Friday, 5 December 2014

కవి సంగమం # 37 #

# ఆఖరి మజిలీ # 

కొందర్ని ద్వేషిస్తావ్
ప్రత్యక్షంగానో పరోక్షంగానో

కొందర్ని అసహ్యించుకుంటావ్
అవసరంగానో అనవసరంగానో 

కొందర్ని కోపగించుకుంటావ్ 
కారణంగానో అకారణంగానో 

కానీ ఓరోజు
నీ లోపాలు నువ్వు గుర్తించగలిగిన రోజు
విశ్వమానవత్వానికి నిర్వచనం నీకు తెలిసిపోయిన రోజు
అసలు దైవత్వానికి అర్ధం బోధపడిన రోజు

అందర్నీ ప్రేమిస్తావ్
చిరునవ్వుతోనో చిన్న విసుగుతోనో
ఖచ్చితంగా ప్రేమను మాత్రమే ఇస్తావ్

ఆరోజు

మనిషిగా నిన్ను నువ్వు మలుచుకుంటున్న ప్రయాణంలో
ఆల్ మోస్ట్ ఆఖరి మెట్టుకు చేరుకున్నట్టే

కవి సంగమం # 36 #

Indus Martin & Mohan Talari 

// జన్యునాటకం //

సమ , క్షయకరణ విభజనల సమీకరణాలలో
ఇరవై మూడు జతల క్రోమోజోముల 
కలయికల లోపాలే వాళ్ళు

ఏ ఒత్తిడికో లోనై
నిస్సహాయంగానో అత్యుత్సాహంగానో
నైరాశ్యంలోనో వైరాగ్యంలోనో
జన్యువు చేసుకునే సర్దుబాట్ల ఫలితమే వాళ్ళు
జీవం తన ఉనికిని కాపాడుకోడానికి
ఆకృతిని ఫణంగా పెట్టి ఆడే జూదంలో
సమిధలు వాళ్ళు
ప్రపంచపటం మీద నిదానించి నడుస్తున్న ఏకైక జీవులు
చేయని అపరాధానికి బాధల శిలువను
మోస్తున్న అష్టావక్ర క్రీస్తులు
ఆసరా కోసమే కాక స్నేహం కోసం కూడా
అపరిచితులకైనా చెయ్యి చాపగల మహానుభావులు
వికలాంగులు

అనంతకోటి బ్రహ్మాండంలో నక్షత్రం నక్షత్రాన్ని గుద్దుకోవడం కన్న
పెద్ద accident బీజకణాల సంగమం
ఫలితంగా పురుడు పోసుకున్న ప్రాణం
జీవం ఆడే నాటకంలో యాదృచ్చిక వరాలనే
తలాంతులుగా మురిసిపోయే మనం ఎవరం?
మేలిమి ఛాయను చూసుకుని మురిసిపోయే అమ్మడు
కోటేరు ముక్కు చూయించి మురిపించే తమ్ముడు
బొద్దు మీసాలని మగతనానికి నిదర్శనమనే మగాడు
నొక్కుల జుట్టును పొగరుగా ఎగదోసే కుర్రాడు
పొడవును ప్రస్తావించి పొట్టిని విమర్శించే ఆజానుభాహుడు
గుప్తాంగాల సైజును చూసుకుని సంతృప్తికి కేరాఫ్ అడ్రెస్ అనుకునే వీరాంగుడు
ఆకార వికారాలకి సైతం కులాన్ని ఆపాదించగల సమర్ధుడు
సంక్రమించిన ఐశ్వర్యాన్ని చారిటీ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించే ధనికుడు
తమ ప్రమేయం లేకుండా సంప్రాప్తించిన ప్రతి దాన్నీ
తడిమి చూసుకు మిడిసిపడే ప్రతి ఒక్కరూ
మానసిక వికలాంగులే

మనసులో ఏ మాలిన్యమూ లేక , కించిత్ సౌందర్య స్పృహ ఎరుగక
చిరునవ్వే ఆభరణంగా ధరించి సహజంగా చరించే
ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఏ వైకల్యమూ లేని మానవులే...

NOTE:
డిసెంబర్ 3 వతారీకును అంతర్జాతీయ వికలాంగుల దినంగా యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. ప్రతీ వందమందిలో పదిహేను మంది ఏదో ఒకరకమైన శారీరక వైకల్యంతో జీవిస్తున్నారు. వీరికి కావలసింది మన దయ, ఆదరణ అనుకుంటే పొరపాటే. వీరు ఎదురుచూసేది ఇంక్లూజివ్ సొసైటీ కోసం. తమను ఒక ప్రత్యేక వర్గంగా చూడకుండా , వైకల్యాలను దాతృత్వం పేరుతో గుర్తుచెయ్యకుండా కలుపుకు వెళ్ళగలిగే సమాజంకోసం.
వివరాలకు క్రింది రిపోర్ట్ చదవండి

కవి సంగమం # 35 #

Indus Martin & Mohan Talari # హర -కిరి

కవి కవి కవి 
ఎవడు వీడు ...ఏ ప్రత్యేక అంశ లో జన్మించాడు 
మనిషికి లేని కొత్త అవయవాలు, ఆలోచనలు , అభిప్రాయాలు 
వీడికేముంటాయ్
ఇప్పుడు కొత్తగా పాత్రాపరిచయ కార్యక్రమాలెందుకూ? 

నీ గుమ్మం దాటి రాని అనుభవాలేవో గుండెల్ని నలిపితే 
ఏ విషనాగురుల కోరలో ఒంటిలో దిగబడితే 
మామూలు మనిషి కవి అవుతాడు
తన గోడు కవిత్వానికి వినిపిస్తాడు
అంతర్మధనానికి అమృతమో , విషమో జనిస్తుంది
ఫలితం సృష్టీ-లయం
ఏదైనా ఔతుంది

ఇక దూకుతున్నా అసలు బరిలోకి
చల్ చెడుగుడు చెడుగుడు...

అర్బనైజేషన్ (ఆర్గనైజేషన్) బొగ్గుపులుసు వాయువుల్లో
మీ దగ్గర ఈ పాచి మొహాలు పొగచూరిపోయాయేమో ..సంతోషం
ఇక్కడ మాకింకా పచ్చి ఆరలేదు ..
అరవై ఏళ్ల క్రితమే తగలెట్టినా కాలుతుందే కాని బూడిద కాలేదు
అడపా దడపా కాదు అడుగడుగునా అవమానాలు ఇంకా జరుగుతున్నాయ్
we are still exceptions

ఎవర్ని అన్నా నన్నే అనుకుని ఈ భుజాల తడుముళ్ళు ఎందుకు
గుమ్మడికాయలు ఇంట్లో ఉండబట్టేగా

ఎందరమ్మలు మా వెనక నిలబడి
ఎన్నిసార్లుచెప్పాలి
మా ఆర్తనాదాలు అసత్యం కాదని
వారి అనుభవాలు మాగొంతుకల్లో నిజనిర్ధారణ పత్రాలని
ఒక్కరిద్దరి ఆక్షేపణల పులుసొకోసం
శాంతిదూతవు ..అడ్దామీది కిరాయి హంతకుడివాయ్యావే?

అయినా ఇదేదో సముద్రమనుకొని దూకాను ..కాదా?
ఇక్కడ కూడానా ఈ కూపస్థ మండూకాల బెకబెకలు
ఎందుకు పుట్టామో ఎప్పుడు పోతామో తెలియని బ్రతుకులో
ఈత ఎలా కొట్టాలో పిత్తపరిగల దగ్గర నేర్చుకోవాలా ఖర్మ
మీ కాళ్ళ కింద నలిగిన దారుల్లోనే ఇంకెంత కాలం
మమ్మల్నీ నడిపించే ప్రయత్నం
మీరు కాల్చిన మూసల మూకుళ్ళలో
ఇంకెంతకాలం మభ్యపెట్టాలి అమ్మలను?
మీ విశృంఖలత్వాలకు నగిషీలు దిద్ది
ఎంతకాలం ప్రదర్శిస్తారు ఆదర్శ నాన్నలను

ఆ మాత్రం దానికి అన్ని నదుల్నీ కలుపుకుపోయే పవిత్ర పయోధిలాగ
ఈ సంగమాల ముసుగులెందుకో!
అగ్రహారం అని మార్చుకో రాదా ..ప్రవేశం నిషిద్దం అనరాదా
ముడ్డికి కట్టుకోవడానికి మా తాటాకులను కూడా తెచ్చుకుంటాం

ఇదేం రద్దీలో తొక్కబడిన పాదంకాదు
సారీ డ్యూడ్ అని వీపుతో చెప్పడానికి

చచ్చిన తర్వాతకూడా ఎగబడుతున్న
కుక్కలకు సుఖమిస్తున్న జననాంగం

గుర్తులు నీకు కనబడకపోవచ్చు ...నొప్పి నాకలాగే ఉంది
యుగాల తరబడి అనుభవించిన శోకం
ఏం నీ ఒక్క తరం భరించలేదా దాని జ్ఞాపకం?

నేతి ముద్దపప్పు , దద్దోజనం తిని పెరగలేదు
శాఖాహార భోజన సుగుణాలు వివరించడానికి
అమ్మ చంకలోను , నాన్న భుజాల మీద ఆడుకోలేదు
ప్రేమల మీద , ఆప్యాయతల మీద గేయాలు అల్లడానికి
ఏ పసిడి వన్నెల ముద్దుగుమ్మతోనూ ప్రేమలో పడలేదు
ప్రేయసి మెల్లకన్నుల మీద నగిషీలు చెక్కడానికి

నీ దాష్టీకంలో నాకెక్కడబ్బిందిరా
సౌందర్య స్పృహ?

ఆకలేస్తే కన్నీళ్లు మింగాం
ఆదరణ కరువైనప్పుడల్లా ఓ ఆప్త మిత్రుణ్ణి కౌగిలించుకున్నాం
అంటు బాబోయ్ అంటే దూరంగానే నిలబడ్డాం
మేం నోరెత్తితే సుస్వరాలు రావు
కాకులెప్పుడైనా కిలకిలారావాలు చెయ్యగా చూసావా?

నీభాషలో చెప్పిన 'ద్విభువన దర్శనం' బూతు కాదు
నీ నోటినుండి నేనేరుకున్న సృష్టికార్యానికి సెన్సార్ బోర్డ్లా?

మా కుంకుడు చెట్ల నీడన
మీకు థాయ్ మసాజులు చేస్తే
మీరు కప్పిన మేకతోళ్ళింకా కంపుకొడుతూనే వున్నాయ్

ఇన్ని పిల్లికూతలెందుకు
వత్తు 'బ్లాక్' ట్రిగ్గర్
మీటలు నొక్కేచోట మావాడెవడూ లేడని తెలుస్తూనే వుంది

ఇసుక తుఫాన్లు , సంవర్త భయంకర ప్రళయాలు
అనుభవించిన దేహమిది
పిల్ల “ గాలి ” కి బెదరదు

గరళాన్ని అనునిత్యం లేహ్యంగా నాకిన జిహ్వలివి
పథ్యం నువ్వేం రుచి చూపించగలవ్

డెడ్ లైన్ తొక్కి వెళుతున్నా
నీ యద మీద మెరుస్తున్న నా పాదం సాక్షి
రా..... ఇప్పుడు కూత నీది
చెట్టుమీద దెయ్యం .... నాకేం భయం
చల్ గుడు గుడు గుడు.......

(కాస్త అనుభవం కాస్త ఆవేశం )

కవి సంగమం # 34 #

# తృప్తిగా ఉంటుంది #

ఓ మంచి కవిత రాసుకున్నాక ఎలా ఉంటుంది ??

పంటి మీద గోదారి దాటెళ్ళి ఓ చిరకాల మిత్రుణ్ణి కలిసొచ్చినట్టుగా ఉంటుంది 

పది రోజులు లంకణం చేసాక అమృతంలా గొంతు దిగే చింతపండు చారు ముద్దలా ఉంటుంది 

పోయిందనుకున్న ప్రియమైన పుస్తకం ఇల్లు దులిపేప్పుడు దొరికినట్టుగా ఉంటుంది 

ఎత్తుకుంటామంటే ఇచ్చిన కొడుకు ఏడుస్తూ వెనక్కొచ్చి మెడ చుట్టుకున్నట్టుంటుంది

దేహాల్ని దహించే మండుటెండాకాలం మిట్ట మధ్యాహ్నం చిన్న మబ్బేసినట్టు ఉంటుంది

హఠాత్తుగా కురిసిన వానకి నిలువెల్లా తడిసి ముద్దయ్యాక రెండు చేతుల్తో పట్టుకుని వేడి టీ తాగినట్టుంటుంది

ఓ మంచి కవిత రాసుకున్నాక ఎలా ఉంటుంది ??
అమ్మకి అన్నం వడ్డించినంత ఆనందంగా ఉంటుంది

(రాత్రి నాకిష్ఠమైన మదీనా బిర్యాని అమ్మకి తినిపించాక...అమ్మ బావుంది నానా అన్నాక)

కవి సంగమం # 33 #

By Indus Martin & Mohan Talari

# ఉత్తమపురుష #

ఓం త్రయంబక యజమహే
సుగంధిం పుష్టి-వర్ధనం ....
వెధవముండ ఇంకా లేచిచచ్చినట్టు లేదు 
లేవగానే నాలుగు కాఫీ చుక్కలకోసం 
జిహ్వ లాగుతుంది. 
ఊర్వరుకమివ బంధనన్
మృత్యోర్ మోక్షే అమామ్రితత్..
విభూధికాయ కనిపించి చావదు
దిక్కుమాలిన కొంప ...
ఒక్కడ్ని పాటిస్తే సరిపోతుందా?
***********************
భోజనం కడితే సరా..?
ఆ వక్కపలుకులు నశ్యండబ్బా పెట్టావుటే..?
..........
దీనెమ్మా... ఒక్క పదినిమిషాలు ముందొస్తే...
ఏం జార్చిందిరా ... గుటకపడనీదు...
ఏమే అచ్చీ రాత్రి వదిలిన లుంగీ దొడ్లో వుంది..
నాలుగుదెబ్బలెక్కువెయ్యవే మడ్డి వదిలి చావట్లేదు
వళ్ళు చేసినట్టున్నావ్...బాగానే పెడుతున్నట్టున్నాడు

ఈ స్కూటరొకటి... పదినిమిషాలన్నా
ముందు వెళ్ళక్కర్లా...? కులం తక్కువ వెధవలకేం తెలుసు
రోజూ లేటు... మళ్ళీ ట్రాఫిక్ సంజాయిషీలు

హమ్మయ్యా... వచ్చేశా
ఈ క్లాస్ ఫోర్ ముండ వెళ్ళిపోయిందా ఏంటి?
అది వూడవడం మొదలెట్టేలోపు చేరిపోవాలి
కుర్చీలోకి
ఎనిమిది నెలలయ్యిందటే నీపెళ్ళయ్యి?
ఇంకా విషేషమేం లేదా...
ఆ తొక్కే రిక్షాయేదో ఇంట్లో తొక్కమనే నీమొగుడు పీనుగను

కాస్త అటు తిరిగిందంటే... బంబోళ జంబే..

వచ్చేసినట్టున్నారు అనాచారపు వెధవలు
వీళ్ళెమ్మా కడుపులు కాలా సిగరెట్ కంపు
తిప్పేస్తుంది కడుపంతా...
రెండు సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తే గానీ
తెరిపినబడదు...
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావఆసం స్మరేన్నిత్య....

సువర్చల వచ్చినట్టుందే... కొత్తచీర
ఏవిటీ విశేషం... జన్మదినమా?
హమ్మయ్యా ద్విభువనదర్శనం జరిగింది పాదాభివందనంలో
నిన్నామొన్నా చెడ్డీవేసుకుని తిరిగినట్టే వుంది
ఎంత ఎదిగిపోయావో... శీగ్రమేవ కళ్యాణ .....
ఏం తింటారో...రోటీ ...బోటీ..
గడ్డకట్టుకుపోతుందిరా బాబు..

ఇంకా లేవరే లంచ్ అవర్ కదా
అప్రాచ్యపు ముం..కొడుకులు
ఏదో తెచ్చేవుంటారు.. ఎండువో పచ్చివో
ఈ మూలక్కూర్చుంటే పోలా...
రేణుక కూడా ఇక్కడే ..
ఎంటా తిండి?... నీవయసులో మేము ...
ఇలా తింటే ఇంక మొగుడుదగ్గర చేతులెత్తెయ్యడమే ....... దీని దుంపతెగ ఫీల్ ఐనట్టుంది..
మళ్ళీ హెరాస్మెంట్ అంటే? గ్రివియన్స్ సెల్ ....
ఏదో పెద్దముండావాడ్ని... తండ్రిలా చెప్పానమ్మాయ్
......గండం గడిచింది

ఏమోయ్ రంగనాధం కాసిన్ని టీనీళ్ళు
వెళ్దామేమిటీ...?
సొంగ వెధవ ఎప్పుడూ అటే చూపు
ఏవిటీ ఎప్పుడూ చూపులేనా పనేమైనా అయ్యిందా?
వుఫ్... వూదుకుంటూ వుంటే చల్లబడిపోదూ టీ
నెలకెన్ని సార్లౌతుందటా ....?
ఎన్నిసార్లు తీసుకుంటుందిట మూడ్రోజుల లీవు?
.... గోక్కోడానికేలేదు టైం మనకు
రోజూ మూరలకొద్దీ తురుముకొని రావడానికి...
మొగుళ్ళకు సంసారాలు చేసే రకాలు కాదు

వెధవ బయోమెట్రిక్ అటెండెన్స్...
.తొందరగా వెళ్ళాలి కొంపకి
ప్లీజ్ ప్రెస్స్ యువర్ ఫింగర్ అగైన్ ...
వేళ్ళెట్టడానికి అనుభవం కావాలోయ్ ...
ఓ... చాపుకుని వస్తారు ఇంత పొడుగున

వచ్చెయ్ రాదూ..అదే దారిగా.. నే దించుతా
వుహూ... ఇదెందుకొస్తుందీ... బస్ లో ఐతే
ఆ తొక్కుడూ... రుద్దుడూ...

వెధవ కొంప ...
ఒంటిపొద్దు... వుప్పుడు పిండి చేశావుటే?
దొడ్లో నీళ్ళుతోడిచావు సంధ్యవార్చుకుని వచ్చేస్తా

త్రిరాచామేత్ ద్వి:పరిమృజ్య సకృదు పస్పృశ్య ......

హమ్మయ్యా... వొసేవ్ కాస్త కాళ్ళు పట్టు
ఎంతసేపూ ఆ మడ్డిమొకంతో సీరియల్ ఎవిటే?
ఆడదన్నాక కాస్త భక్తీ ముక్తీ అక్కర్లేదూ...
వెధవ పెంపకం... అంటగట్టాడు నీ బాబు
సరే వడ్డించి తగలడు
నెయ్యి నిండుకుంటున్నట్టుంది ఇంట్లో

బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్
బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణ ఆహుతం

తాంబూలం చుట్టావా....? ఇటుతగలెయ్..

ఏమేవ్.....
నిన్నే... అప్పుడే ముణగడదీసుకున్నావా?
అబ్బా ఇంటిముందు సుబ్బుగాడి కోడలు మెరుపూ
అకౌంటెంట్ పిల్ల కటి బలుపు.....
అదృష్టం వుండాల్లే ఎన్ని గుర్తుచేసుకుంటే మాత్రం
ఈ శిలాజిత్ లేకుండా పనౌతుందా?

ఓం చైతన్య మహాపురుషాయ నమ:
ఓం చైతన్య కుల్పురుషాయనమ:

(కాస్త అనుభవం... కాస్త ఆవేశం)

కవి సంగమం # 32 #

# అమృత #

ఆమె సన్నిధిలో కుల మతాల గొడవలుండవు
కుళ్ళుతో నిండిన హృదయాలుండవు
కల్తీ లేని ప్రేమ దొరుకుతుందక్కడ
ఆత్మీయ ఆలింగనాలకి కొదవ ఉండదక్కడ
కొత్త బంధాలకు పునాదులు పడతాయక్కడ
ఓ అపరిచితుడు అన్నో తమ్ముడో అయిపోతాడు
ఆజన్మాంతం ఆత్మీయ నేస్తంగా మిగిలిపోతాడు
అటు ఇటు తడుముకుంటుంటే 
నిప్పు ముట్టించడానికో చెయ్యి ముందుకొస్తుంది
హోదాలు పరపతులు ఏవీ గుర్తు రావు
ముసుగులు లేని నిజమైన మొహాలు అక్కడే చూడగలం

అయితే ....
దేవాలయాల్లోకి కుక్కలు దూరినట్టు
అక్కడికి దుష్టులూ వస్తుంటారు

ఆమెకి తన పర బేధాలు తెలీవు
పేద ధనిక తేడాలు తెలీవు
మంచి చెడులు నిజాలు అబద్దాలు తెలీవు
నానా వేదనా పీడితులు, బాధాసర్ప దష్టులు
భార్యా బాధితులు ఆమెకి అత్యంత ప్రియులు

తన ఘాటైన పరిమళాలతో ఆమె ఆహ్వానం పలుకుతుంది
నరాలలోనుండి, నాళాలలోనుండి ఎగబాకి
ఎంతటి వారినైనా తన వశం చేసుకుంటుంది
ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకొని ఓదారుస్తుంది
గుండెల నిండా గుట్టలు కట్టిన బాధల్ని పెకిలించి వేస్తుంది
పొరలు పొరలు గా పేరుకున్న మాలిన్యాన్ని కక్కిస్తుంది
ఆడిస్తుంది పాడిస్తుంది ఊగిస్తుంది పడదోస్తుంది
నవ్విస్తుంది ఏడిపిస్తుంది
ఆనక అమ్మలాగే జోకొట్టి కమ్మని నిద్రలోకి జారవిడుస్తుంది
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టునో లేదో గాని
జీవితంలో ఒక్కసారైనా ఆమె పెదవుల్ని పెదవులతో తాకని వాడు అ..గా..దై పుట్టున్

" ప్రపంచంలోని దేవుళ్ళంతా మనుషుల్ని వేరు చేస్తుంటే
ఈ ఒక్క దేవత అందర్నీ ఓ చోట చేరుస్తుంది"
అన్న మాటలు ఎంత నిజం

అందుకే

మనిషి దేవుణ్ణి సృష్టించే ,
దేవుడు మనుషుల్ని దోచుకునే
ఈ జగన్నాటకంలో దైవం ఒక మిధ్య కాబట్టి
అమరత్వం అందించే పానీయం అంతకన్నా పెద్ద బూటకం కాబట్టి
పేరుకే గానీ నిజంగా మనం మనుషులం కాదు కాబట్టి
రాక్షసులమని తెలియజెప్పడానికి
ప్రకృతి జగన్మోహిని ప్రసాదిస్తున్న హాలాహలాన్నే
అమృతగా మా పాలిట దేవతగా....

( మా జీవితంలో భాగమై మాతో ఎన్నో పంచుకున్న విశాఖ " వినాయక bar & restaurant " జ్ఞాపకలతో
యవ్వనం రసలీల అని పాడుకుంటూ
రేపటి మాట మరచిపోయి ఇవాళకి హాయిగా నవ్వుకుంటూ)