Monday 6 October 2014

కవి సంగమం # 6 #

జ్ఞాపకాలు - 1


ఆ రోజు పెండ్యాల రేవులో
ఎండాకాలం మబ్బేసిన మధ్యాహ్నం
నావ సూరిగాడి పాకలో
వాడు లేని వేళ చూసి
మనం గుట్టుగా చేరినప్పటి సంగతి

“నీ కోసమే ఈ సీర” అని కళ్ళతో చెప్పి...
ఆకట్టుకున్న మందిని గుర్తుకు తెచ్చుకుని,
ఆ కట్టుకున్న ఇబ్బందిని గొంతులోకి తెచ్చుకుని,
“ఎవరెవరి మీదో రాస్తావంటగా
నా మీద కుడా రాయి” అన్నావ్...

నేనా ??!! ఏం రాయను ?? అన్న నా ప్రశ్నకి
మరిప్పుడు నాకోసం కాశి రాజు ఒస్తాడా అన్న నీ చిలిపితనానికి
ముక్కు చివర పండిన నా జెలసీ ని,
ముద్దిచ్చి పోగొట్టిన నీ అందం ఒక అందమైన జ్ఞాపకం.....

అటు పై ఆ తడి తుడవడానికి,
అప్రయత్నంగా నే చేసిన ప్రయత్నానికి
ముక్కు చివర ఎర్రబడ్డం నీ వంతయ్యింది...
చొరవ తీసుకోవడంలోని అందం స్త్రీలకెంత సొంతమో ఎరిగి
ఆ ఎరుపు పోగొట్టే చొరవ నేను చెయ్యలేదు....

ఆనక, తిప్పలో నువ్వు ఆల్చిప్పలు ఏరుతుంటే
ఎండకి మెరుస్తుంది నువ్వా , ఇసికా అనీ ..
“నన్ను పట్టుకుంటే ఇంకోటి” అని నువ్వు పరిగెడుతుంటే
ప్రవహిస్తోంది నువ్వా , గోదారా అనీ ..
పోల్చుకోలేక, విడివిడిగా చూడలేక బాధపడ్డాను, కూలబడ్డాను ...

ఇంతలో నెమ్మదిగా పొద్దు కుంగి
గోరింకలు , కొంగలు గూళ్ళకి పోతుంటే ...
చుక్కలొక్కొక్కటిగా చందమామ దగ్గర హాజరేయించుకుంటుంటే..
అలిసిపోయిన నావ గోదారమ్మ ఒళ్లో ఉయ్యాలూగుతుంటే..
అప్పుడప్పుడు అల్లరి గాలి జుట్టు చెరుపుతుంటే...

“ఇంటికెళ్ళరా అబ్బాయ్ సీకటడిపోయింది”
అని సూరిగాడనే దాకా నువ్వక్కడే ఉన్నావనుకున్నాను ....

No comments:

Post a Comment