Monday 12 November 2012

ఆంబులెన్స్ లో ఓ పగలు, రాత్రి



(Note: ఇప్పటివరకూ “నా జీవితంలోంచి కొన్ని” లేబుల్ తో రాసిన కధలన్నీ, జరిగిన వాస్తవానికి కాస్త కల్పన జోడించి వ్రాసాను..ఇది మాత్రం జరిగింది జరిగినట్టు వ్రాస్తున్నాను....)

28/10/2012.....సాయంత్రం 6:15

శెట్టి పేట లాకుల దగ్గరనుంచి ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్నా..( ఈ మధ్య Dieting, walking మొదలుపెట్టానులెండి.) Eric Segal రాసిన “ Only Love” బుక్ చదివా ఈ మధ్య...అందులో ఉన్న రెండు లైన్లు నాకు చాలా బాగా నచ్చాయి..

“ Time is the best healers of all”
“ Living well is the best revenge”

నేను పాటిస్తున్నాను..కుదిరితే నలుగురికి చెప్తున్నాను...బాగా exercise చెయ్యడం ద్వారా, career మీద దృష్టి పెట్టడం ద్వారా, ఇష్టమైన పనిని ఎక్కువ సేపు చేస్తుండడం ద్వారా( నాకు పాటలంటే పిచ్చి) పాత జ్ఞాపకాల్ని మరిచిపోవచ్చు..అందుకని walking మొదలుపెట్టా...I-pod నిండా రెహమాన్, ఇళయరాజా పాటలు నింపేసుకున్నా ...

“షెహర్ మే హూ మే తేరే
ఆకే ముజే మిల్ తో లే
దేనా నా తు కుచ్ మగర్
ఆకే మేరా దిల్ తో తు లే లే జానా”

వినే కొద్దీ బావుండే ఈ పాట 130 వ సారి వింటూ, నన్ను నేను మరిచిపోయి, రోడ్ మీద walking చేస్తూ, అప్పుడప్పుడు డాన్స్ చేసేస్తూ వస్తున్నా...జనాలందరూ తేడాగా చూస్తున్నారనుకోండి..But I don’t care..నాకిది అలవాటే...ఇలా తన్మయత్వంలో ఉండగా నా ఫోన్ vibrate అయ్యింది...చూస్తే అక్క...

“ఏంటక్కా చెప్పు ?”
ఎక్కడున్నావ్?
“దగ్గర్లోనే ఉన్నా...ఇంకో 20 నిమిషాల్లో వచ్చేస్తా...”
సరే త్వరగా రా .
“ఎందుకు?”
ప్రసాద్ అంకుల్ కి సీరియస్ గా ఉందట...అమ్మ , డాడి వెళ్లారు.. ఫోన్ చేసి మనిద్దర్నీ రమ్మన్నారు...
“ఓకే..”


నాలుగు రోజుల క్రితం ఒకసారి అమ్మ అంది....


“మోషే......(కంగారు పడకండి..ఇది నా అసలు పేరు)....నీకు ప్రసాద్ అంకుల్ గుర్తున్నారా?”
ఎవరమ్మా?
“బుట్టాయిగూడెం లో మన ఇంటి వెనకాల ఉండేవారు కదరా.."
ఆ గుర్తుంది...కొంచెం లావుగా ఉండేవారు...డాడీ వాళ్ళ డిపార్టుమెంటు కదా?
“అవును పాపం..ఈ మధ్య ఒంట్లో బాగోవట్లేదట రా ఆయనకి..”
ఏమయింది?
“సంవత్సరం క్రితం బైక్ మీద వెళుతుంటే ఆక్సిడెంట్ అయ్యిందట...ఒక నెల హాస్పిటల్ లోనే ఉన్నాడు...తరవాత కొన్నాళ్ళకి స్కిన్ నల్లగా మారిపోవడం , weight తగ్గిపోవడం, చాలా వీక్ అయిపోయాడంట...ఇప్పుడసలు నోటిలోనుంచి మాట రావట్లేదు...మంచం మీదే అన్నీ...”

.................................


అక్క, నేను వెళ్లేసరికి అక్కడ చాలా మంది జనం ఉన్నారు...అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళింది..మంచం చుట్టూ  ఓ నలుగురు నుంచుని ఆయన్ని మాట్లాడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు...ఒంటి మీద చిన్న గ్యాప్ కూడా లేకుండా నల్లని మచ్చలు..కళ్ళు తెరిచి చూస్తున్నాడు అంతే...ఊపిరి కూడా సరిగా తీసుకోలేక పోతున్నాడు..అసలు గుర్తు పట్ట లేకుండా ఉన్నాడు ...100 కేజీలు ఉండాల్సిన మనిషి 50 కేజీలకి తగ్గిపోయాడు..నేను అలాంటి దృశ్యాలు ఎక్కువసేపు చూడలేను..అందుకే బయటికోచ్చేసాను...

బయట జనాలు రెండు groups డివైడ్ అయ్యి మాట్లాడుకుంటున్నారు

Group: 1

మన చేతిలో ఏమీ లేదండి ఇంక
కానీ అలా చూస్తూ ఉండలేం కదా ..
ఏం చేయ్యగలమండి..విజయవాడ హెల్ప్ హాస్పిటల్స్ కి తీసుకెళితే , ఎక్కడికి తీసుకెళ్ళినా వేస్ట్ అని చెప్పేసారు ..

Group: 2

ఇందులో మా బాబున్నాడు
మానవ ప్రయత్నం చెయ్యాలి కదండీ
అన్నిటికీ దేవుడే ఉన్నాడు..ఏదొక కార్యం చేస్తాడు ..
మా బాబు: ( నిమ్స్ కి తీసుకెళితే శవాన్ని కూడా బతికించేస్తారండి)
నేను: ( ఏమంటాను చెప్పండి...ఎన్ని బూతులు తిట్టుకున్నా మనసులోనే తప్ప బయటికంటే సభ్య సమాజం హర్షించదు...అందుకే ఇక్కడ కూడా రాయట్లేదు)
మా బాబు నాతో: ఆదిత్య( ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో పని చేస్తున్నాడు...నా ఫ్రెండ్) కి ఒకసారి ఫోన్ చేసి చెప్పరా ..వెళ్ళాక కాస్త దగ్గరుండి చూసుకుంటాడు.నువ్వు కూడా వెళ్ళాలి.మా అబ్బాయిని పంపిస్తానని చెప్పాను..

నేను వెంటనే కాల్ చేయకుండా సరితక్కని( ప్రసాద్ గారి వైఫ్) రిపోర్ట్స్ అడిగాను..లోపలికి తీసుకెళ్ళి చేతికి ఇచ్చింది..చదివాను..

Diagnosis:
Pneumonia
Acute renal failure
Reactive for HIV


అప్పటి వరకు నాకు గాని, అక్కడ ఇంకెవరికి గానీ HIV పాజిటివ్ అని తెలీదు..చివరికి మా బాబుకి కూడా..అంత secret గా maintain చేసింది అక్క..బహుశా తెలిస్తే వాళ్ళ close relatives కి తెలిసి ఉండొచ్చు..

అక్కని పక్కకి పిలిచి అడిగాను ..
“ అక్కా HIV పాజిటివ్ కదా” అని
“అవును తమ్ముడు లాస్ట్ ఇయర్ ఆక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ ఎక్కించారు..అప్పుడు ఎవరో HIV ఉన్నవాళ్ళ బ్లడ్ ఎక్కించేసారు” అంది...
నేను అక్క సమాధానంతో satisfy కాలేదు..ఎందుకంటే నాకు HIV గురించి కాస్త తెలుసు.

Four stages in HIV infected person
1.        
      Acute HIV infection : Illness occurs in individual when infected by HIV. Usually within 2 to 6 weeks. Person may have flu like symptoms. This period is also called window period..
2.       Incubation period: No symptoms, stage lasts for about 3 to 5 years..
3.       HIV positive symptomatic period : Immunity decreases. Person gets symptoms like fever, loose motions, and skin diseases..stage lasts for 2 to 3 years..
4.       AIDS stage: TB, incesent cough, severe weight loss, diarrhoea, skin rashes..


ప్రసాద్ గారిలో లాస్ట్ స్టేజి లో ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయ్..అప్పుడు ఆదిత్యకి ఫోన్ చేసి చెప్పాను.... “ తీసుకొచ్చినా ఉపయోగం ఉండదు రా, డబ్బులు వేస్ట్” అన్నాడు..
మళ్ళీ అక్కని పిలిచి....
” అక్కా లాస్ట్ ఇయర్ HIV వచ్చి ఉంటే అప్పుడే ఇంత సీరియస్ అవదు” అన్నాను ..
ఉన్నట్టుండి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ..
అయిదేళ్ళ క్రితమే ఆయనకి HIV వచ్చింది తమ్ముడు..కానీ సరిగా మందులు వాడలేదు..ఎవరితోనూ అనకు తమ్ముడు...
“కానీ అక్కా ....ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళినా ఉపయోగముండదు..”
ఆఖరి ప్రయత్నం చేద్దాం...పొతే travelling charges పోతాయ్ అంతే కదా...
( ఆమెని చూస్తే ముచ్చటేసింది నాకు...భర్త వేరొక ఆడదాన్ని చూస్తేనే చంపేసే ఈ రోజుల్లో, తప్పు చేసి రోగం తెచ్చుకున్నాడని తెలిసినా, అది ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నది పోగా ఇంకా బతికించుకోడానికి తాపత్రయ పడుతుంది...నాకు వెళ్ళాలని లేకపోయినా ఆమె  మొహం చూసి వెళదామని నిర్ణయించుకున్నాను..)

ఒక గంటలో ambulance మాట్లాడి బయలుదేరం...అక్క, department లో పని చేసే ఒకాయన్ని(john) కూడా రమ్మని అడిగింది..ఆయన వస్తానన్నారు...ఆయనకో  45 సంవత్సరాలుంటాయి..ప్రసాద్ గారూ, ఆయన మంచి ఫ్రెండ్స్ అంట..
నేను , సరితక్క , జాన్ గారు, డ్రైవర్, పేషెంట్ బయలుదేరాం...వాన్ బయలుదేరే వరకు నాకు భయమే.. నన్నెక్కడ కుర్చోమంటారని..ఎందుకంటే ambulance లో వెనక కుర్చోవడమంటే నరకం..అదీ తెల్లవార్లూ..లక్కీ గా నన్ను డ్రైవర్ పక్క సీట్లో కూర్చోమన్నారు..వెనక సరితక్క, జాన్ గారూ కూర్చున్నారు...కొంతమంది చుట్టాలు మొసలి కన్నీళ్ళతో సాగనంపారు...

నిడదవోలు నుంచి రాత్రి 10 గంటలకి ambulance బయలుదేరింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రసాద్ గారికి oxygen పెట్టి మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టాం...లైట్ వేసి ఉంటే, ఎదురుగా ఉన్న view mirror లో వెనుక వాళ్ళు కనబడుతున్నారు..
నిడదవోలు...కొయ్యలగూడెం...జంగారెడ్డి గూడెం...అశ్వరావు పేట....వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం....అక్కడ లైట్ ఆపేసాడు డ్రైవర్...రోడ్ అధ్వాన్నంగా ఉంది..ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పడానికి కూడా లేనంత దరిద్రంగా ఉంది..ఖమ్మం వెళ్లేసరికి 3 అయిపొయింది..నాకు మాములుగానే నిద్ర రాదు..ఇక ప్రయాణంలో ఏమొస్తుంది..నెమ్మదిగా వెనక్కి వాలాను....


..............................


1998
మా బాబు బుట్టాయిగూడెం లో పని చేసే వాడు...అప్పుడు నేను 7th చదువుతున్నాను..మా వెనక ఇంట్లో ఉండేవారు ప్రసాద్ అంకుల్ వాళ్ళు..మొదటిసారి ప్రసాద్ గారిని, సరితక్క ని చూసినప్పుడు, ఆయన కూతురనుకున్నాను..తరువాత అమ్మ చెప్పింది, భార్య అని...అసలు విషయమేమిటంటే ఆయన మొదటి భార్య, ఈయన వేషాలు భరించలేక విడాకులిచ్చి వెళిపోయింది..తరువాత సరితక్కని ఇచ్చి పెళ్లి చేసారు..అప్పటికి ఆమె వయసు 18, ఆయన వయసు 37..చాలా బాధేసింది నాకు...పైగా ఎంత అందంగా ఉంటుందో..చుబుకం మీద ఒక చిన్న పుట్టు మచ్చ తప్ప మరింకే మచ్చా లేని అందగత్తె..పైగా ఆయన్ని ఎంతో బాగా చూసుకునేది..ప్రసాద్ గారు భయంకరమైన పిసినారి..వడ్డీలకి డబ్బులు తిప్పి అప్పటికే లక్షలు సంపాదించాడు..అప్పుడప్పుడు, ఆయన అరుపులు, సరితక్కని కొడుతున్న దెబ్బలకి, ఆమె ఏడుపులు మా ఇంట్లోకి వినిపించేవి....

...............................


ఇంతలో అక్క బండి ఆపమంది...ఆపాడు డ్రైవర్
పెట్టిన oxygen బలవంతంగా పీకేసుకుంటున్నాడు ప్రసాద్ గారు...బండి పక్కకి పార్క్ చేసి డ్రైవర్ పెట్టడానికి tri  చేసాడు..అయినా ఉంచుకోవట్లేదు...మళ్ళీ అక్క tri చేస్తుంటే ప్రసాద్ గారు ఏదో అనడానికి tri చేసాడు..నాకు అర్ధం కాలేదు..అప్పుడు అక్క..” చూడు తమ్ముడు ...నా పళ్ళు రాలగొట్టేస్తానంటున్నారు oxygen పెడుతున్నానని “ అంది నవ్వుతు..( చింత చచ్చినా పులుపు చావలేదు అనుకున్నాను మనసులో)..మొత్తానికి ఇక oxygen పెట్టలేదు...మళ్ళీ బండి బయలుదేరింది..అక్క వాటర్ బాటిల్ తో నీళ్ళు తాగి, అదే బాటిల్ మూతతో కొన్ని నీళ్ళు ఆయన నోటిలో కూడా పోసింది...ఆ దృశ్యం చూసి నా మనసు చలించి పోయింది ఎంత ధైర్యముండాలి..ఎంత ప్రేముండాలి...
“ HIV is not spread through sharing food, touching, hugging , kissing on cheeks, shaking hands etc..,..”
కానీ ధైర్యం ఉండాలి కదా....అదీ last stage of AIDS లో పేషెంట్...
మనసులో...ఇలాంటి భార్య దొరికితే చాలనుకున్నాను...లైట్ ఆఫ్ చేసాడు డ్రైవర్...

సూర్యాపేట దాటాం...కొత్తగా పోసిన రోడ్ మీద బండి హాయిగా పరిగెడుతుంది..నాకు బోర్ కొడుతుంది..ఎందుకైనా మంచిదని  I-pod  తెచ్చుకున్నా. కానీ అలాంటి పరిస్థితిలో పాటలు వింటే ఏమనుకుంటారో అని బయటికి తియ్యలేదు..
..టైం 3  ½  అయ్యింది..ఎందుకో view mirror లో చూసాను ...ఎదురుగా వస్తున్న వాహనాల లైట్స్ పడుతున్నప్పుడల్లా వెనుక కూర్చున్న వాళ్ళు కనబడి, మాయమవుతున్నారు...అప్పుడు ఆ వెలుగు నీడల క్రీడలో చూసిన దృశ్యాన్ని నమ్మలేకపోయాను...జాగ్రత్తగా పరిశీలించి చూసాను..జాన్ గారు ఆమెని, పెదవులపై ముద్దు పెట్టుకుంటున్నాడు..చేతులతో ఊరువులని, స్థనాలని తడుముతున్నాడు, తాకుతున్నాడు..ఆమె కూడా కళ్ళు మూసుకుని ఆ స్పర్శని ఆస్వాదిస్తుంది....ఒక్క క్షణం చప్పున వెనక్కి తిరగాలనిపించింది..కానీ ఆగి, చూపు పక్కకి తిప్పుకుని  సీట్లో వాలి కళ్ళు మూసుకున్నాను...ఆ దృశ్యం నాకు , డ్రైవర్ కి సరిగా కనబడకపోయినా వెనుక పడుకున్న ప్రసాద్ గారికి క్లియర్ గా కనబడుతుంది..ఆయనకి శరీరంలో ఇంకా పని చేస్తున్న భాగాల్లో కళ్ళు కూడా ఉన్నాయి...తన భార్య, తన స్నేహితునితో , తన ఎదురుగానే...( ఆహా ఎంత గొప్ప శిక్ష వేసావక్కా...ఆయన నిన్ను పెట్టిన బాధలకి ఇలా కసి తీర్చుకున్నావా..తెలిసి చేస్తున్నావో , తెలియక చేస్తున్నావో తెలీదు గాని ఇంతకన్నా గొప్ప revenge లేదు......అయ్యా..అమ్మా..దయచేసి సరిత మీద కోపగించుకోకండి.....)(చలం...ఎక్కడున్నావయ్యా?? ఇదిగో నీ కధానాయిక...జనాలకి నచ్చ చెప్పు నా వల్ల కాదు.)..నెమ్మదిగా తల కొంచెం కుడి పక్కకి తిప్పి ప్రసాద్ గారి వంక చూసాను..కుడి కంటి నుంచి నీరు కారి, చారికలు కనపడుతున్నాయి..ఎడమ కంటి సంగతి నాకు తెలీదు..

ఇక దాని గురించి ఆలోచించడం మానేసి i-pod తీసి ఆన్ చేశాను.. నెమ్మదిగా “ గోరంత దీపం” లో పాట మొదలయ్యింది..

చీర సగం కప్పేస్తే, సిగ్గు సగం దాచేస్తే
మిగిలిందేమిటి చూడ మిగిలిందేమిటి నేస్తం
పాత పరమ చాదస్తం...
గాలి ఎవరిది , గంధమెవరిది
వెలుతురెవరిది, వెన్నెలెవరిది
భక్తపోతన పద్యమెవరిది
త్యాగరాజల పాట ఎవరిది
నీవి కావా నావి కావా
ఆలయంలో రామచంద్రుడు, ఆకాశంలో పూర్ణ చంద్రుడు
ఎవరి సొంతం , రమణి అందం ఎవరి సొంతం

తెల్లవారి 8 గంటలకి NIMS కి చేరుకున్నాం..సరిగ్గా ambulance, హాస్పిటల్ ముందు ఆగేసరికి , ప్రసాద్ గారికి ఎగ శ్వాస మొదలయ్యింది..నేను అక్కడున్న డాక్టర్ తో మాట్లాడాను..” HIV positive  ని ఈడ అడ్మిట్ చేసుకోరు..ఉస్మానియా కి తీస్కపొండి” అన్నాడు...నేను మళ్ళీ ambulance దగ్గరికి వెళ్ళేసరికి ఎగశ్వాస ఎక్కువయ్యింది..అక్క కంగారు పడుతుంది...oxygen పెట్టి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంది..నల్లగుడ్లు వెనక్కి వెళ్ళిపోయాయి...అంతే..ప్రాణం పోయింది..ఎటు పోయిందో మరి...( యమ ధర్మ రాజు ఏ పక్కన నుంచుని పాశం విడిచాడో అన్న ఆలోచన వచ్చింది)....నిస్సహాయంగా, కర్కశంగా చూస్తూ నిలబడ్డాను తప్ప కనీసం చెయ్యి కూడ వెయ్యలేదు..ఎందుకంటే నేను కోరుకున్నది అతని చావునే.(in fact అందరు)...సంవత్సరం నుండి మంచం మీద చావుతో పోరాడుతున్నాడు...అంతకు మించి ఇక ఒక ప్రాణిని బ్రతికించి, హింసించడం భావ్యం కాదు..

Ambulance ఉస్మానియా కి బయలుదేరింది...అక్క ఏడుస్తుంది....నేను ప్రశ్నార్ధకంగా చూసాను..నా జీవితంలో చనిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాను గాని , నా ఎదురుగా ప్రాణం పోవడం ఇదే మొదటి సారి...అదీ దారుణమైన చావు..వెళ్లేసరికి ఆదిత్య, సమీర్ వెయిట్ చేస్తున్నారు...ఆదిత్య చెక్ చేసి ప్రాణం పోయిందని confirm చేసాడు...అంతే మళ్ళీ ప్రయాణం మొదలు..అప్పటికే రాత్రంతా నిద్ర లేక మొహాలు వాడిపోయాయి...నా వంక జాలిగా చూసారు మా వాళ్ళు..( పేషెంట్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఓ రెండు రోజులు ఎంజాయ్ చేద్దామనుకున్నా అసలు).. చౌటుప్పల్ దాటాక ఒక దాబా దగ్గర ambulance ఆపారు...నన్నేమన్నా తినమన్నారు..నాకు పెద్దగా ఫీలింగ్స్ ఏమీ లేవు...కాస్త మొహం కడుక్కుని ఒక నాలుగు రోటీ తిన్నాను..ఈ సారి విజయవాడ మీదగా వెళ్ళాం...ఆయన స్వంత ఊరు గుడివాడ..అక్కడ శవాన్ని దింపి బయలుదేరి మళ్ళీ నిడదవోలు వచ్చేసరికి నైట్ 10 అయ్యింది...

గుట్టు చప్పుడు కాకుండా ఒక quarter vodka( ఇంట్లో కదా మరి smell రాకూడదని) తెచ్చుకుని తాగేసి పడుకున్నాను....

 ..........................





Saturday 6 October 2012

వేశ్య(పతివ్రత)

మేఘాల రహదారి మీద రవితేజ సారధిగా ఉన్న శ్వేతాశ్వమ్ముల రధం శర వేగంతో దూసుకుపోతుంది..వెనుక రవితేజ భార్య మధులత, పిల్లలు ఉదయ దీపిక, శశిరేఖ ఉన్నారు.
            
 ఏ వాహనం అడ్డు లేదు, సిగ్నల్స్ లేవు, స్పీడ్ బ్రేకర్స్ లేవు..చుట్టూ ఎంత దూరం వ్యాపించి ఉందో తెలియని ప్రశాంతత..పిల్లల కేరింతలు, మధులత నవ్వు తప్ప అక్కడ మరింకే శబ్దం లేదు..సూర్యుడు తన కాంతులు నిర్విరామంగా ప్రసరిస్తున్నాడు. కింద ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండే ప్రపంచం కూడా నిశ్శబ్ధంగా ఉంది .రధం ముందుకి వెళుతుంటే కింద వెనక్కి వెళిపోతున్న ఒక్కో దృశ్యాన్ని పిల్లలకి చూపించి వివరిస్తుంది మధులత..నిమిషానికో ఊరు, అరగంటకో జిల్లా, అలా భారతదేశాన్ని చుడుతున్నారు ..రవితేజ కి కాఫీ అంటే చాలా ఇష్టం ..అందుకే బయలుదేరేప్పుడు ఒక flask నిండా కాఫీ పోసి తీసుకొచ్చింది మధులత...ఒక కప్ లో కాఫీ పోసి     " రవీ ఇదిగో కాఫీ తీసుకో" అని పిలిచింది. వినబడలేదు రవికి. మళ్లీ పిలిచింది..
             ఉన్నట్టుండి  పెద్ద చప్పుడయ్యింది...ఎందుకో తెలీదు, రధచక్రం శీల విరిగిపోయింది. రధం ఓ పక్కకి ఒరిగిపోతుంది పిల్లలు భయంతో అరవడం మొదలు పెట్టారు. నాన్నా... పడిపోతుంది..కింద పడిపోతాం చచ్చిపోతాం ...ఏడుస్తున్నారు...


          రవీ..కాఫీ... మళ్లీ పిలిచింది మధులత...
మధులత వైపు కాస్త కోపం, కాస్త ఆశ్చర్యం మిళితమైన చూపు చూసాడు రవి..నెమ్మది నెమ్మదిగా రధం కిందకి పడిపోతుంది... ఏం చెయ్యాలో అర్ధం కాలేదు రవికి..
    రవీ..... కాఫీ ...
రెండవ చక్రం కూడా ఊడిపోయింది. తను చనిపోతనన్న భయం కన్నా, పిల్లల ఏడుపే భయంకరంగా అనిపించింది రవికి..కాసేపటికి రధం నేలకి గుద్దుకుని ముక్కలుముక్కలైపోయింది....

................................

కళ్ళు తెరిచాడు రవి..ఎదురుగా చిలుకపచ్చ రంగు చీర కట్టుకుని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని పూర్తిగా తడి ఆరని తలని, తువాలుతో ముడి వేసుకుని  చేతిలో కాఫీ కప్ తో నిలబడి ఉంది మధులత..


కొంటెగా నవ్వుతూ.... మళ్లీ కలగన్నావా రవి అంది.
చిన్న నవ్వు నవ్వి లేచి కుర్చుని, వదులయిన లుంగి బిగించి కట్టుకుని, మంచం దిగి కప్ అందుకున్నాడు రవి...

"చెప్పు ఇవాళ ఏం కల కన్నావ్?"
రాత్రి పడుకునే ముందు ఏమన్నావ్ నువ్వు?
"ఏమన్నాను చనిపోయే లోపల ఇండియా అయిన పూర్తిగా చూడాలి అన్నాను."
ఉ...అదే చేస్తున్నాం కలలో..
నవ్వుకుని అక్కడి నుండి వెళిపోయింది మధులత..
..................................

వరండా లోకి వెళ్లి పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టాడు రవి..ఈ మధ్య కాలంలో తెలుగు దేశం గురించి, బాబు గురించి తప్ప మరేమీ రాయడం లేదని తెలిసినా "ఈనాడు" పేపర్ మాత్రమే వేయించుకుంటాడు రవి..దానికి కారణం కార్టూనిస్ట్ శ్రీధర్.

09/09/2014"

 బొత్సకి దొరకని సోనియా దర్శనం"
" స్పీకర్ తల బద్దలు గొట్టిన తెరాస మంత్రి"
"విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం"
కొత్తగా ఏమి లేవు....కాని మెయిన్ పేజి చివర్లో ఎడమ చేతి పక్క కింద కార్నర్ లో ఇచ్చిన ప్రకటన దగ్గర రవితేజ కళ్ళు ఆగాయి...



శ్రద్దాంజలి 
కలవచర్ల. సావిత్రి 
జననం:03/02/1964                 మరణం: 07/09/2014

కూతురు: ప్రణతి MS.pediatrician
అల్లుడు: శ్రీనివాస్ MS.orthopedic
మనవడు: రవితేజ 

ఆ ఫోటో లో ఉన్న స్త్రీ వంక కన్నార్పకుండా చూస్తూ అలాగే ఉండిపోయాడు రవితేజ......

......................................


09/10/2002

కొయ్యలగూడెం...పశ్చిమ గోదావరి జిల్లా..ఒక మారుమూల పల్లెటూరు...పూర్తిగా పల్లెటూరు అనడానికి కూడా లేదు..ఎందుకంటే చుట్టు పక్కల ఉన్న దాదాపు 200 కుగ్రామాలకి అదే మండలం...మూడు సినిమా theaters   ఉన్నాయ్..

హై-వే పక్కన ఉన్న రాంబాబు బడ్డి కొట్లో నుంచుని gold flake filter సిగరెట్ తాగుతున్నారు మోహన్ కృష్ణ, మురళి, రవితేజ.....ముగ్గురు ప్రకాశం డిగ్రీ కాలేజీ లో డిగ్రీ 2nd year  చదువుతున్నారు.లంచ్ అవర్ లో భోజనం చేసి రోజూ సిగరెట్ తాగడం అలవాటు....ఆరోజు హోరున వర్షం కురుస్తుంది..మాములుగా కన్నా వర్షం కురుస్తున్నప్పుడు, చలేస్తున్నప్పుడు సిగరెట్ తాగితే ఆ మజాయే వేరు...

ఒరేయ్ ఎన్ని రోజులు రా gold  flake filter ...ఇంక మనం కింగ్ కి update  అవ్వలేమా? అన్నాడు మోహన్ కృష్
అవ్వొచ్చు దాందేముంది..ఇప్పుడు ఒక్కొక్కళ్ళం ఒక్కోటి కాలుస్తున్నాం...అప్పుడు ముగ్గురం కలిసి ఒక్కటే కాల్చాలి...అయినా కింగ్ కాల్చేవాణ్ణి చూసి బాధపడకండి రా...చార్మినార్ కాల్చేవాణ్ణి చూసి సంతోష  పడండి .వాడి కన్నా మనం బెటర్ అన్నాడు రవితేజ...
 ఇంతలో మురళి....:"రేయ్ రవి..మొన్న నీకు చెప్పానుగా ఒక కాండిడేట్ గురించి అదిగో అదే....వెళుతుంది చూడు...ఎర్ర గొడుగు...

 సగం కాల్చిన సిగరెట్ నేల మీద పారేసి, అటు ఇటు వస్తున్న లారీలను కూడా పట్టించుకోకుండా పరుగెత్తాడు రవి. ఆమె దగ్గరికి వెళ్ళేసరికి  తడిసి  ముద్దయిపోయాడు..అకస్మాత్తుగా  ఎవరో పరుగెత్తుకు వచ్చి పక్కన నిలబడేసరికి ఉలిక్కిపడి తలతిప్పి చూసింది ఆమె. అంత జోరు వానలో తడుస్తూ, రొప్పుతూ, తన పక్కన నిలబడిన కుర్రాణ్ణి

చూసి ఒకింత ఆశ్చర్యపోయింది..రవితేజ ఆమెని చూసి నిశ్చేష్టుడయ్యాడు..ఆమె వేశ్య అన్న నిజాన్ని ఒక్క క్షణం జీర్ణించుకోలేకపోయాడు..అతనికి "ప్రార్ధన" నవల లో మాటలు గుర్తొచ్చాయ్...

ఆ శరీరం విద్యుల్లత 
అ లలాటము అర్ధచంద్రము 
ఆ కపాలము దర్పణము 
ఆ జడ  బృంగావళి
కేశాలు చామరాలు 
కనుబొమ్మలు స్పర్శ చాపాలు 
నాసిక తిలప్రసూనము 
నేత్రము కందళీ  కుట్మలము
చూపు ఉత్పల పంక్తి 
దంతము ముత్యము 
పలుకు వేణు నాదము 
నఖములు కంద కళ్హికలై ,
స్థనములు చక్రవాకములై,
నాభి ఆవర్తమై, 
వళ్హువ నిచ్చెనులై ,
పృష్టము కాంచన పట్టమై ,
నితంబము పులినమై 
ఊరువులు కదళీ కాండములై,
హసము వెన్నెలై, పుష్పమై, ఫేనమై, కైవరమై ప్రభవించిన అప్సరస..

ఎవరు.. అన్న ఆమె మాటలకు తేరుకున్నాడు రవి ..
సావిత్రి అంటే నువ్వేనా?
అతని మాటల్లోని తెచ్చిపెట్టుకున్న పొగరు చూసి ముందు కోపం వచ్చినా అతని కళ్ళలోని అమాయకత్వం చూసి దాన్ని అణుచుకుని...సౌమ్యంగా అవును...ఏం కావాలి అంది...
ఎలా అడగాలో అర్ధం కాలేదు..ఫ్రెండ్ దూరంగా చూసి ఆమె వేశ్య అని చెబితే నమ్మివచ్చాడు.అసలు వాడనుకుంది ఈమె కాకపోతే, ఇంకేమైనా ఉందా.అయినా వేశ్య అయితే మాత్రం నడి రోడ్డు మీద భేరసారాలడితే ఒప్పుకుంటుందా...మళ్ళీ తనలోనే తాను "అయినా వేశ్యలకి ఫీలింగ్స్ ఏంటి  nonsense" అనుకున్నాడు..

హలో బాబు నేను వెళ్ళాలి త్వరగా చెప్పు...
నీ రేటెంత?
ఇంకా పూర్తిగా రాని అతని నూనుగు మీసాలు, అతనడిగిన ప్రశ్న రెండూ అతనికి ఇంతకు పూర్వం ఇందులో అనుభవం లేదని చెప్పకనే చెబుతున్నాయ్..
వెంటనే నవ్వింది సావిత్రి...
నవ్వుతావేంటి...నేను సీరియస్ గా అడుగుతున్నాను..చెప్పు...
సరే ...నా రేటు ఒక రాత్రికి 5000...నేనెక్కడికీ రాను ...జంగారెడ్డి గూడెం, సౌభాగ్య lodge కి వెళ్లి నా పేరు చెప్తే ఒక రూం ఇస్తారు.ఈవినింగ్ 7.30 కి వస్తాను..మార్నింగ్ 6 కి వెళిపోతను.రూం, రాను పోను charges నీవే..రూం లో మందు తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదు...అని చెప్పి వెళ్ళిపోయింది..

వింటూ నోరు వెళ్ళబెట్టాడు రవి..కాసేపు అక్కడే నిలబడి వెనక్కి నడుచుకుంటూ వెళిపోయాడు..ఈసారి నెమ్మదిగా... చాలా నెమ్మదిగా...మళ్లి లారీల రాకపోకలు పట్టించుకోకుండా....ఒక రాత్రికి అయిదు వేలా....ఎందుకో అసంకల్పితంగా జేబు తడుముకున్నాడు..వర్షానికి, ఉన్న ఒక్క పది రూపాయల నోటు తడిసిపోయింది..

......................................

రాత్రి సరిగా భోజనం చేయలేకపోయాడు రవి...మనసులో ఆమె రూపం అలాగే ముద్రించుకుపోయింది...రాత్రి 10 గంటలకి, ఈ పాటికి ఎవడు ఆ అందాన్ని అనుభవిస్తున్నాడో అనుకున్నాడు.
ఎందుకో శ్రీశ్రీ మాటలు గుర్తొచ్చాయ్..

" కడుపు దహించుకుపోయే పడుపుకత్తె రాక్షస రాతిలో 
అర్ధ నిమీలిత నేత్రాల బాధల పాటల పల్లవి"


ప్రేమాభిషేకం గుర్తొచ్చింది..

నిన్నకు రేపుకు సంధిగ నిలిచిన సుందరీ పాదాభి వందనం పాదాభి వందనం..

నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు..ఒకటే కలలు 

ఓ అందమైన పువ్వుని ఎవడో మూర్ఖుడు చేతితో నలిపేస్తున్నట్టు 
ఓ అందమైన రాగం తాగుబోతు నోట్లో నాశనమైపోతున్నట్టు 
ఓ గొప్ప చిత్రకారుడి చిత్రం జడివానలో తడిసిపోతున్నట్టు...
ఒకటే పిచ్చి కలలు...

.......................................

నెల రోజుల తర్వాత

విజయలక్ష్మి ఫోటో స్టూడియో...స్టూడియో ఓనర్ కుర్రాడే...పేరు వినోద్..రవికి మంచి ఫ్రెండ్...మధ్యాహ్నం కాలేజ్ లేకపోయినా, వెళ్ళాలనిపించకపోయినా  ఆ స్టూడియో లో కూర్చోవడం రవికి అలవాటు..స్టూడియో అంతా ఒకే గది...దాన్నిcurtain తో రెండు భాగాలు చేసాడు...ముందు counter, వెనక  ఫొటోస్ తీయడానికి ప్లేస్...అక్కడే పక్కనే కూర్చోవడానికి రెండు కుర్చీలు, ఒక సోఫా ఉంటాయ్..



ఎప్పట్లాగే రవి సోఫా లో పడుకుని సితార చదువుకుంటున్నాడు. ఇంతలో వినోద్ ఎవరితోనో మాట్లాడడం వినిపించింది.అది ఎక్కడో విన్న గొంతు..
 " ఏంటండీ ఇన్ని రోజులు.... 5 డేస్ క్రితం ఇచ్చేస్తానన్నారు"
అయిపోయాయ్ madam, ఒక్క అయిదు నిముషాలు కూర్చోండి ఇచ్చేస్తాను .
ఆ గొంతు గుర్తు పట్టాడు రవి...వెంటనే వెళ్లి చూడాలనిపించింది..కానీ ఏదో వెనక్కి లాగింది..చూడాలన్న కోరిక ముందుకు నెడుతుంది..
ఇంతలో వినోద్, " వెనక చైర్స్ ఉన్నాయ్ కూర్చోండి madam" అన్నాడు..

curtain పక్కకి జరిపి లోపలికొచ్చింది సావిత్రి...కొంచెం మసక చీకటిగా ఉంది..సోఫా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది..

ఒక రెండు నిముషాల నిశ్శబ్దం తర్వాత గుర్తుపట్టారా నన్ను అన్నాడు రవి...
ఆ...గుర్తున్నావ్....వర్షం...రోడ్డు మీద...మరిచిపోలేదు..ఇంతకీ నీ పేరేంటి ?
రవి తేజ
(పేరు విని ఒక్క క్షణం మౌనంగా ఉంది)
ఏంటి మళ్లీ కనబడలేదు....డబ్బులు రెడీ చేసుకున్నావా?
"లేదు"
ఏ...వేస్ట్ అనిపించిందా?
"ఎందుకు అలా అన్నారు?"
తనకి అందని ఆడదాన్ని వేస్ట్ అనుకోవడం, ఆమె గురించి చీప్ గా మాట్లాడుకోవడం అలవాటే కదా.
"అర్ధం కాలేదు"
ఉ....నా రేటు అందుబాటులో ఉంటే ఏమంటారు..ఒక్క రాత్రి ఆమె అందాన్ని అనుభవించడానికి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదంటారు...అదే అందుబాటులో లేకపోతే అంత స్పెషల్ ఏముంది దానిలో..అందరి లాంటి ఆడదే..అయిదు నిముషాల సుఖం కోసం దానికి అయిదు వేలు తగలెయ్యలా అంటారు
..నవ్వాడు రవి.."నాకంత పెద్ద విషయాలు తెలీవు..మిమ్మల్ని కలవనంత వరకు కేవలం మిమ్మల్ని అనుభవిస్తే
చాలనుకున్నాను..కానీ కలిసిన తర్వాత మీతో కుర్చుని మాట్లాడాలనిపించింది.."
సరే చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావ్?
" ఇలా కాదు ఏకాంతంగా, ప్రశాంతంగా "
ఆ అవకాశం నేను నీకెందుకు ఇస్తాననుకుంటున్నావ్?
"ఇవ్వరని తెలుసు...అందుకే డబ్బు సంపాదించడానికి ఒక పార్ట్ టైం జాబు జాయిన్ అయ్యా...ఇంకో రెండు నెలల్లో నేను 6000 సంపాదించి మళ్లీ  మీకు కనబడతాను."
ఇంకేం మాట్లాడలేదు సావిత్రి....అతని మాటల్లో ఏదో ఒక మూల నిజాయితీ కనబడింది..
ఇంతలో వినోద్ పిలిచాడు...".మేడం ...మీ ఫొటోస్ రెడీ"
లేచి వెళిపోతూ రవి చేతిని చేతిలోకి తెసుకుని ఫోన్ నెంబర్ రాసి సాయంత్రం ఫోన్ చెయ్ అని వెళిపోయింది...

...................................

హలో
" నేను రవిని"
హా....రవీ చెప్పు...
"ఎందుకు ఫోన్ చెయ్యమన్నారు"?
నాతో మాట్లాడాలి అన్నావ్ కదా అందుకే చెయ్యమన్నాను...
" ఇలా కాదు ఎదురుగా కుర్చుని మాట్లాడాలి"
తేడా ఏమిటంట?
"ఫోన్ లో మాట్లాడితే ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ భావాలు తెలియవు..అసలు నిజమో, అబద్దమో తెలియదు..నటించడానికి అవకాశమెక్కువ..."
సరే నీ ఇష్టం అని ఫోన్ కట్ చేసింది...

...................................

మూడు రోజుల తర్వాత....
హలో
" నేను సావిత్రిని"
చెప్పండి..
" రేపు మధ్యాహ్నం ఖాళీగానే ఉంటావా?"
ఉ. రేపు కాలేజీ లేదు...ఖాళీనే
"సరే అయితే మా ఇంటికి వస్తావా?"
వస్తా కానీ ఎందుకు సడన్ గా?
"ఊరికే సరదాగా రా...రాజేశ్వరి apartments తెలుసుగా వెంకటేశ్వర ధియేటర్ పక్కన"
తెలుసు
అందులో ఫ్లాట్ నెంబర్ 302...మధ్యాహ్నం 12 తర్వాత రా..

...................................


వెళ్ళాడు రవి..లోపలికి వెళ్ళగానే air  conditioned గాలి చల్లగా తగిలింది. అదసలు వేశ్యా( వేశ్య) గృహం లా లేదు..ఒక aristocratic atmosphere ఉందక్కడ...కాళ్ళ కింద polished  marble, గోడలకి అందమైన paintings, ఓ పెద్ద ప్లాస్మా టీవీ...చాలా అందంగా ఉంది ఇల్లు...
కూర్చో రవి అని దివాన్ కాట్ చూపించి లోపలికివెళ్ళింది సావిత్రి....
రవి ఇంటిని తేరిపార చూస్తున్నాడు....
ఇంతలో ఆపిల్ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది సావిత్రి...


చెప్పు రవి ఏంటి మాట్లాడాలన్నావ్?

ఇంత అకస్మాత్తుగా అంటే నాకేం గుర్తు రావడం లేదు..
"పరవాలేదు టైం తెసుకుని అడుగు.."
కాసేపు మౌనం తర్వాత అన్నాడు రవి...మీ అమ్మ కూడా వేశ్యా?
ఆ ప్రశ్నకి ఒకసారే తలెత్తి చూసింది సావిత్రి..."అదేంటి అదేం ప్రశ్న?"
నా ఉద్దేశ్యం...ఈ వృత్తి నీకు వంశ పారంపర్యం గా వచ్చిందా లేక ఏ కారణాల వల్లనైనా నువ్వు ఈ రొంపిలోకి వచ్చావా?
ఏం మాట్లాడలేదు కాసేపు సావిత్రి...
"నేనిక్కడ ఉంటానని అసలు ఎవరికీ తెలీదు...నేనెవర్నీ ఇంటికి పిలవను అసలు..."
నేనడిగిన ప్రశ్నకి జవాబు అది కాదు..
"సరే...నువ్వు కష్టపడి 5000 సంపాదించనక్కర్లేదు"...రా అని తన కౌగిట్లోకి రమ్మన్నట్టు చేతులు చాపింది...
ముందుకి కదలలేదు రవి..
రవి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి " ఇంతకు ముందు ఒక్కసారి కూడా అనుభవం లేదా"? అని అడిగింది.
లేదు అని అడ్డంగా తల ఊపాడు...
"సరే ఏం కాదు రా"...అని తనని ముందుకు లాగింది....
విదిలించుకుని వద్దు...ముందు నేనడిగింది చెప్పు అని లేచి వెళ్ళిపోయాడు రవి...


.....................................



రవి వెళ్ళిపోయాక చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయింది సావిత్రి...అసలు ఆ వయసులో ఉన్న కుర్రాళ్ళు ఎలా ఉంటారో ఆమెకి బాగా తెలుసు...అంతకన్నా చిన్నవాళ్ళని ( డబ్బున్న వాళ్ళని )తన అనుభవంలో చాలా మందిని చూసింది..అసలు తనకేం కావాలో ఆమెకి అర్ధం కాలేదు..ఆలోచించగా ఆలోచించగా అర్ధమయ్యింది...

రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసింది..
రేపు మధ్యాహ్నం  రా రవి అని చెప్పి కట్ చేసింది...
.......................................


ఈ సారి రవి రాగానే తన బెడ్ రూం లోకి తీసుకెళ్ళింది..అక్కడ గోడ మీద ఒక ఫోటో ఉంది. దాన్ని చూపించి ఆయనే  నా భర్త, పేరు తేజ అని చెప్పింది. అక్కడ ఉన్న సోఫా లో కుర్చుని నెమ్మదిగా తన గతం చెప్పడం మొదలు పెట్టింది..



మా నాన్న, నేను చిన్నప్పుడే చనిపోయారు..అమ్మ అష్ట కష్టాలు పడి పెంచింది నన్ను..ప్రాణం పోయినా శీలం పోగొట్టుకోకూడదని చెప్పేది మా అమ్మ...నా అందం నాకు ఎప్పుడు శాపమే అయ్యింది...మా అమ్మ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి చాలా భయపడేది.. అందుకే నాకు 18 సంవత్సరాలకే పెళ్లి చేసింది.నాకు పెళ్ళైన ఆరు నెలల తర్వాత అమ్మ చనిపోయింది..నా భర్త తేజ, నన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించేవాడు....ఏ దేవుణ్ణి  మనం కళ్ళతో చూడలేదు గనక అందర్నీ నమ్ముదాం..ఎందుకంటే ఆపద కాలంలో ఎవరు ఆదుకుంటారో మనకి తెలీదు కదా అనేవారు...పెళ్ళయిన రెండు సంవత్సరాలకి మాకు పాప పుట్టింది...అంతా సవ్యంగా జరిగితే ఇది జీవితం ఎందుకవుతుంది...పాపకి ఆరు నెలలొచ్చిన తర్వాత ఆక్సిడెంట్ లో ఆయన చనిపోయారు..ఆ మరుక్షణమే నాకు కూడా చనిపోవడానికి బోలెడంత ధైర్యం ఉంది...కానీ పాప నన్ను పిరికిదాన్ని చేసింది...దాన్ని చంపి నేను చచ్చేంత కర్కశత్వం, ధైర్యం రెండూ నాకు లేవు..నన్ను నేను పోషించుకోడానికి నాకున్న డిగ్రీ చదువు చాలనిపించింది . మొండిగా బ్రతకడం మొదలుపెట్టాను..



ఓ రోజు రాత్రి నేను ఒంటరిగా నిద్రపోతున్నాను ఇంట్లో..పాప ఉయ్యాలలో పడుకుంది..రాత్రి 12 గంటలకి తలుపు చప్పుడయ్యింది...నేను ఒంటరి ఆడదాన్ని అన్న నిజం నేను అప్పటికింకా గ్రహించలేదు..కానీ ప్రపంచం గ్రహించింది..ఎవరు అని కూడా అడక్కుండా తలుపు తీసాను...ముగ్గురు మృగాళ్ళు ఇంట్లోకి వచ్చారు...వాళ్ళు తాగి ఉన్నారు..నేను చెయ్యబోయే తరవాత పని తెలుసుకుని, ఒకడు గట్టిగా నా నోరు మూసాడు..ఇంకొకడు ఉయ్యాలలో ఉన్న పాపని తీసి కత్తి పీక మీద పెట్టి నేను నోరు తెరిస్తే చంపేస్తానన్నాడు ....సినిమా కధలా ఉంది కదూ...కానీ నిజం...చాలా నిజాలే తర్వాత కాలంలో సినిమా కధలయ్యాయి...సినిమా కధలు చూసి inspire అయ్యి మళ్ళీ చాలా మంది వాటిని నిజం చేసారు..ఓ పక్క పాప ఏడుస్తుంటే, కొద్దిగా కూడా జాలి లేకుండా ఒకరి తర్వాత ఒకరు అనుభవించారు నన్ను...చిన్న వాడివి..పచ్చి బాలింత అంటే బహుశా నీకు తెలిసి ఉండకపోవచ్చు...ఆ క్షణంలో నేను అర్ధించని దేవుడు లేడు...గోడ మీద ఉన్న ముగ్గురిలో ఒక్కరికీ మనసు కరగలేదు...ఆ క్షణంలో నాకు దేవుడి మీద నమ్మకం పోయింది...రెండు గంటల తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోయారు....తెల్లవార్లూ నేను ఏడుస్తూ, ఏడుస్తున్న నా పాపని ఊరుకోబెట్టాను...కంప్లైంట్ ఇచ్చి ఒక ఒంటరి ఆడది సాధించేది ఏమీ లేదు..ఆక్కడే ఉంటే ఆ తర్వత రోజు కూడా నేనా క్రూర మృగాలకి బలవ్వాలని నాకు తెలుసు..అందుకే పాపని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాను...నాకున్న డిగ్రీ తో CRESA అనే సంస్థ లో జాయిన్ అయ్యాను...నెలకి 5000 జీతం...దాని డైరెక్టర్ ప్రభుదాస్...నా పరిస్థితి చెప్పగానే చాలా బాధ పడ్డారు...భయపడొద్దని  ఎంతో ధైర్యం చెప్పారు..ఆయన మాటలకి నాకు తండ్రి లేని లోటు తీరిందనిపించింది..



జీవితం ప్రశాంతంగా గడుస్తుంది...ఇంట్లో పాపని చూసుకోడానికి ఓ పెద్దావిడని పెట్టాను..ఓ రోజు ఆఫీసు లో పని ఉండి 8 వరకు ఉండిపోయాను..బయలుదేరుతుంటే నేను కార్లో దింపుతానన్నారు ప్రభుదాసు గారు..కార్లో jesus christ ఫోటో అద్దానికి అంటించి ఉంది...నాకు తెలీని ఒక మారుమూల ప్రదేశానికి కారు తీసుకెళ్ళారు...పెద్ద వాడు గనక నేనేమి అడగలేదు...కానీ కార్ ఆపి ఆయన నా వైపు చుసిన చూపును బట్టి ఆయన expect  ఏమి  చేస్తున్నాడో నాకు అర్ధమయ్యింది...10 వేలు డబ్బు కట్ట తీసి నా ముందు పెట్టాడు...నేనేం మాట్లాడలేదు...ఆయనే ఏవేవో చెప్పాడు..నా భార్యని నేను కలిసే ఛాన్స్ లేదని...8 years నుంచి ఆమెని నేను కలవలేదని...ఇంకా, ఏవేవో...నేను పూర్తిగా వినలేదు..వినడానికి అసలు నా మనసక్కడ లేదు.....I was  completely absent..అసలు ప్రభుదాసు లాంటి వ్యక్తిలో ఇలాంటి ఒక angle ఉంటుందని ఎవరూ ఊహించరు..మగాళ్ళందరూ ఇలాగే ఉంటారా? అందమైన ఆడదాని నుంచి అందరు expect  చేసేది ఇదేనా?? నా మౌనాన్ని మరోలా అర్ధం చేసుకున్నాడు ప్రభుదాసు..దారుణమైన విషయమేమిటంటే అతని పెద్ద కూతురు జ్యోతి నాకన్నా రెండు సంవత్సరాలు పెద్దది..తరువాత 20 నిముషాలు నా నుంచి తనకి కావలసింది తీసుకున్నాడు...అతని చేసిన దానికి బాధ కన్నా, నన్ను తన ఫ్రెండ్స్ ఇంకో నలుగురితో షేర్ చేసుకోనందుకు ఆనందమేసింది నాకు..ఇంటి దగ్గర దింపాడు..



మా అమ్మ మాటలు గుర్తొచ్చాయ్ ...శీలం పోగొట్టుకోవడం కన్నా ప్రాణం పోగొట్టుకోవడం మిన్న...కానీ శీలం అంటే ఏమిటి? పరాయి స్త్రీని గాని, పురుషుణ్ణి గానీ మనసులో తప్పుగా ఉహించుకోవడం కూడా వ్యభిచారమే అంటుంది bible.అంటే ఈ విధంగా రోజుకి ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల సార్లు శీలం పోగొట్టుకుంటున్నారు... నా ఆలోచన తప్పని తెలుసు నాకు..కానీ నేను చేయబోయే దానికి సమర్ధింపు వెతుక్కుంటున్నానంతే ..పేదవాళ్ళకి శీలం ఉండకూడదు...ఉన్నా ఏదో రోజు బలవంతంగా ఎవరొకరు లాగేసుకుంటారు...అలా పొతే పోయినట్టు కాదంటారు కొంతమంది పెద్దలు....nonsense, 20 నిముషాలకి పది వేలిచ్చాడు...నెలంతా రోజుకి 10 గంటలు అలిసిపోతే వచ్చేది 5 వేలు...నాకు డబ్బు మీద ఆశ లేదు...కానీ అది లేకపోతే సమాజం లో విలువ లేదు..నా బిడ్డకి దేనికీ లోటు రాకూడదు...అసలు ఇటువంటి నీచమైన స్థితి ఆమెకి పట్టకూడదు..నిర్ణయించుకున్నాను...పాపని ఢిల్లీ లో చదివిస్తున్నాను....దానికి నేనేం చేస్తున్నానో తెలీదు...తెలిసేలోపు నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాను..నేను దాని తల్లినని సమాజానికి తెలీకూడదనే ఈ చుట్టు పక్కల ఎవరికీ తను కనపడకుండా అంత దూరంలో చదివిస్తున్నాను...డబ్బుంటే అన్నీ చెయ్యొచ్చు రవి..ప్రపంచం మన చుట్టూ తిరుగుతుంది..ఎవరో అన్నట్టు...



ఉన్నవాడు చేస్తే శృంగారం 
పేదవాడు చేస్తే వ్యభిచారం
ఇది ఏమి గ్రహచారం ఓ జాబిలమ్మా..


నువ్వడగొచ్చు మరి ఇలా చేస్తే నీ భర్తకి ద్రోహం చేస్తున్నట్టు కాదా అని...ఏ రోజయితే ఆయన చనిపోయాడో ఆ రోజే ఆయన భార్యగా నేను చనిపోయాను...నా మనసూ చనిపోయింది..నా శరీరాన్ని తానెప్పుడు ప్రేమించలేదు..నేనూ ఆయన్ని తప్ప జీవితంలో ఇంకెవర్నీ ప్రేమించలేదు..ప్రేమించను కూడా...ఇంట్లో నుంచి బయటకి రాని అమ్మాయికి తన స్థనాలను ఎవరన్నా చూసినా పాపమే అనిపిస్తుంది..సిటీ బస్సు లో travel   చేసే అమ్మాయికి, ఎవరైనా పొరపాటున తాకినా అదేం పెద్ద పాపం కాదనిపిస్తుంది...పరిస్థితుల్ని బట్టి పాప, పుణ్యాలు...శీలం నిర్వచనాలు మారిపోతే...ఈ తుచ్చమైన దేహం నాకు లక్షలు సంపాదించి పెడుతున్నప్పుడు ఆ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు....బోలెడంత మంది రాజకీయ నాయకులూ, పోలీసు ఆఫీసర్స్ నా చుట్టూ కుక్కల్లాగ తిరుగుతున్నారు...నన్ను ఆ రోజు బలవంతంగా పాడు చేసిన ఆ ముగ్గుర్నీ 10 సంవత్సరాల పాటు జైలు లో పెట్టించాను....ఇదంతా తప్పని నాకు తెలుసు..కానీ నాకు ఇంతకన్నా మార్గం కనపడలేదు.. ఇది నా గతం..ఇదేనా నువ్వు తెలుసుకోవలనుకుంది..??



రవి తల  దించుకుని ఉన్నాడు...దగ్గరకెళ్ళి గడ్డం పట్టుకుని పైకి లేపింది సావిత్రి...రవి కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయ్...లేచి నిలబడ్డాడు...ఒక్కసారిగా అమాంతం తనని కౌగిలించుకున్నాడు....ముద్దు పెట్టుకున్నాడు.ఒకసారి కాదు బోలెడు సార్లు...అదో అనిర్వచనీయమైన భావం...దానికింకా పేరు లేదు..ఇద్దరు కలిసి, వెనుక ఉన్న మంచం మీదకి ఒరిగారు..ఇద్దరి కళ్ళ వెంటా నీళ్ళు కారుతున్నాయ్...ఇద్దరూ ఒకటయ్యారు...అది కామం కాదు...మోహం కాదు..ఒక తనువు మరొక తనువుకిచ్చే ఓదార్పు....ఇంకా బాగా చెప్పాలంటే.....it  is  just  a  temporary physical (biological /emotional ) need ..



తరువాత రోజు నుంచి రవికి అక్కడికి రావడం దినచర్య లో ఒక భాగమైపోయింది....అలసిపోయేవాడు..అక్కడే నిద్రపోయేవాడు...నిద్రపోతున్న రవిని చూసి బిడ్డను చూసుకున్న తల్లిలా మురిసిపోయేది సావిత్రి...అలా రోజులు గడుస్తున్నాయ్...పూర్తిగా కాలేజీ కి వెళ్ళడం మానేసాడు రవి...ఒకో రోజు రాత్రి అక్కడే ఉండిపోయేవాడు...



........................................



ఓ రోజు రవి గుండెల మీద పడుకుని, " సావిత్రీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అన్నాడు..

నవ్వింది సావిత్రి..
" నవ్వకు నేను నిజంగా అంటున్నాను"
నేను నీకన్నా పది సంవత్సరాలు పెద్దదాన్ని తెలుసా?
"ఏం పరవాలేదు"
 పిచ్చి పిచ్చి గా ఆలోచించకుండా పడుకో..


రవితేజ ఇంక అడగడు అనుకుంది గాని రొజూ అదే అడగడం మొదలు పెట్టాడు...



మనం ఎక్కడికైనా వెళ్లిపోదాం..నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను..నాకు మా ఇంటికెళ్ళడం ఇష్టం లేదు...నన్ను ఊరికే కని పారేసారు..ఇంట్లో  వాళ్ళకి నా మీద ప్రేమ లేదు..ఇంత ప్రేమగా చూసుకుంటున్న నిన్ను నేను వదులుకోలేను...

ఏం మాట్లాడలేదు సావిత్రి..
రాను రాను బాగా మొండి పట్టు మొదలు పెట్టాడు...నువ్వు ఒప్పుకోకపోతే నేను అన్నం తినను అన్నాడు...నిజంగానే తినడం మానేసాడు.2nd  year  final  exams  రాయడం మానేసాడు...సావిత్రి చివరికి అలోచించి సరే అని అన్నం తినిపించింది...
"చెప్పు ఎక్కడికెళ్దాం?"
నేను తీసుకెళ్తాను ...మనం comfortable గా ఉండగలిగే ప్లేస్ కి...
"ఎప్పుడు వెళదాం ?"
ఇవాళ శుక్రవారం, ఎల్లుండి ఆదివారం సాయంత్రం వెళిపోదాం .ఈ లోపు నీకు కావలసినవన్నీ సర్దిపెట్టుకుని ఉంచుకో...
అలాగే అని బయలుదేరాడు రవి....ఆప్యాయంగా నిమిరి, కౌగలించుకుని, నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సావిత్రి...

తనకి కావలసినవన్నీ సర్దుకున్నాడు రవి...రాత్రంతా నిద్రపోలేదు..సావిత్రికి 4 సార్లు కాల్ చేసి మాట్లాడాడు...తరువాత రోజు ఎప్పట్లాగే సావిత్రి ఫ్లాట్ కి వెళ్ళాడు..లాక్ చేసి ఉంది..ఎవరినో అడిగితే రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళిపోయిందని చెప్పారు...ఎక్కడికి వెళ్లిందో తెలీదు...కాల్ చేస్తే మొబైల్ స్విచ్ ఆఫ్...తను రాదని తెలిసినా ఒక వారం పాటు రోజూ  వెళ్ళాడు ఫ్లాట్ దగ్గరకి..మనుషుల్లో లేడు రవి...ఎవరితోనూ మాట్లాడలేదు..జ్వరం వచ్చింది...15 రోజులు మంచం దిగలేదు..తర్వాత కూడా అన్యమనస్కంగానే ఉండేవాడు...4 నెలలు పట్టింది పూర్తిగా ఆమె ఆలోచనల నుంచి బయటకి రావడానికి....సావిత్రి మీద విపరీతమైన కోపం పెంచుకున్నాడు..you  bloody  bitch అనుకున్నాడు మనసులో.....

అది జరిగిన అయిదు సంవత్సరాల తర్వాత, నెమ్మది నెమ్మదిగా అర్ధమయ్యింది ఆమె ఆ రోజు అలా ఎందుకు చేసిందో...మనసులో రొజూ ఆ పతివ్రత  ని తలుచుకునేవాడు..

.....................................

తల మీద ఎవరో చెయ్యి వేసినట్టనిపిస్తే కళ్ళు తెరిచి చూసాడు రవి...ఎదురుగా భార్య మధులత నిలబడి ఉంది...
ఏమయింది రవీ..
నీకు సావిత్రి గారి గురించి చెప్పాను కదా ఆవిడ ఈమే అని పేపర్ చూపించాడు.....



**************