Monday, 13 October 2014

కవి సంగమం # 10 #

అమ్మా తస్మాత్ జాగ్రత్త


మగాళ్ళం

పాదాలకు మెట్టెలున్నా..
పక్కనే భర్త ఉన్నా ...
పళ్ళూడని పిల్లవైనా....
పవిట కొంగు తొలగినా...
ఆఖరికి పసిబిడ్డకి పాలిస్తున్నా..
మా కన్నులు వెతికేదేమిటో
మా చూపులు తొలిచేదేమిటో
నీకు తెలియంది కాదు...

మగాళ్ళం
కోరలు పెంచుకొని నడి బజారులో బరి తెగించి తిరుగుతున్న మృగాళ్ళం

అణువుగా ఉన్నప్పుడే..
అంత జాగ్రత్తగా ఒడిలో పొదువుకోకుండా...
ఆ గుండెలకేసి గట్టిగా అదిమేస్తే
ఊపిరాడక చచ్చేవాళ్ళం కదా ....

నువ్వు కరిగి మా కండలకి పుష్ఠినిచ్చినందుకు,
మా ఏడుపుకి నువ్వు వణికినందుకు
మా నవ్వుకి నువ్వు పులకించినందుకు
చూసావా ఋణం ఎలా తీర్చుకుంటున్నామో!!

దేవతామూర్తుల విగ్రహాలు తాకి
దాహం తీర్చుకునే ప్రబుద్దులున్నారమ్మా మాలో

ప్రేమించి వంచించేందుకే మాకు చదువులు
పెళ్ళాడి హింసించేందుకే మాకు కొలువులు

మితభాషి అయినా , మృదు భావి అయినా
కవి అయినా , కళారవి అయినా
కూలి వాడయినా, కడకి దేవుడే అయినా
మేమందరం మగవాళ్ళం
మా అందరిదీ ఒకటే దృక్పథం
నీ కన్నీట తడవడమే మాకు పరమ కైవల్య పథం

అందుకే
అమ్మా తస్మాత్ జాగ్రత్త ......

_మోహన్ తలారి

కవి సంగమం # 9 #

(బళ్ళో కాదురా ప్రకృతి మాత ఒళ్ళో)

నాన్నా  నిన్ను బళ్ళో వెయ్యను....
ఎందుకంటావా ....చెప్తా విను

నీ మెడలు వంచి
వంకర గీత మీద వంద సార్లు దిద్దించి తల ఎత్తుకు తిరిగే పౌరుషాన్ని ఆదిలోనే పాతిపెట్టేస్తారు 

రాంకుల రేసులో ముందుకు పరుగెత్తించి
జీవితం రేసులో మాత్రం వెనక్కి నెట్టేస్తారు..

సరస్వతీ నిలయాలన్నీ ధనలక్ష్మీ కొలువులయిపోయాయి..
చదువుకోవడం లేదు ఇప్పుడంతా చదువు కొనడమే

వ్రాయించి, అరిపించి, గీయించి, �వేధించి నిన్ను యంత్రాన్ని చేస్తారు..
ఆడించి, పాడించి, బుజ్జగించి నేను మనిషిని చేస్తాను...

ఆ నాలుగు గోడల మధ్యలో  స్వేద దుర్గంధాలు పీల్చే దౌర్భాగ్యం నీకొద్దు 
పరిమళ సుగంధాలు మోసే మలయ మారుతాలు పీల్చి తరిందువు గాని

ఉదయాన్నే వికసించి సాయంత్రానికి వాడే పొద్దు తిరుగుడులా చూడలేను నిన్ను 
అనునిత్యం ప్రకాశించే , వెలుగుల్ని ప్రసాదించే భానుమూర్తిని చేస్తాను 

ఆయాకేమి తెలుసు రా ఆకలెప్పుడేస్తుందో నీకు
ఆ మేడమ్ కేం తెలుసురా నిద్దరెప్పుడొస్తుందో నీకు 

నే కోల్పోయిన బాల్యాన్ని నీతో కలిసి అనుభవిస్తాను అందుకే నాన్నా బళ్ళో కాదు ప్రకృతి మాత ఒళ్ళో వేస్తాను నిన్ను..

_ మోహన్ తలారి
(To my son Dharanee priyatham)

Thursday, 9 October 2014

కవి సంగమం #8#

రాత్రికి వయసెంత ? అనడిగితే
పగటికన్నా ఒక పూట తక్కువ అనే లౌఖ్యం నీకుందా......
అందుకే నేను మనిషిని సార్....

అంగారక గ్రహంలో ఏముందన్న తపనే తప్ప
పొరుగువాడి అంతరంగంతో నాకసలు పనే లేదు..

భూకంపాలకి, సునామీలకి స్కేళ్ళున్నాయ్ నా దగ్గర ,
పేదవాడి ఆకలికి మీటర్ లేదు..

చచ్చాక  ఏమౌతానన్న భయమే గాని
సరిగ్గా బతకడం ఇంకా నేర్చుకోలేదు

లంచమా??
నాకు దొరకలేదన్న బాధే గానీ
దాంతో నాకేం సమస్య లేదు - మనిషిని సార్ నేను..

అత్యాచారమా ??
నాకు ఛాన్స్ దొరకలేదన్న ఏడుపే గాని
ఇదేం నిజం రోదన కాదు - మగాణ్ణి సార్ నేను

ఇన్ని నీతి కబుర్లు రాస్తానా..??!!
ఒక్కటీ నేను చెయ్యలేను..
ఎందుకంటే .....ప్రతిసారీ అడగొద్దు మరి నన్ను

దేవుడున్నాడా అంటావా??
అది మాత్రం అడక్కండి సార్ మా మనుషులూరుకోరు...
కావాలంటే మనిషిని చంపేసుకోండి మేం అడగం...

చెట్లకి, పుట్లకి , అప్పుడెప్పుడో చచ్చిన ఎలక్కి వయసు కనుక్కునే పనిలో నేనుంటే...
పురిట్లో సచ్చిన బిడ్డ కోసం ఈ గోలేంటయ్యా

demonstrations , నిరసనలు , సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు, చారిటీలు  ఇవన్నీ  నిజమనుకునేరు.....

అంతా డ్రామా సార్...

ఎందుకంటే after all నేను మనిషిని సార్....

-మోహన్ తలారి

Monday, 6 October 2014

కవి సంగమం # 7 #

జ్ఞాపకాలు - 2


నీ తూరుపుని నా పశ్చిమని కలిపే
ధవళేశ్వరం వంతెన మీద
ఓ సంధ్యలో మనిద్దరం సంగమించి,
పడమటి వేపు చూస్తూ విన్న సంధ్యారాగం
ఇప్పటికీ ఓ అందమైన జ్ఞాపకం

పరవళ్ళు తొక్కుతున్న ఎర్ర గోదారిని చూసి
నీ కళ్ళలో ఉదయించిన సౌందర్యం...
దూరంగా దిజ్మండలిలో ప్రతిబింబిస్తే
ఆ అందాన్ని అలా కళ్ళప్పగించి చూడడం
ఇప్పటికీ ఓ మధురమైన జ్ఞాపకం

ఆ అపురూపమైన ప్రకృతి సోయగం చూసి ఆదమరిచావనుకొని
అదను చూసి నడుము పై వేసిన  చేతిని
అంతే సున్నితంగా తొలగించిన నీ ప్రమత్తత ముందు
చిత్తుగా ఓడిపోయిన నా ఆత్రం
ఇప్పటికీ నాకో మరపురాని జ్ఞాపకం ...

ఆదిత్యుడెళుతూ వదిలేసిన కుంకుమని
ఆ సాయంకాలపు ఆకాశం నీ మేనికి అద్దుతుంటే
నిన్ను విడిచి వెళ్ళే ముందు నాలో పుట్టిన వేదన
నీ కళ్ళలో కన్నీటి బొట్లయి ప్రతిఫలించినప్పుడు
మన గుండెల్లోని ప్రేమ కొత్త గోదారై ఉరకలెత్తడం
ఎప్పటికీ నాకో దివ్యమైన జ్ఞాపకం


కవి సంగమం # 6 #

జ్ఞాపకాలు - 1


ఆ రోజు పెండ్యాల రేవులో
ఎండాకాలం మబ్బేసిన మధ్యాహ్నం
నావ సూరిగాడి పాకలో
వాడు లేని వేళ చూసి
మనం గుట్టుగా చేరినప్పటి సంగతి

“నీ కోసమే ఈ సీర” అని కళ్ళతో చెప్పి...
ఆకట్టుకున్న మందిని గుర్తుకు తెచ్చుకుని,
ఆ కట్టుకున్న ఇబ్బందిని గొంతులోకి తెచ్చుకుని,
“ఎవరెవరి మీదో రాస్తావంటగా
నా మీద కుడా రాయి” అన్నావ్...

నేనా ??!! ఏం రాయను ?? అన్న నా ప్రశ్నకి
మరిప్పుడు నాకోసం కాశి రాజు ఒస్తాడా అన్న నీ చిలిపితనానికి
ముక్కు చివర పండిన నా జెలసీ ని,
ముద్దిచ్చి పోగొట్టిన నీ అందం ఒక అందమైన జ్ఞాపకం.....

అటు పై ఆ తడి తుడవడానికి,
అప్రయత్నంగా నే చేసిన ప్రయత్నానికి
ముక్కు చివర ఎర్రబడ్డం నీ వంతయ్యింది...
చొరవ తీసుకోవడంలోని అందం స్త్రీలకెంత సొంతమో ఎరిగి
ఆ ఎరుపు పోగొట్టే చొరవ నేను చెయ్యలేదు....

ఆనక, తిప్పలో నువ్వు ఆల్చిప్పలు ఏరుతుంటే
ఎండకి మెరుస్తుంది నువ్వా , ఇసికా అనీ ..
“నన్ను పట్టుకుంటే ఇంకోటి” అని నువ్వు పరిగెడుతుంటే
ప్రవహిస్తోంది నువ్వా , గోదారా అనీ ..
పోల్చుకోలేక, విడివిడిగా చూడలేక బాధపడ్డాను, కూలబడ్డాను ...

ఇంతలో నెమ్మదిగా పొద్దు కుంగి
గోరింకలు , కొంగలు గూళ్ళకి పోతుంటే ...
చుక్కలొక్కొక్కటిగా చందమామ దగ్గర హాజరేయించుకుంటుంటే..
అలిసిపోయిన నావ గోదారమ్మ ఒళ్లో ఉయ్యాలూగుతుంటే..
అప్పుడప్పుడు అల్లరి గాలి జుట్టు చెరుపుతుంటే...

“ఇంటికెళ్ళరా అబ్బాయ్ సీకటడిపోయింది”
అని సూరిగాడనే దాకా నువ్వక్కడే ఉన్నావనుకున్నాను ....

Tuesday, 30 September 2014

కవి సంగమం # 5#

నీకు ప్రేమించడం తెలీదంది.....
తమని తాము ప్రేమించుకోడం తెలీని వాళ్ళే 
ప్రేమించడం మీద, ప్రేమించబడడం మీద ఆధారపడతారన్నాను....

నీకు మనసే లేదంది...
చలం మైదానం లోనో , బుచ్చిబాబు ఆశాప్రియ పాదాల దగ్గరో పడుంటుంది చూడన్నాను.....

దేవుణ్ణి నమ్మకపోతే ఇలాగే పిచ్చి వాళ్ళవుతారంది...
నమ్మి మనుషులవడం కన్నా నయమన్నాను.....

అప్పుడప్పుడూ ఈ ప్రపంచంలోకి వస్తుండాలంది...
నా ప్రపంచంలోకి వచ్చి చూస్తే ఆ మాట అనవన్నాను.....

కన్నీళ్ళకి కాస్త కరగడం నేర్చుకోమంది....
కన్నీళ్ళు మింగి బతకడం నేర్చుకున్నానన్నాను....

రాతి హృదయాల ముందు మొర వృధా అంది...
రాళ్ళతో ఆర్గ్యుమెంట్ నాకూ అంతే అన్నాను ....

_ మోహన్ తలారి

కవి సంగమం # 4 #

పెద్దల్ని, స్నేహితుల్ని , శ్రేయోభిలాషుల్ని, అందర్నీ 
ఎదిరించి మరీ.....
నా కాళ్ళకి బంధం , నా నోటికి చిక్కం నేనే....
తాళి కట్టి మరీ తెచ్చుకుంటున్నానని ఆరోజు 
నాకు తెలీదు....

"నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను"..
అని నువ్వనడం ప్రేమ కాదు అబధ్రతా భావం 
అని తెలిసాక ప్రేమ మీద నమ్మకం పోయింది ...

నాకు దూరంగా ఉన్నప్పుడు శనివారం సాయంత్రాలే..
నా పై ప్రేమ ఎందుకు ఎక్కువవుతుందో
అర్థరాత్రి వరకూ ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో...
నాకర్ధం కాలేదనుకోవడం నీ అమాయకత్వమని 
అనుకోకుండా ఉండలేను....

గొడవయిన ప్రతిసారీ ....
నీ ఏడుపు ముందు నా మిగిలిన ఆయుధాలన్నీ నిర్వీర్యం అయినప్పుడు ,
కడుపారా ఏడవలేని మగతనాన్ని తలుచుకుని 
ఏకాంతంలో ఏడవకుండా ఉండలేను....
సున్నితత్వాన్ని.......కన్నీళ్ళు, జెండర్ బట్టి కాక
మనసుని బట్టి నిర్ణయించమని ప్రపంచానికి చెప్పకుండా ఉండలేను..

ఇన్నాళ్ళ తర్వాత నిన్న మా వాడు ఫోన్ చేసి
"కవిత్వం రాయడానికి ఇన్స్పిరేషన్ లేదంటావేమిరా 
చక్కనాల చుక్కని ఇంట్లో పెట్టుకుని " అంటే
హిమాలయాలని దూరం నుంచి చూస్తేనే కవిత్వం పుడుతుంది....దగ్గరికెళితే వణుకు పుడుతుంది
అన్న నా రిప్లై జోక్ అనుకుని వాడు నవ్వేస్తే 
నేను కూడా నవ్వకుండా ఉండలేకపోయాను.....