Friday 21 November 2014

కవి సంగమం # 31 #

 # ఆమె లేచిపోలేదు #


లేచిపోయింది 
హవ్వ... ఎంత కళ్ళు మూసుకుపోకపోతే అట్టా చేస్తుంది 
ఎంత మదం తలకెక్కకపోతే ఇంత బరి తెగిస్తుంది 
ఎంత అవమానం స్త్రీ జాతికెల్ల దీని వల్ల 
కట్టుకున్న వాడిది , కన్న వారిది అందరి పరువు ఏం గాననుకుంది 
బిడ్డలన్నా గుర్తు రాలేదా 
దీనికన్నా వేశ్యలు నయం కదా 
ఇంతకన్నా ఏ నూతిలోనో  దూకి చావరాదా 

అబ్బ 
ఎంత బావుంటుందో కదా 
ఇలా నీతి గట్టున నిలబడి మాట్లాడడం , నిందలెయ్యడం
పరమ పవిత్రత , పాతివ్రత్యం ముసుగుల్లో బతకడం 
మనసులో ఉన్న మాలిన్యాన్నంతా ఏదొక వేషం కింద నెట్టి నటించెయ్యడం 
ఆరోపించడం మాని ఆలోచించరాదా 
ఇంతటి విద్యావేత్తలు , ఉన్నతులు ..... మీకు తెలియనిదేముంది 
 ప్రపంచమంతా నాటకరంగమే అయినా ...
ప్రతీ నాలుగు గోడల మధ్య జరిగే సన్నివేశాలు వేరు కదా
మొహానికి నవ్వు రంగేసుకుని  తిరిగే దంపతుల 
గదిలో ఎన్నడూ నిశ్శబ్ధమె రాజ్యమేలుతుందేమో 
చీటికి మాటికి చిరుబురులాడుకునే వాళ్ళ మధ్యనే 
ఎప్పుడూ గాలికి కూడా చోటుండదేమో 
ఏం తెలుసు మనకి 

ఎవరికి తెలీదిక్కడ 
A woman gives least importance to the sex and
first priority to the love అని 
ఆమెకి కావలసింది నునుపు దేరిన కండలు 
ప్యాకులు గా విడిపోయిన దేహం 
facials వల్ల వచ్చే రంగు కాదని 
కావలసిందల్లా ప్రేమతో నిండిన నాలుగు మాటలేనని. 
స్త్రీ మనసును క్షుణ్ణంగా ఎరిగిన స్త్రీలే స్త్రీని నిందించడం ఎంత దారుణం 

ఆమెకక్కడ ఏం  కరువయ్యిందో ?
ఏ నిస్సహాయ క్షణం ఆమె మనసుని అతగాడి మీద పారేసిందో?
ఇది తప్పన్న స్పృహ మొదటిసారి తనువిచ్చినప్పుడు ఎంత కలిచివేసిందో ?
అతడు ఆమెలోని ఎవరూ ఎరుగని ఏ దుఃఖపు పొరని 
తన స్పర్శతో చీల్చి వేసాడో ?
హృదయాంతరాళాలలో దాగిన ఏ వేదనని తన సామీప్యంతో 
తుత్తునీయలు చేసాడో ?
ఏ త్రిశంఖు స్వర్గాల వెంబడి ఆమెని పయనింపజేసాడో ?
సంఘం , గౌరవము , తాళి , పాతివ్రత్యం కన్న గొప్పదనుకున్న 
ఏ స్వేచ్చా భావన ఆమెని అతని వెంట పరుగులు తీయించిందో 
ఏం తెలుసు మనకి ... నిదించండం ఎందుకు ?
సొసైటీ కోసం నటించగలగడం తప్ప జీవితం కోసం తెగించలేని మనకెక్కడిది 
అసలు మాట్లాడే హక్కు 
అందుకే 
ఆమె లేచిపోలేదు ..... తెంచుకుని వెళ్ళిపోయింది అంతే


22-11-2014


కవి సంగమం # 30 #

# అయస్కాంత క్షేత్రం #


అప్పటివరకూ అక్కడ అలుముకున్న చీకటిని
ఆమె తన రాకతోను , చిన్న చిరునవ్వుతోను వెలిగిస్తుంది
విద్యుచ్చక్తి ప్రవేశించినట్టుగా
అంతవరకూ నిర్జీవంగా పడి ఉన్న ప్రాణాల్ని ఒక్కసారిగా ఉత్తేజపరుస్తుంది
తను కూర్చున్న స్థలాన్నే కేంద్రంగా చేసుకుని అయస్కాంత క్షేత్రాన్ని
అంతటా పరుస్తుంది
మగాడి కనుచూపు చేరగలిగినంత మేర అది విస్తరిస్తుంది
It’s the basic design of human brain కావడం వల్ల
నాకూ అటు వైపు చూపు తిప్పడం తప్పదు
అంత అందం చూసాక ఒక్క క్షణం ఊపిరాగి ఉక్కిరిబిక్కిరవుతాను
అలవాటు పడ్డ కళ్ళు confirmation కోసం ఆమె కాళ్ళ వైపు చూస్తాయి
మూడు ముళ్ళు వేసి బంధించే భాగ్యం ఇంకా ఎవరికీ చిక్కలేదని
సంబరపడే లోపు అభ్యుదయ భావమొకటి నా పాదాలనూ చూసుకొనమంటుంది.
తరతరాల పురుషాధిక్యత ఆ భావాన్ని ఆ క్షణానికి dominate చేస్తుంది.
చూపులు , ఆలోచనలు ఆమె ఛాయలోనో , చెవి వంకీలలోనో
నుదుటి మీద పడ్డ కురులలోనో తప్పిపోయాక తమ ధర్మంగా
డిగ్నిటీ పెద్దరికాన్ని , పెద్దరికం డిగ్నిటీ ని గుర్తు చేస్తాయి ..
ఏ పుస్తకమో తీసి చదవడం మొదలెడతాను
ఏ హెడ్ ఫోన్సో పెట్టుకుని పాటలు వినడానికి tri చేస్తాను
అయితే ... అది ఇంతమందిని ఆకర్షిస్తున్న ఆమెని
నేను ఆకర్షించేందుకు చేసే ప్రయత్నంగా తోచి
వెంటనే మానుకుంటాను ..
నా మనసుని నేనే కంట్రోల్ చేసుకోలేని నిస్సహాయతకి సిగ్గుపడి
అక్కడనుంచి వెళ్ళిపోదామనే అనుకుంటాను
సరిగ్గా అప్పుడే ఆమె శరీరాన్ని విడిచి తొలగిందేదో నన్ను నిమంత్రిస్తుంది
ఆడ పిల్ల దుస్తులకి కూడా మగాడికి రక్తపోటు పుట్టించే శక్తినిచ్చిన
ప్రకృతిని తలుచుకుంటాను
మరోసారి నా మగపుట్టుక మీద జాలిపడతాను
ఆమె వెళ్ళిపోతుంది

ఉదయం నుంచి ఊరించి కురవకుండానే వెళ్ళిన మేఘంలా
మదిని మెలికలు పెట్టి చివరికి శృతి కాకుండానే చెదిరిన రాగంలా
ఆమె వెళ్ళిపోతుంది
నాకెన్నటికీ ఏమీ కాని ఓ అప్రాప్త సుందరి
చెప్పలేనంత బాధ రగిల్చి వెళ్ళిపోతుంది
how delicate is human’s heart

ఆమెని మరిచిపోదామనుకుంటూనే మరి మరి తలచుకొని నిద్రపోతాను
మనసు నా విచక్షణ పరిధి దాటిపోయాక
కూర్చున్న చోటునుండే వలయాల వెంబడి ప్రయాణించి ఆమెను చేరి
ఆమెను తాకి , ఆమె నవ్వు గుండెల్లోకి ఒంపుకుని,
ఆమె సుతిమెత్తని స్పర్శని తనువంతా నింపుకుని
ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు ముద్దాడి
నా నాడీ కేంద్రాన్ని ఆమె నాభీ కేంద్రంతో అనుసంధానం చేసే లోపు
...............
పక్కలో ఉన్న గురుత్వాకర్షణ శక్తి నడుము పై చెయ్యేసి
దంపతులకి మాత్రమే అర్ధమయ్యే భాషలో తన వైపు తిరగమంటుంది
అంతే
ఈ జన్మకీ ఇంతియే ప్రాప్తమన్న వాస్తవాన్ని గుర్తించి
అజ్ఞాత సుందరిని అక్కడే వదిలి
చెట్టు మీద నుండి పడ్డ ఆపిల్ పండులా కలల వృక్షం నుండి రాలిపోతాను..

( ఏ రైలు ప్రయాణంలోనో విసుగు చెందినప్పుడు , ఏ అనవసరమైన function లోనో తప్పక దొరికిపోయినప్పుడు , ఏ బోరింగ్ సభలోనో ఖచ్చితంగా కుర్చోవలసిన స్థితి దాపురించినప్పుడు దేవతల్లా మెరిసి, జీవితంలో ఈ కాస్త సమయం వృధా కాలేదన్న భావన కలిగించే ప్రతీ సుందరీ మణికి ఇది అంకితం)

కవి సంగమం # 29 #

# హే లక్ష్మణా ....హే ఊర్మిళా.... #

తల్లి కొంగు చాటున నేతి ముద్ద పప్పన్నం తిని పెరిగి
“ రోజులు బాలేదు బయటికెళ్ళకు” అన్న తండ్రి మాట
శిరసావహించి ఇంట్లోనే నాలుగు పలకల దెయ్యానికి అతుక్కుపోయి
ఆడుకునే , అల్లరి చేసే పిల్లల దగ్గర ఎప్పుడూ
మూడడుగుల డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ
వయసొచ్చాక మందుగాళ్ళని, పొగ రాయుళ్ళని పాపుల్లాగా చూస్తూ
saloon వాడు చేసే బాడీ మసాజ్ తోనే శారీరక సంతృప్తి పొందుతూ
అవకాశం కుదిరినప్పుడల్లా అద్దానికి అతుక్కుపొతూ
software ఉద్యోగం లో జాయిన్ అయ్యి మేల్ “ hardness” కోల్పోయిన
అభినవ లక్ష్మణులు
కేవలం కట్నం కోసమే పెళ్ళాడి
అన్నతో పాటు ఆలోచించకుండా అడవుల్లోకి పొతే
నాన్న మాట విని సంపాదన కోసం అజ్ఞాతంలోకి పొతే
కధల పేరో , కవి సంగమం పేరో చెప్పి మంచానికి మరో చివర
ముసుగు తన్ని పడుకుంటే ..

మూడు ముళ్ళు వేయించుకున్న పాపానికి
పురాణ సారమంతా పుర్రెలో నింపుకున్న అభినవ ఊర్మిళా దేవులు
మనో నిగ్రహం కోసం sleeping tablets మింగినా నిద్ర రాక
పాపం , పుణ్యం , పాతివ్రత్యాల concepts తెలియని
ఉప్పు , కారం శరీరానికి తలపెట్టిన ద్రోహానికి
ఎప్పట్నుంచో మాటేసిన పక్కింటి గోపాల కృష్ణుడి పక్కలో
ఆహ్ .......ఒక్క పది నిమిషాలు సేదతీరితే
తప్పంటారా అధ్యక్షా..??

కవి సంగమం # 28 #

/ నవ కవనం/

ఎప్పుడు చూడు
అవే కిటికీలోంచి పడక మీద పడే పున్నమి వెన్నెలలు
అవే మెడ మీంచి నడుము కింది వరకూ జారే జవరాళ్ళ జడలు
అవే ఆకాశం చూపించి అమ్మ పాడే జోల పాటలు
కొత్తవేం రాయరా ....?

అంటే

ఎందుకు రాయం రాస్తాం

మండు వేసవిలో కారం మిల్లు కార్మికుడి ఒంటి మీద పుట్టే మంట గురించి
గాజా సరిహద్దుల్లో ఉన్మాది ఆత్మాహుతి దాడిలో తెగి ఎగిరి పడ్డ కాళ్ళు చేతుల గురించి
సిరియా ఎడారుల్లో ISIS మతోన్మాది కత్తి కింద నలిగిన కుత్తుకుల గురించి
అభం శుభం ఎరుగని పసిపిల్ల కాయం మీద కామాంధుడు చేసిన గాయం గురించి
దేవతలనిపించుకుంటూ బలులు కోరే రాక్షసామూర్తుల ముందు తెగిపడ్డ ఎొట్టేళ్ళ తలల గురించి
దేముళ్ళ (రాళ్ళ) సాక్షిగా దేవాలయాల డిబ్బీల్లో సాగే దోపిడీ గురించి
జబ్బు తగ్గుతుందని స్వస్థత సభలకెళ్ళిన రోగి ఒంటి మీద జారిన ఆలీవ్ ఆయిల్ జిడ్డు గురించి

రాస్తాం
వస్తువులు చాలానే ఉన్నాయ్
కొత్త విత్తనాలు నాటి సరికొత్త కవిత్వం పండిస్తాం
విశ్వవీణా తంత్రులు మరోమారు శృతి చేసి నవీన రాగాలాలాపిస్తాం
సుగంధ ద్రవ్యాలు మేళవించి ఎన్నడూ తిననిదేదో రుచి చూపిస్తాం
అయితే .....

విని తట్టుకోగల చావ
తిని జీర్ణించుకోగల శక్తి నీకున్నాయా??

Friday 14 November 2014

కవి సంగమం # 27 #

మోహన్ తలారి ## Inevitable ##



" షిరిడి సాయి మహత్యం " సినిమాకి ఇళయరాజా 
మ్యూజిక్ కంపోజ్ చెయ్యకపోతే షిరిడి సాయి బాబా 
అడపా దడపా సచిన్ లాంటి వాళ్ళు కాళ్ళ మీద 
పడకపోతే పుట్టపర్తి బాబా 
కుల బహిష్కరణ చేయబడి గళమెత్తి యేసుదాసు 
కీర్తించకపోతే అయ్యప్ప 
దేముళ్ళలో (100 * 100 ?????? ) ఇంత ఫేమస్ 
అయ్యేవాళ్ళు కాదేమో కదా అన్నందుకు 
అసహ్యము , ఆశ్చర్యము కలగలిసిన చూపొకటి నాపై విసిరే 
modern superstitious theists మధ్యలో 
ఒక్కగానొక్క నాస్తికుడిగా మనలేక

BJP chance కొట్టడం వల్ల , మోడీ పగ్గాలు చేపట్టడం వల్ల 
హుదుహుద్ లాంటి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని వాపోయే 
foolish కిరస్తానీ కుటుంబంలో వారసుడిగా పుట్టిన పాపానికి

అమ్మ మీద , ఆవకాయ మీద , అంజలి మీద 
నవీన కవి పుంగవులు వ్రాసిన , వ్రాస్తూనే ఉన్న 
పుంఖాను పుంఖాల కవితలు చదివి 
విసుగు చెంది

ఆడపిల్ల తన చెప్పుకంటుకున్న bullshit ని ఫోటో తీసి షేర్ చేసినా 
సొంగ కార్చుకుంటూ likes కొట్టే 
పురుషుల మధ్యలో సాటి పురుషుడిగా మెలగలేక

lunatics కి psychopaths కి మధ్య జరిగిన సృష్టి కార్యానికి 
జనించిన ఎంతో మంది imbeciles నడుమ 
మామూలు మనిషిలా బతకాలనుకోడం కష్టమనిపించి

ప్రేమించిన తొలి నాళ్లలో you are incredible అని 
విడిపోయే ముందు రోజు you are unbearable అన్న 
చెలి మాటలు గుర్తుకొచ్చి

ఎన్నాళ్ళుగానో అణిచి పెట్టుకున్న బాధ ఉప్పెనైతే..
ఏకాంతంలో 
కుటిలో చీకటిలో ( ఆగవయ్యా శ్రీశ్రీ ..కాస్తంత ఆవేశమొస్తే పూనెయ్యడమేనా) 
కనీస అక్షర జ్ఞానం లేని నాలాంటి వాళ్లకి కూడా 
కవిత్వం రాసుకోడం inevitable అయిపోతుంది 
" బాధకి పర్యాయపదం కవిత్వమేగా" 
అన్న మహానుభావుడికి మనసులోనే నమస్కరిస్తూ


14-11-2014

Thursday 13 November 2014

కవి సంగమం # 26 #

# Beauty of juvenile love #

అప్పుడున్న ప్రేమ ఇప్పుడెందుకు లేదు అన్నావ్ కదా
చెప్తా విను
అప్పుడసలు నీకేం తెలుసు
నువ్వొక ఆడపిల్లవని కూడా తెలీదు

మా ఇంటి గుమ్మం ముందు ఎదురు చూస్తున్న నన్ను
భుజం మీదనుంచి జారిపోతున్న బ్యాగు ఎగదోసుకుంటూ పరుగున వచ్చి
చెయ్యి పట్టుకుని స్కూలుకి నడిపించడం నాకింకా గుర్తుంది
మనిద్దరం అష్ట చెమ్మ ఆడినప్పుడు మోకాలు పైకి తొలిగిన స్కర్టుని అలాగే వదిలేసి
ఓడిపోయిన నన్ను ఎక్కిరించడం ఎంతో బావుండేది
మామిడి పండు తినడం రాక మూతికంతా చేసుకుంటే
చెయ్యి తడుపుకుని ఎన్నిసార్లు తుడిచాను నేను
ఎంత స్వచ్చత , ఎంత నిష్కల్మషం
ఆ మట్టి నిండిన గోళ్ళ చేతులతోనే ముద్దలు చేసి తినిపించేదానివి
“ తల దువ్వుకోవే “ అన్నందుకు నా జుట్టు చెరిపేసి నవ్వుతూ పరుగెత్తేదానివి
ఎక్కడా నటన లేదు ...అతా నిజం

మరిప్పుడు
నీ చూపు , నీ నవ్వు అంతా అబద్దం
కృత్రిమంగా తెచ్చి పెట్టుకున్న అందం నీ సహజ సౌదర్యాన్ని చంపేసింది
ఎందుకంత ఆడంబరం అంటే self satisfaction అని మళ్ళీ అబద్దం
పువ్వులకి రంగులు , వాసన ఎందుకో నాకు తెలీదా
ఆశగా చూస్తూ తిరిగే తుమ్మెదల కోసం కాదా
“ పురుషుణ్ణి చూడగానే కట్టు సర్దుకోవాలన్న స్పృహ కలిగిన ప్రతీ స్త్రీలోనూ
ఎంతో కొంత జారత్వం ఉన్నట్లే “ ఎంత బాగా చెప్పాడు కదా చలం
అయినా నేను మాత్రం ...
అప్పట్లా నిగ్రహంగా నీ పక్కన ఎంతసేపు నిలబడగలను!!
adrenaline rush అంటారే...అది నన్ను కూడా ఎంతో కొంత చెడగొట్టింది
కోరికతో నిండిన ఆ కళ్ళని చూస్తూ
వణుకుతూ ఆహ్వానం పలుకుతున్న పెదవుల్ని చూస్తూ
పైగా అలాంటిదేమీ లేదన్నట్టుండే నవ్వుని చూస్తూ
sexual urge కి ఆజ్యం పోసే perfume fragrance పీలుస్తూ
ఏదో ఒక బలహీన క్షణంలో నేనూ control తప్పుతాను
ఇంకేముంది
కామోధ్రేకం కట్టలు తెంచుకున్న చోట ప్రేమ సమాధి అయినట్టేగా
అందుకే ....ఇప్పుడిక ప్రేమించలేను 

Wednesday 12 November 2014

కవి సంగమం # 25 #

## BREAK UP ##

ఒక్కసారి ఆలోచించు 
ఆ ఒక్క లోపాన్నీ 
నా సరిదిద్దుకోలేని తనం 
నీ క్షమించలేని తనం కాదా 
ఈనాడు నీవక్కడ వేల ప్రశ్నల మధ్య వేగడానికి 
నేనిక్కడ నీ స్మృతి చితులలో పడి కాలడానికి కారణం 
ఏం బావుకున్నాం విడిపోయి 
అర్ధం లేని ఆవేశాలకి పోయి మనం చెల్లిస్తున్న
మూల్యం విలువ ఎంతో లెక్కగట్టావా ఎప్పుడైనా 
ఎంతో ప్రేమతో పోత పోసుకున్న గాజు బొమ్మని చేజేతులా పగలగొట్టాం 
ఏం మిగిలింది 
చందమామల లాంటి కళ్ళ చుట్టూ చీకటి వలయాలు 
నడిరాత్రి జ్ఞాపకాల వేధింపులకు సాక్షులుగా insomnia మిగిల్చిన గుర్తులు 
ముందుకే గాని వెనక్కి తిరగని కాలగమనంలో 
మనసెప్పుడో చచ్చినా శరీరం పడుతూ , లేస్తూ బ్రతుకు
 ఈడుస్తూనే ఉంది .
అందరినీ సమాన దృష్టితో చూసే alcohol 
అవసరమైనప్పుడల్లా ఆదుకుంటుంది
" ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా" అని పాడడం 
అందరి సంగతి ఏమో గానీ నా వల్ల మాత్రం కాదు 
గంపెడు విషాదాన్ని, తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు వెనక కప్పెట్టి 
"this is my better half"  అని introduce చేయగలిగేంత 
so called maturity నాకింకా రాలేదు..
Living well is the best revenge
time heals everything 
లాంటి మాటలు పూర్తిగా అర్ధం కావడానికి 
నాకింకా చాలా సమయం పట్టొచ్చు 

అందుకే ఒక చిన్న విన్నపం 

మన ప్రణయ ప్రయాణంలో అడగకుండానే ఎన్నో ఇచ్చావ్ 
ఆఖరిగా ఈ ఎడబాటులో ఒక్క వరం అడుగుతున్నాను 
దయచేసి కలలో కూడా ఎప్పుడూ నన్ను  
కలుసుకునే ప్రయత్నం చెయ్యకు.

12-11-2014

Monday 10 November 2014

కవి సంగమం # 24 #

 #ప్రతి తండ్రీ దైవమేనా ?#


అవసరం కోసమో , అయిష్టతతోనో కాక
పెళ్ళికి ముందో , తర్వాతో నిజంగానే ఆమె మీద మనసు పడి
కామోద్రేకంతో కాక స్వచ్చమైన ప్రేమతో ..
making love అన్న మాట తప్పు కాదని రుజువు చేసినందుకు
ఏ అపురూప క్షణంలోనో వేల కోట్ల సహచరులను దాటి దూసుకెళ్ళి
Smallest cell in the human body
Largest cell in the human body తో కలిసి సృష్టించే అద్భుతాన్ని చూడాలని
కడుపులో పడడం తెలిసినప్పటి నుండి
రెండు ప్రాణాల్నీ కంటికి రెప్పలా కాచుకొని
పుట్టిన వెంటనే తొలి ఏడుపు విని
ఆనందం అంబరమై తనూ కన్నీళ్లు పెట్టుకుంటాడే
వాడినే తండ్రి అంటాను నేను ...

సంఘం కోసం కాక తన సంతృప్తి కోసం
అహొరాత్రాలు శ్రమించి , రెక్కలు ముక్కలు చేసుకొని
ఆస్తులివ్వకపోయినా బిడ్డలకి బోలెడంత అనురాగాన్నిచ్చి
తిరిగి ప్రేమ తప్ప  ఏమీ ఆశించని తండ్రినే
దైవం అంటాను నేను ...

తాగిన మత్తులోనో, మదం నెత్తికెక్కిన మరుక్షణంలోనో
ఆమె ఇష్టంతో  ఏమాత్రం సంబంధం లేకుండా
భార్యనయినా అట్లా అనుభవించడం పచ్చి మానభంగం అని తెలిసినా
పక్క మీద కూడా పురుషాధిక్యత ప్రదర్శించి చిందించిన body waste
ఏ దౌర్భాగ్య ఘడియలోనో సంతతి గా పరిణమిస్తే
అప్పుడు కూడా వాడిని తండ్రే అందామా ?
జన్మనిచ్చాడు కాబట్టి దైవమనే అందామా


ఒక్క మనిషికి తప్ప మిగిలిన అన్ని జీవులకి
Sex is just for perpetuation of their race
పిల్లల్ని కంటున్నామన్న పూర్తి స్పృహతో సంభోగించడం
మనిషి జన్మకి మల్లె ఏ మాత్రం accidental కాదు
మరిక ఏ విధంగా మనం వాటికన్నా గొప్ప

అక్కడికేదో ఏళ్ల తరబడి తపస్సు చేస్తే
ఏ ఒక్కరికో మాత్రమే దొరికే వరంలాగ
“జన్మనివ్వడం” అన్న విషయాన్ని అంత గొప్పగా మాట్లాడడమెందుకు
ఎవరికి E విటమిన్ లోపం ఈ దేశంలో
అయినా అమ్మతో పోలిస్తే కనడానికి నాన్న పడే కష్టం సున్నా కదా

నీతి రాతలు అందరికీ వర్తించవు
నాన్న చిన్నతనంలో ఆ గోడ దగ్గరే ఎందుకు నిలబడేవాడో
అర్ధరాత్రి అమ్మ మోకాళ్ళలో తల పెట్టుకుని ఎందుకు ఏడ్చేదో
అమ్మ లేనప్పుడే ఆమె ఇంటికెందుకొచ్చేదో
ఎప్పుడన్నా నిలదీస్తే ఎందుకు బెల్టు ఒంటి మీద తెగిపోయేదో
పసి వాడికి తెలీకపోవచ్చు
పెద్దయ్యాక తెలీక చస్తుందా

అందుకే
మాతృదేవోభవ , పితృ దేవోభవ ..అన్నిసార్లూ నిజం కాదు

10-11-2014

Sunday 9 November 2014

కవి సంగమం # 23 #

# Personified Beasts #

  
ఏడాది మొత్తం ఎంతో ఆప్యాయంగా పెంచి
బిడ్డల ఆలనా పాలానా కూడా పట్టించుకోక
చోళ్ళు, గంట్లు, జీడిపప్పులు పెట్టి మేపి
సంక్రాతి బరిలో దింపి
మనుషలకి మల్లె జెలసీ , ద్వేషం , ఉక్రోషం లాంటి ఏ రోగాలు లేని
స్వచ్చమైన స్వజాతి పక్షుల మధ్య వైరం ఉసి గొల్పి
ఊరికే ఎగిరి తన్నుకుంటుంటే అంత రసవత్తరంగా అనిపించక
కాళ్ళకి కత్తులు కట్టి
దేహం తెగి నెత్తురు ఈకలకి కొత్త రంగద్దుతుంటే
కళ్ళు బైర్లు కమ్మి తూలిపోతుంటే
ఇక చాలని చావుని ఆహ్వానించే సరికి
మొహం మీద నీళ్ళు చిమ్మి మళ్ళీ బ్రతికించి
పోరాడి ఓడి కూలబడిన పుంజుని
ఉక్రోషం ఆపుకోలేక కొన ప్రాణం తీసేసే పందెం రాయుడికి
ఆ ఆట చూసి చప్పట్లు కొట్టే ఆహూతులకి

ఏ విహారానికో వచ్చి పొరపాటున చిక్కిన టూరిస్టునో
తెగించి ఏదో చేద్దామని వచ్చిన జర్నలిస్టునో
యుద్దభూమి లో దొరికిపోయిన సైనికుడినో
బంధించి
ఈడ్చుకెళ్ళి చేతులు కట్టేసి , మోకాళ్ళ చిప్పలు విరిచేసి
వృషణాలని కసిగా నలిపి మానభంగం చేసి
తూలి కింద పడుతుంటే మూత్రం చల్లి లేపి
ఏ జీపుకో కట్టి ఎడారుల్లోకి ఈడ్చుకెళ్ళి
మొండి కత్తితో గొంతు కోస్తూ
నరాలు పర పరా తెగే శబ్దాన్ని ఆస్వాదిస్తూ
చిమ్మిన నెత్తురులోని వెచ్చదనాన్ని ఆహ్లాదిస్తూ
దృశ్యాన్ని చిత్రీకరించే మతోన్మాదికి
ప్రత్యక్షంగానో , పరోక్షం గానో అది పదే పదే చూసి
సంతృప్తి చెందే వీక్షకులకి

నాకెందుకో తేడా కనబడదు ..


అందరూ
ఎవరి ఆలోచనా పరిధిలో వాళ్ళు కరెక్ట్
పరిధి దాటితే నిజాలు నిగ్గు తేలతాయ్
అందుకే ఆలోచించాలంటే మనకి భయం
Comfort zone లో బ్రతకడానికే కాదు...
ఆలోచించడానికీ అలవాటు పడిపోయాం...
ప్రేరణ ఏదయినా కావచ్చు
బహుశా వాడికి డబ్బు , వీడికి మతం
ప్రాణం ఏదయినా ప్రాణమేగా
పుట్టుకతోనే మనమంతా క్రూరులం
మనిషి ముసుగులో బ్రతికేస్తున్న మృగాలం ..

09-11-2014