Monday 6 October 2014

కవి సంగమం # 7 #

జ్ఞాపకాలు - 2


నీ తూరుపుని నా పశ్చిమని కలిపే
ధవళేశ్వరం వంతెన మీద
ఓ సంధ్యలో మనిద్దరం సంగమించి,
పడమటి వేపు చూస్తూ విన్న సంధ్యారాగం
ఇప్పటికీ ఓ అందమైన జ్ఞాపకం

పరవళ్ళు తొక్కుతున్న ఎర్ర గోదారిని చూసి
నీ కళ్ళలో ఉదయించిన సౌందర్యం...
దూరంగా దిజ్మండలిలో ప్రతిబింబిస్తే
ఆ అందాన్ని అలా కళ్ళప్పగించి చూడడం
ఇప్పటికీ ఓ మధురమైన జ్ఞాపకం

ఆ అపురూపమైన ప్రకృతి సోయగం చూసి ఆదమరిచావనుకొని
అదను చూసి నడుము పై వేసిన  చేతిని
అంతే సున్నితంగా తొలగించిన నీ ప్రమత్తత ముందు
చిత్తుగా ఓడిపోయిన నా ఆత్రం
ఇప్పటికీ నాకో మరపురాని జ్ఞాపకం ...

ఆదిత్యుడెళుతూ వదిలేసిన కుంకుమని
ఆ సాయంకాలపు ఆకాశం నీ మేనికి అద్దుతుంటే
నిన్ను విడిచి వెళ్ళే ముందు నాలో పుట్టిన వేదన
నీ కళ్ళలో కన్నీటి బొట్లయి ప్రతిఫలించినప్పుడు
మన గుండెల్లోని ప్రేమ కొత్త గోదారై ఉరకలెత్తడం
ఎప్పటికీ నాకో దివ్యమైన జ్ఞాపకం


No comments:

Post a Comment