావు గారేదో రాసారని అవధానులకి పసిపిల్లల్ని అమ్ముకోవడం మానేసాం
ఇంకా ఏం నాశనం చేద్దామనుకుంటున్నారు ??


కొన్ని జాతుల వారికే ప్రత్యేకమయినవి కూడా వదిలేసారు
ఇంటికి రాగానే పరాయి మగాడి చెప్పులు గుమ్మం ముందుంటే తిరిగి వెళ్ళిపోవడం
పెళ్ళాల్ని పాలేళ్ళకొదిలి దళిత స్త్రీలని, పనిలోకొచ్చిన వాళ్ళని
వేలం పాట వేసుకొని వంతుల వారీ వాడుకోడం లాంటివి
ప్రజలారా మేల్కోండి...మనకి మాత్రమే సొంతమయిన సంస్కృతి
కాపాడుకుందాం

అదృష్ట వశాత్తు ఈ రోజుకీ కొన్ని అద్భుతమైన సంస్కృతులు మిగిలున్నాయ్
గుడి మెట్ల మీద అడుక్కునే వాళ్ళని వదిలేసి దేవుడికి నిలువు దోపిడీలివ్వడం
పాలు లేక ఎండిపోయే పసి వాళ్ళని కన్నెత్తి చూడక
కోట్ల దేవతలకి పాలు, తేనెలతో అభిషేకాలు చేయించడం ఇంకా ఎన్నో..

అసలైనది వదిలేసాం ....వరకట్నం
 

అమ్మలారా ...అయ్యలారా
నాలాంటి ఆధునిక వాదుల వింత పోకడలు చూసి inspire అవ్వకండి
మీ కొడుకుల్ని పందెం కోళ్ళకి మల్లే మేపండి
ఊరి మీదకొదిలేసి అమాయకపు పెట్టల మీద practice చేసి రమ్మనండి
ఇంట్లో ఆడపిల్లలుంటే వాళ్ళ వాటా కూడా కొడుకులకే పెట్టండి
ఆకలి దాచుకోవడం ఆడ కూతురుకి పుట్టుకతో వచ్చిన విద్య
పెంచారా ....ఇహ రండి
వివాహ వేదికల బజార్లలో పెట్టండి


మీ కూతుళ్ళని అలంకరించి ప్రదర్శించండి
తలెత్తి కట్టుకునే వాడిని చూస్తానంటే మెడలు విరిచెయ్యండి
వాళ్ళకేం తెలుసు గొర్రెల మందలు
వేశ్యలకి విటులని select చేసుకునే హక్కు ఎలా లేదో
పెళ్లి కూతుళ్ళకి భర్తల్ని ఎంచుకునే హక్కు అలాగే లేదు మన దేశంలో
అక్కడ జరగాల్సింది కార్యం
ఇక్కడ జరగాల్సింది పెళ్లి
మధ్యలో మనీ మాట్లాడాలి గానీ మనసులతో పనేంటి

మీకు సాంప్రదాయాలు కాపాడుకోడం రాకపోతే నా దగ్గరకి రండి
మా కలగంపూడి సీతారామరాజు గారి దగ్గరికి తీసుకెళతాను
కూతుర్ని ప్రేమించిన పరాయి కులమోడిని చించినాడ బ్రిడ్జి కింద ఎలా నరికించాడో చెప్తాడు
మేల్కోండి....కళ్ళు తెరవండి
చేయి చేయి కలపండి
మనకి మాత్రమే సొంతమైన unique culture కాపాడుకుందాం ..

05-11-2014

No comments:

Post a Comment