Tuesday 28 October 2014

కవి సంగమం # 14 #

%% నవలోకం  %%


మిత్రమా
ఇదిగో చూడు
ప్రపంచం అంచుల చివర నిలబడి
చేతులు చాచి పిలుస్తున్నాను
నా దగ్గరికి రా నవలోకం నిర్మించుకుందాం

వచ్చేముందు ఒక్కసారి
ఆత్మ విమర్శ చేసుకో
అవసరమో కాదో నిన్ను నువ్వే ప్రశ్నించి చూసుకో
నిజంగానే అవసరం అనిపిస్తే అక్కడే ఉండిపో
ఇటువైపు కన్నెత్తైనా చూడకు

కానీ
విచక్షణ ఏ మాత్రం చెంప చెల్లుమనిపించినా
అన్నింటినీ వదిలి వచ్చెయ్
ఎలా అంటే అమ్మ కడుపులోంచి వచ్చినంత స్వచ్చంగా..
సంఘమే తొడిగిందో నువ్వే తగిలించుకున్నావో
జాతి,మత,కుల,వర్ణ మౌడ్యాలని బద్దలుగొట్టుకుని రా
మితిమీరిన జ్ఞానం కళ్ళకు కప్పిన పొరలు చీల్చుకుని రా

నన్ను నన్నుగా నువ్వు స్వీకరించగలిగితే
నిన్ను నిన్నుగా హత్తుకోడానికి నే సిద్దంగా ఉన్నాను

నవలోకం నిర్మించుకుందాం
కొత్త గేయాలు రచించుకుందాం
స్వేచ్చాగానాలు మనసారా పాడుకుందాం
ఈ పెద్దరికం ఏమిస్తుంది ..పనికిమాలిన గాంభీర్యం తప్ప
పిల్లలమవుదాం...పవలు, రాత్రి పువ్వులమల్లె నవ్వుకుందాం
ఇహలోక , పరలోక , పాతాళ లోక చర్చలు మనకొద్దు
ప్రేమించడం నేర్చుకుందాం ...

త్వరపడు మిత్రమా ..
చాలా పని ఉంది మనకి
మంటల్లో కలిసి సగం కాలి కొన ఊపిరితో
కొట్టుకుంటోంది మానవత్వం
ఎలాగోలా బ్రతికించుకుందాం
అచ్చంగా స్వచ్చంగా మనుషుల మల్లె జీవిద్దాం..
అచ్చంగా స్వచ్చంగా మనుషుల మల్లె మరణిద్దాం  

No comments:

Post a Comment