Monday 13 October 2014

కవి సంగమం # 10 #

అమ్మా తస్మాత్ జాగ్రత్త


మగాళ్ళం

పాదాలకు మెట్టెలున్నా..
పక్కనే భర్త ఉన్నా ...
పళ్ళూడని పిల్లవైనా....
పవిట కొంగు తొలగినా...
ఆఖరికి పసిబిడ్డకి పాలిస్తున్నా..
మా కన్నులు వెతికేదేమిటో
మా చూపులు తొలిచేదేమిటో
నీకు తెలియంది కాదు...

మగాళ్ళం
కోరలు పెంచుకొని నడి బజారులో బరి తెగించి తిరుగుతున్న మృగాళ్ళం

అణువుగా ఉన్నప్పుడే..
అంత జాగ్రత్తగా ఒడిలో పొదువుకోకుండా...
ఆ గుండెలకేసి గట్టిగా అదిమేస్తే
ఊపిరాడక చచ్చేవాళ్ళం కదా ....

నువ్వు కరిగి మా కండలకి పుష్ఠినిచ్చినందుకు,
మా ఏడుపుకి నువ్వు వణికినందుకు
మా నవ్వుకి నువ్వు పులకించినందుకు
చూసావా ఋణం ఎలా తీర్చుకుంటున్నామో!!

దేవతామూర్తుల విగ్రహాలు తాకి
దాహం తీర్చుకునే ప్రబుద్దులున్నారమ్మా మాలో

ప్రేమించి వంచించేందుకే మాకు చదువులు
పెళ్ళాడి హింసించేందుకే మాకు కొలువులు

మితభాషి అయినా , మృదు భావి అయినా
కవి అయినా , కళారవి అయినా
కూలి వాడయినా, కడకి దేవుడే అయినా
మేమందరం మగవాళ్ళం
మా అందరిదీ ఒకటే దృక్పథం
నీ కన్నీట తడవడమే మాకు పరమ కైవల్య పథం

అందుకే
అమ్మా తస్మాత్ జాగ్రత్త ......

_మోహన్ తలారి

1 comment:

  1. మా కన్నీట తడవడం కాదు సార్! మునగడం.

    ReplyDelete