Tuesday 30 September 2014

కవి సంగమం # 5#

నీకు ప్రేమించడం తెలీదంది.....
తమని తాము ప్రేమించుకోడం తెలీని వాళ్ళే 
ప్రేమించడం మీద, ప్రేమించబడడం మీద ఆధారపడతారన్నాను....

నీకు మనసే లేదంది...
చలం మైదానం లోనో , బుచ్చిబాబు ఆశాప్రియ పాదాల దగ్గరో పడుంటుంది చూడన్నాను.....

దేవుణ్ణి నమ్మకపోతే ఇలాగే పిచ్చి వాళ్ళవుతారంది...
నమ్మి మనుషులవడం కన్నా నయమన్నాను.....

అప్పుడప్పుడూ ఈ ప్రపంచంలోకి వస్తుండాలంది...
నా ప్రపంచంలోకి వచ్చి చూస్తే ఆ మాట అనవన్నాను.....

కన్నీళ్ళకి కాస్త కరగడం నేర్చుకోమంది....
కన్నీళ్ళు మింగి బతకడం నేర్చుకున్నానన్నాను....

రాతి హృదయాల ముందు మొర వృధా అంది...
రాళ్ళతో ఆర్గ్యుమెంట్ నాకూ అంతే అన్నాను ....

_ మోహన్ తలారి

కవి సంగమం # 4 #

పెద్దల్ని, స్నేహితుల్ని , శ్రేయోభిలాషుల్ని, అందర్నీ 
ఎదిరించి మరీ.....
నా కాళ్ళకి బంధం , నా నోటికి చిక్కం నేనే....
తాళి కట్టి మరీ తెచ్చుకుంటున్నానని ఆరోజు 
నాకు తెలీదు....

"నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను"..
అని నువ్వనడం ప్రేమ కాదు అబధ్రతా భావం 
అని తెలిసాక ప్రేమ మీద నమ్మకం పోయింది ...

నాకు దూరంగా ఉన్నప్పుడు శనివారం సాయంత్రాలే..
నా పై ప్రేమ ఎందుకు ఎక్కువవుతుందో
అర్థరాత్రి వరకూ ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో...
నాకర్ధం కాలేదనుకోవడం నీ అమాయకత్వమని 
అనుకోకుండా ఉండలేను....

గొడవయిన ప్రతిసారీ ....
నీ ఏడుపు ముందు నా మిగిలిన ఆయుధాలన్నీ నిర్వీర్యం అయినప్పుడు ,
కడుపారా ఏడవలేని మగతనాన్ని తలుచుకుని 
ఏకాంతంలో ఏడవకుండా ఉండలేను....
సున్నితత్వాన్ని.......కన్నీళ్ళు, జెండర్ బట్టి కాక
మనసుని బట్టి నిర్ణయించమని ప్రపంచానికి చెప్పకుండా ఉండలేను..

ఇన్నాళ్ళ తర్వాత నిన్న మా వాడు ఫోన్ చేసి
"కవిత్వం రాయడానికి ఇన్స్పిరేషన్ లేదంటావేమిరా 
చక్కనాల చుక్కని ఇంట్లో పెట్టుకుని " అంటే
హిమాలయాలని దూరం నుంచి చూస్తేనే కవిత్వం పుడుతుంది....దగ్గరికెళితే వణుకు పుడుతుంది
అన్న నా రిప్లై జోక్ అనుకుని వాడు నవ్వేస్తే 
నేను కూడా నవ్వకుండా ఉండలేకపోయాను..... 

Thursday 25 September 2014

కవి సంగమం # 3 #

కవితలంటే ?

కవితలంటే .....
తెల్లని కాగితం పై పొందిక గా కూర్చిన అక్షరాలు కాదు
కవితలంటే .....
అలంకారాలు , ఛందస్సులు , ప్రాసల గోల కాదు .

కవితలంటే ....
రేరాజు కలువ రాణులకు వెన్నెల వంతెనపై పంపే ప్రణయ సందేశాలు
కవితలంటే ....
పూబాలలు ప్రియుని పెదవులపై అద్దే పుప్పొడి ముద్దులు
కవితలంటే ....
మూర్తీభవించిన శిలా ప్రతిమలలో సైతం ప్రస్పుటమయ్యే స్పష్టమైన భావాలు

అవును

కవితలంటే ....
సగం చచ్చిన బిచ్చగాడి ప్రేవులు వేసే ఆకలి కేకలు
కవితలంటే ....
మతి చెడిన వాడి మనోవల్మీకం చెప్పే రహస్యాలు
కవితలంటే ....
వేశ్య అర్ధ నిమీలిత నేత్రాలలో ప్రజ్వరిల్లే విషాదాగ్నులు

కవితలు
ఈ విశ్వమంతటినీ తమలో ఇముడ్చుకోగల అద్భుతాలు
ఏ నిశీధిలోనో కవి తన మనసుతో రమించి ప్రసవించే పసి పాపలు

కవితలు
ఎక్కడెక్కడో ఎగురుతున్న మమ్మల్ని “కవి సంగమం” గూటికి చేర్చిన వారధులు


Wednesday 24 September 2014

కవి సంగమం # 2#

నేస్తం...

ఎప్పుడో ఏళ్ల కిందటే....
సిరా పడి ఖరాబైన ఈ మనసు పై, 
ఏ నవనీత గేయాలు రచించాలని నీ ఆరాటం...!?

ఎన్నో వసంతాలకి ముందరే....
ఆఖరి ఆశలు రాల్చి, 
ఏ ప్రకృతి విలయతాండవానికీ చలించక నిలబడ్డ ఈ మోడు పై,
ఏ లేత చివుళ్ళు పూయించాలని నీ తపన...?!

యుగాల పాటు గుప్పెడు ప్రేమకై తపించి, దొరకక....
ఆగి ఈ దేహాన్ని కూల్చలేక , 
ఆపాద్ధర్మంగా లయ కొనసాగిస్తున్న ఈ గుండెలో,
ఏ కొత్త నెత్తురు నింపాలని ఈ పరితాపం...?!

వద్దు నేస్తం వద్దు...
ఇక నేనెవర్నీ నమ్మలేను....
నన్నీ నాగరిక నిరాశావాదం నుండి ,
అనాగరిక ఆశావాదంలోకి మళ్ళించాలని చూడకు... 
ఉత్త వృధా ప్రయాస.....

Tuesday 23 September 2014

కవి సంగమం # 1 #

ఆకాశం , భూమి కలిసే చోట నువ్వు ఉంటావని
రాత్రి ఎవరో కలలో చెబితే....
ఉదయాన్నే లేచి కలల్ని , కోరికల్ని వెంటేసుకుని బయలుదేరాను ....
అక్కడే ...ఆ రెండు కలిసే చోట ...
నీ నవ్వు మేఘాల మధ్యలో మెరిసినట్టయ్యి..
అడుగుల వడి పెంచాను...
వానలో తడిసి ముద్దయినప్పుడు,
తడబడి తూలి కింద పడ్డప్పుడు,
రాగల శోభకి శుభ సూచకమనుకున్నాను...

అంతే......రవి తెర దించేసాడు...
అంతా చీకటి ......
ఏం చెయ్యను!!!!
ఎప్పటిలాగే పొగిలి పొగిలి ఏడ్చిి,
కూడా తెచ్చుకున్న కలల్ని అక్కడే వదిలేసి,
మిగిలిన బాథాతప్త హృదయాన్ని ,
దొరికిన మరికొన్ని కొత్త అక్షరాల్ని తీసుకొని
కొత్త కలలోకి తిరుగు ప్రయాణం కట్టాను....

- 22.09.2014