Monday 27 October 2014

కవి సంగమం ## 13##

## నా నాస్తికతను ప్రశ్నించకు ## 



నా పూర్వీకుడొకడు
అగ్ర వర్ణాధిపత్యాన్ని ఎదిరించినందుకు
పంచముడన్న ముద్ర నుదుటి మీద ముద్రించి
ఊరి నుంచి, ఆలయాల నుంచి బహిష్కరించినప్పుడు
అన్యాయం కదా ఇది ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు.

నా ముత్తాత ఒకడు 
ఊరి చివర పూరి గుడిసెలో 
వానకి తడిసి, ఆకలికి ఎండినప్పుడు
నడుముకి తాటాకులు కట్టుకుని 
తను నడిచిన బాటని తనే ఊడ్చినప్పుడు 
పాపం కదా ఇది ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు.

తెల్లవాడొకడు 
“నా మాట వింటే నీ బాధలన్నీ పోతాయ్” అని 
నాలుగు మెతుకులు అన్నం పెట్టి 
నాలుగు మూరల గుడ్డ కప్పి 
సముద్రాల అవతల నుంచి తెచ్చిన మతాన్ని
ఊరి చివర వారికి అంటించినప్పుడు 
తప్పు కదా ఇది ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు 

నా తాతలు అంటించుకున్న కొత్త మతాన్ని 
నరనరాల్లోకి ఎక్కించుకుని 
సంస్కృతి సాంప్రదాయాల్ని సిగ్గుతో కలిపి వదిలేసి 
మద్యానికి , మాంసానికి బానిసలై 
పరాయి దేవుడి మత్తులో చిత్తయిపోయినప్పుడు 
ఏమయిపోతున్నావో తెలుస్తుందా ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు..

దొరికిన ఒక్క ఆదివారాన్ని 
తోటి స్నేహితులందరూ హాయిగా ఆనందిస్తే ..
జుట్టు పట్టుకు ఈడ్చుకెళ్ళి 
చర్చి నాలుగు గోడల మధ్య 
నా తల్లి నా బాల్యాన్ని నాశనం చేసినప్పుడు 
ఏమిటమ్మా ఇది ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు...


రాగం, భావం లేని ఆ చెత్త భక్తి గీతాలు విని రోత పుట్టి 
పాట మీద మక్కువతో 
దొంగచాటుగా ఓనాడు అన్నమయ్య కీర్తనలు వినబోతే 
వెనకాలే వచ్చి వీపు మీద చరిచి 
పాటల క్యాసెట్ నేలకేసి కొట్టిన మా నాన్నని 
నువ్ మనిషివేనా ? అని ఒక్కడూ ప్రశ్నించలేదు...

ఈనాడు 
నాకు స్వాతంత్ర్యం వచ్చాక 
సత్యాసత్యాలు తెలిసాక 
నాదంటూ ఓ బాటని నిర్మించుకుని 
అందులో సాగిపోతుంటే 
ఇన్నాళ్ళు ప్రశ్నించని నువ్వు 
ఎందుకు నాస్తికుడివి ?? అని ఇంకెప్పుడూ ప్రశ్నించకు ..

No comments:

Post a Comment